మంగళవారం దక్షిణ కొరియాలో మొయిబా సంస్థతో కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను చూపుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం దక్షిణ కొరియా వెళ్లిన పరిశ్రమలు, ఐటీల శాఖ మంత్రి కె.తారక రామారావు తొలి రోజున అక్కడి పలు వ్యాపార సంస్థల సీఈఓలు, ప్రతినిధులతో సమావేశమయ్యారు. తెలంగాణలో వ్యాపార, పెట్టుబడుల అవకాశాలను వివరించి.. ఆటో మొబైల్, టెక్స్ టైల్స్, ఫార్మా, ఐటీ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ కార్పొ రేషన్ కార్యనిర్వాహక ఉపాధ్యక్షులు నామ్ గుహ్నో, హ్యుందాయ్ రోటెమ్, గ్లోబల్ రైల్వే విభాగం డైరెక్టర్ కేకే యూన్‌తో సమావేశమై తెలంగాణలో ఆటో మొబైల్ రంగానికి ఉన్న సానుకూలతలు, పెట్టు బడుల అవకాశాలను వివరించారు. టీఎస్ ఐపాస్ ద్వారా సింగిల్ విండో విధానంలో పారిశ్రామిక అనుమతులు ఇస్తామని వివరించగా.. ఈ విధానం బాగుం దని హ్యుందాయ్ ప్రతినిధులు ప్రశంసించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 33 దేశాల్లో కార్యకలాపాలు కొనసా గిస్తున్న అగ్రగామి గ్రీన్ ఎనర్జీ కంపెనీ ఓపీఐ సీఈఓ వుహైన్ లీతోనూ కేటీఆర్ సమావేశమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వా నించారు.
‘మొయిబా’తో సహకార ఒప్పందం
మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోసియేషన్ (మొయిబా) సీఈవో చొయ్‌డాంగ్ జిన్‌తో మంత్రి కేటీఆర్ సమావేశమై.. ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగనున్న ప్రపంచ ఐటీ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. 500కు పైగా కంపెనీల నుంచి సభ్యులు కలిగిన ఈ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, వర్చువల్ రియాలిటీ, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ తదితర అంశా ల్లో మొయిబా, రాష్ట్ర ప్రభుత్వం పరస్పర సహకారం కోసం ఈ ఒప్పందం కుదిరింది.
‘టెక్స్‌టైల్’లో పెట్టుబడులు పెట్టండి
కొరియా టెక్స్‌టైల్స్ పరిశ్రమల సమాఖ్య చైర్మన్ కిహుక్ సుంగ్, ఇతర టెక్స్‌టైల్స్ కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలు, టీఎస్ ఐపాస్ ప్రాముఖ్యతను వివరించారు. తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న కాకతీయ మెగా టెక్స్‌టైల్స్ పార్కు ఆ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయ ప్రదేశమని.. పెట్టుబడులకు ముందుకొచ్చే కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. కాగా కిహుక్ చైర్మన్‌గా ఉన్న యంగ్వాన్ సంస్థ ఇప్పటికే కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో 300 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,000 కోట్లు) పెట్టుబడి పెట్టేందుకు అంగీకారం తెలిపింది. నార్త్ ఫేస్ బ్రాండ్ పేరుతో ఆ కంపెనీ వస్త్రాలను ఉత్పత్తి చేస్తుంది. మరో టెక్స్‌టైల్ సంస్థ ‘హ్యోసంగ్’ ఉపాధ్యక్షుడు జే జూంగ్ లీతోనూ కేటీఆర్ సమావేశమై టెక్స్‌టైల్స్ పార్కులో పెట్టుబడులు పెట్టాలని కోరారు. అనంతరం కొరియా డయింగ్ అండ్ ఫినిషింగ్ టెక్ ఇన్‌స్టిట్యూట్ (డైటెక్)ను పరిశీలించి.. ఆ సంస్థ అధ్యక్షుడు యూన్ నామ్ సిక్‌తో సమావేశమయ్యారు. టెక్స్‌టైల్ పార్కులో వాటర్ ట్రీట్‌మెంట్, మానవ వనరుల నిర్వహణ వంటి అంశాల్లో సాంకేతిక సహకారం అందించాలని కోరారు. మరో ప్రముఖ టెక్స్ టైల్ దిగ్గజం కోలాన్ గ్రూపు ప్రతినిధుల తోనూ కేటీఆర్ సమావేశ మయ్యారు.
కొరియా టెక్స్‌టైల్ సిటీ పరిశీలన
కొరియన్ టెక్స్‌టైల్స్, ఫ్యాషన్, హైటెక్నాలజీ పరిశ్రమలకు కేంద్రమైన దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది. ఆ నగర డిప్యూటీ మేయర్ కిమ్ యాన్ చాంగ్‌తో సమావేశమై అక్కడ టెక్స్‌టైల్ పరిశ్రమల ప్రగతిపై చర్చించారు. దైగు నగర ఇన్నోవేషన్, ఆర్థిక విభాగ బృందంతోనూ సమావేశమై గేమింగ్, గ్రాఫిక్స్ రంగం కోసం హైదరాబాద్‌లో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ ప్రాజెక్టులో భాగస్వాములవ్వాలని కోరింది. మంత్రి వెంట ప్రభుత్వ సలహాదారు జి.వివేక్, పరిశ్రమల ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌లు ఉన్నారు.
ప్రభుత్వ సలహాదారు వివేక్, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్
టెక్స్‌టైల్స్ పారిశ్రామికవేత్తలతో కేటీఆర్ బృందం
Comments
Please login to add a commentAdd a comment