నాణ్యత ప్రమాణాలు పాటించండి
నెల్లూరు(పొగతోట): పాఠశాలల తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సర్వశిక్ష అభియాన్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు ఆదేశించారు.
నెల్లూరు(పొగతోట): పాఠశాలల తరగతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సర్వశిక్ష అభియాన్ ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆర్. ముత్యాలరాజు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతలోపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిర్దేశించిన సమయంలోపు నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. ఓ ప్రణాళిక ప్రకారం పనులు చేయాలన్నారు. కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలన్నారు. పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థినులను గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నారు. లేనిపక్షంలో తల్లిదండ్రులు వారికి వివాహాలు చేసే అవకాశం ఉందన్నారు. విద్యాలయాల్లో వైద్యసేవలు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. బడిబయట పిల్లలను పాఠశాలల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి స్కూలుకు ప్రహరీ నిర్మించాలన్నారు.
విద్యార్థులకు ప్రత్యేక తరగతులు
గురుకుల పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో వంద శాతం ఫలితాలు సాధించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ముత్యాలరాజు సూచించారు. అందుకోసం ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. సమీక్ష సమావేశాల్లో జేసీ–2 రాజ్‌కుమార్, సర్వశిక్ష అభియాన్ పీఓ కనకనరసారెడ్డి, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.