పంచ పాండవులు మంచం కోళ్లలా ముగ్గురుంటారని రెండు వేళ్లు చూపించి ఒకటి అంకెను పలకపై రాశాడన్నట్టు ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య.
* జిల్లాలో 113 స్కూళ్లలో 501 సిస్టమ్స్
* పనిచేసేవి కొన్నే.. బాగు చేసేదెప్పుడో?
ఏలూరు సిటీ : పంచ పాండవులు మంచం కోళ్లలా ముగ్గురుంటారని రెండు వేళ్లు చూపించి ఒకటి అంకెను పలకపై రాశాడన్నట్టు ఉంది ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య. జిల్లాలో 113 స్కూళ్లకు మొత్తం 501 కంప్యూటర్లు అందజేసినట్టు రాజీవ్ విద్యామిషన్ అధికారులు చెబుతున్నా కొన్నిచోట్ల అవి కనిపించడం లేదు. మరి కొన్నిచోట్ల పనిచేయవు. కొన్ని రాజీవ్ విద్యామిషన్ అధికారులే ప్రత్యేక పనుల నిమిత్తం పట్టుకెళ్లారని చెబుతున్నారు. దానాదీనా తేలిందేమంటే అయిదు ఉండవలసినచోట మూడే కనిపిస్తాయి. అందులో రెండు పనిచేయవు, మిగిలిన ఒక్క దాన్నీ కూడా కుస్తీ పట్టాల్సిందే! ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే కంప్యూటర్ విద్య అందిస్తున్నామని చెప్పుకోవడానికే మినహా దీనివల్ల ఒనగూరేది శూన్యమనే విషయం సోమవారం నిర్వహించిన ‘సాక్షి’ విజిట్‌లో తేటతెల్లమైంది.
జిల్లావ్యాప్తంగా 113 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో కంప్యూటర్ ఆధారిత విద్య అమలు చేస్తున్నారు. ఐదేళ్లుగా ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్నా తూతూ మంత్రంగానే సాగుతోంది. ఒక్కో పాఠశాలకు ఐదు చొప్పున కంప్యూటర్లు అందించామని రాజీవ్ విద్యామిషన్ (సర్వశిక్ష అభియాన్) అధికారులు చెబుతున్నా.. స్కూళ్లలో మాత్రం అవి కన్పించడం లేదు. స్కూల్ ప్రధానోపాధ్యాయులను ప్రశ్నిస్తే ఇచ్చిన కంప్యూటర్లలో మూడో, నాలుగో సర్వశిక్ష అభియాన్‌కు ప్రత్యేక పనుల నిమిత్తం తీసుకువెళ్లారని జవాబిస్తున్నారు. కొన్నిచోట్ల మాత్రం తీసుకువెళ్లిన కంప్యూటర్లు యధావిధిగా రావని, పూర్తిగా పనిచేయకుండా చేసి మా మొహాన కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని స్కూళ్లలో కంప్యూటర్లు ఉంటాయి గానీ ఏదీ పనిచేయదు. బాగు చేయించేందుకూ అవకాశం లేని కంప్యూటర్లను ఏమి చేయాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.
పనిచేయనివే ఎక్కువ
సర్వశిక్ష అభియాన్ జిల్లాలో 501 కంప్యూటర్లు ఆయా పాఠశాలలకు అందించినట్టు రికార్డుల్లో పేర్కొంది. మరి ఈ కంప్యూటర్లన్నీ ఏమయ్యాయని ప్రశ్నిస్తే జవాబు ఉండదు. హైదరాబాద్ నుంచే ఈ కంప్యూటర్లు పంపుతున్నారని అధికారులు చెబుతున్నారు. అంటే అక్కడి నుంచే పనిచేయని వాటిని జిల్లాలకు పంపేస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరులో పవర్‌పేట నగరపాలక సంస్థ ప్రాథమికోన్నత పాఠశాలకు ఐదు కంప్యూటర్లు ఇచ్చారు. రెండు పనిచేయడం లేదు. మిగిలిన మూడు ఎస్‌ఎస్‌ఏ అధికారులు పనుల కోసం తీసుకువెళ్లారని చెప్పారు. తూర్పువీధిలోని మరో ప్రాథమికోన్నత పాఠశాలకు వెళితే అక్కడ ఐదు కంప్యూటర్లు ఉన్నాయి. కానీ ఒక్కటీ పనిచేయట్లేదు. హనుమాన్‌నగర్‌లోని ఎంపీయూపీ స్కూల్ లో ఒక కంప్యూటరే ఉంది. దానిపైనే ఐదారుగురు బాలికలు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. సుంకరవారితోట స్కూల్లో ఒక్క కంప్యూటరూ పనిచేయట్లేదు. ఇది ఏలూరుకే పరిమితం కాదు జిల్లావ్యాప్తంగా 113 పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి నెలకొందని తెలుస్తోంది.
బాగు చేయిస్తారా
ఈ విషయమై రాజీవ్ విద్యామిషన్ పీఓ ఎం. విశ్వనాథ్‌ను వివరణ కోరగా పాడైన కంప్యూటర్లను బాగు చేయించేందుకు స్కూలుకు రూ.2,500లు చొప్పున ప్రభుత్వం కేటాయించిందని, నాలుగు రోజుల క్రితం టెండర్లు పిలిచామని తెలిపారు. అయితే జిల్లాలో ఎన్ని కంప్యూటర్లు పాడయ్యాయి? ఈ నిధులు సరిపోతాయా? అన్న ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానం లేదు. ఎప్పుడు టెండర్లు ఆమోదిస్తారో ? ఏనాటికి వీటిని బాగు చేయిస్తారో? ఎప్పటికి విద్యార్థులకు కంప్యూటర్ ఆధారిత విద్య అందిస్తారో ప్రభుత్వానికే తెలియాలి!