ఎస్‌ఎస్‌ఏలోనూ జన్మభూమి కమిటీల - పెత్తనం!
ఈ మేరకు ప్రభుత్వ నిర్ణయంపాఠశాలల నిధులను
కొల్లగొట్టేందుకేనంటున్నఉపాధ్యాయ సంఘాల నేతలు
వెంటనే ఎస్‌ఎంసీలనుపునరుద్ధరించాలని డిమాండ్
సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు రాకతో పాఠశాల దశ,దిశ మారిందని చెప్పవచ్చు. ప్రతియేటా కేంద్ర ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ ఖర్చులకు నిధులను కేటాయిస్తోంది. ప్రాథమిక పాఠశాలకు రూ.7 వేలు, ఉన్నత పాఠశాలకు రూ.12 వేలు మంజూరు చేస్తుంది. వీటితోపాటు పాఠశాలకు మంజూరయ్యే భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్లు, బాత్‌రూంలు, నీటి సౌకర్యాలను కల్పించేందుకు విడుదలయ్యే నిధులను స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీల ఆమోదంతో ఖర్చు చేయాలి. చెక్‌పవర్ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్, పాఠశాల హెచ్‌ఎంకు ఉంటుంది.
ఏడాది క్రితమే రద్దైన ఎస్‌ఎంసీలు
పాఠశాలలో చదివే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక్కరినీ స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ చైర్మన్‌గా నియమిస్తారు. ఈయనతోపాటు మరికొంతమంది తల్లిదండ్రులు సభ్యులుగా ఉంటారు. కమిటీకి రెండేళ్ల కాలపరిమితి ఉంటుంది. గతంలో 2013-14, 2014-15 విద్యా సంవత్సరానికి ఎస్‌ఎంసీను నియమించారు. దీని కాలపరిమితి ముగిసి ఏడాదైంది. కొత్త కమిటీని నియమించాల్సిన ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా ఎస్‌ఎంసీలు లేవనే సాకుతో ఇటీవల ఎస్‌ఎస్‌ఏ నిధులను వినియోగానికి జన్మభూమి కమిటీల అనుమతితో వాడుకోవాలని నిర్ణయం తీసుకుంది.
జన్మభూమికమిటీల తీరుపై ఆరోపణల వెల్లువ
ఇప్పటికే సంక్షేమ పథకాల అమల్లో జన్మభూమి కమిటీల అక్రమాలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దరఖాస్తుదారులు, లబ్ధిదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో పాఠశాలల్లో వాటి ప్రవేశంపై ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వచ్చే అరకొర నిధుల్లో వాటా అడిగితే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
ఎస్‌ఎంసీల అకౌంట్లలో రూ.2.17 కోట్లు జమ
గతంలో ప్రభుత్వం ఎస్‌ఎంసీల నుంచి తీసుకున్న 2.17 కోట్లను తిరిగి జమ చేసింది. స్కూల్ గ్రాంట్ కింద రూ. 93 లక్షలు, నిర్వహణ నిధుల కింద రూ. 1.24 కోట్లు జమైనట్లు పీఓ వై.రామచంద్రారెడ్డి తెలిపారు.