బడి బిల్లు కట్టేదెవరు? | Transco notices to the Govt schools for Power bills | Sakshi
Sakshi News home page

బడి బిల్లు కట్టేదెవరు?

Published Tue, Oct 23 2018 1:16 AM | Last Updated on Tue, Oct 23 2018 1:16 AM

Transco notices to the Govt schools for Power bills - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్‌ బిల్లు చెల్లింపుపై సందిగ్ధం నెలకొంది. పాఠశాలల విద్యుత్‌ బిల్లుల చెల్లింపుల కోసం ప్రాథమిక విద్యాశాఖ విడుదల చేసిన నిధులు సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతో ఆ జిల్లాల్లోనే మగ్గిపోతున్నాయి. మరోవైపు పాఠశాలలు బిల్లులు చెల్లించకపోవటంతో ట్రాన్స్‌ కో అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఏంచేయాలో పాలుపోక అధికారులు తలలు పట్టుకుని కూర్చున్నారు. వాస్తవానికి గత విద్యా సంవత్సరం వరకు విద్యుత్‌ బిల్లులను కేంద్ర ప్రాయోజిత కార్యక్రమాలకు సంబంధించిన నిధులతో చెల్లింపులు జరిపేవారు. ఉన్నత పాఠశాలలకు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌(ఆర్‌ఎంఎస్‌ఏ), ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలలకు సర్వశిక్షా అభియాన్‌(ఎస్‌ఎస్‌ఏ) ద్వారా బిల్లులు చెల్లించేది. తాజాగా ఈ బిల్లు చెల్లింపులను ప్రభుత్వమే చేస్తుందని పాఠశాల విద్యాశాఖ(డీఎస్‌ఈ) స్పష్టం చేసింది. ఈమేరకు ఆ శాఖ సం చాలకులు టి.విజయ్‌కుమార్‌ గతనెలలో ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలల వారీగా పెండింగ్‌ బిల్లుల సమాచారాన్ని సేకరించి ప్రాధాన్యత క్రమంలో చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే డీఎస్‌ఈ నుంచి ఉత్తర్వులు వచ్చి నెలరోజులు గడుస్తున్నా వాటిపై క్షేత్రస్థాయిలో విద్యాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 

విద్యుత్‌ బకాయిలు రూ.18 కోట్లు 
రాష్ట్రంలో 26,114 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు నెలకు సగటున రూ.500 వరకు విద్యుత్‌ బిల్లు వస్తోంది. కంప్యూటర్‌ ల్యాబ్‌లు, డిజిటల్‌ తరగతి గదుల నిర్వహణతో పాటు ఇతర ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్‌ పరికరాల వినియోగాన్ని బట్టి బిల్లుల్లో మార్పులు ఉంటున్నాయి. దీంతో సగటున ఒక ఉన్నత పాఠశాలలో నెలకు రూ.వెయ్యి నుంచి రూ.5వేల వరకు విద్యుత్‌ బిల్లులు నమోదవుతున్నాయి. 2018–19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించిన విద్యుత్‌ బిల్లులను ఇప్పటివరకు చెల్లించలేదు. దీంతో దాదాపు ఆర్నెల్లకు సంబంధించి ప్రభుత్వ పాఠశాలల్లో రూ.18 కోట్ల మేర బకాయిలు ఉన్నట్లు అంచనా.

ఈ నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ ఇటీవల 13 జిల్లాలకు రూ.1.04 కోట్లు చొప్పున విడుదల చేసింది. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు రూ.40 లక్షలు, ఉన్నత పాఠశాలలకు రూ.64 లక్షలు విడుదల చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలల వారీగా బకాయిల వివరాలు తెప్పించుకుని ఆమేరకు చెల్లించాలని డీఎస్‌ఈ ఆదేశించింది. కానీ, ఆ 13 జిల్లాల్లో క్షేత్రస్థాయి నుంచి స్పష్టమైన సమాచారాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు సేకరించలేదు. దీంతో డీఎస్‌ఈ విడుదల చేసిన నిధులు ఆయా జిల్లాల్లోనే మగ్గిపోయాయి. మరోవైపు ఆర్నెల్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో ట్రాన్స్‌కో అధికారులు విద్యుత్‌ కనెక్షన్‌ను తొలగిస్తామంటూ నోటీసులు జారీ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement