టీచర్లకు పదోన్నతుల వెల్లువ | Promotions for Government School teachers in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

టీచర్లకు పదోన్నతుల వెల్లువ

Published Wed, Feb 9 2022 4:04 AM | Last Updated on Wed, Feb 9 2022 4:04 AM

Promotions for Government School teachers in Andhra Pradesh - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు త్వరలోనే భారీ ఎత్తున పదోన్నతులు లభించనున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలతో కూడిన నోట్‌ను పాఠశాల విద్యాశాఖ మంగళవారం అన్ని జిల్లా, డివిజన్, మండల విద్యా శాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు విడుదల చేసింది. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు, కార్యక్రమాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులకు మొత్తంగా పాఠశాల వ్యవస్థకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరనుందని ఆ నోట్‌లో పేర్కొంది. 

పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు ఇలా..
► 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్‌ చేయడం వల్ల వచ్చే జూన్‌లోగా 30 వేల మంది ఎస్‌జీటీలకు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులు వస్తాయి.
► రాష్ట్రంలో కొత్తగా 833 జూనియర్‌ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. తద్వారా పాఠశాలల్లోని స్కూల్‌ అసిస్టెంట్లకు జూనియర్‌ లెక్చరర్, గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులకు ప్రిన్సిపాల్‌ స్థాయి పదోన్నతులు లభించనున్నాయి. ప్రస్తుతం 41 మండలాల్లో మహిళా కళాశాలలు ఉన్నాయి. 202 మండలాల్లో అసలు కళాశాలలే లేవు. ఈ మండలాల్లో ఒక కో ఎడ్యుకేషన్, ఒక బాలికల జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. అంటే.. ఈ 202 మండలాల్లో కొత్తగా 404 జూనియర్‌ కాలేజీలు రానున్నాయి. మరో 429 మండలాల్లో ఒక్కో బాలికల కళాశాల ఏర్పాటు కానుంది. మొత్తంగా 833  కొత్త కళాశాలలు రానున్నాయి.
► మండల విద్యా శాఖ అధికారులు (ఎంఈవోలు) ఇక నుంచి పూర్తి స్థాయిలో విద్యా శాఖ బాధ్యతలు నిర్వహించేందుకు వీలుగా సెల్ఫ్‌ డ్రాయింగ్‌ అధికారాలు ఇవ్వనున్నారు. ప్రభుత్వం దీనిపై విధాన నిర్ణయం తీసుకుంది. మండల వనరుల కేంద్రంగా ఉన్న కార్యాలయాన్ని ఇక నుంచి మండల విద్యాశాఖ కార్యాలయంగా మార్చనున్నారు. ఎంఈవోలు దశాబ్దాలుగా ఈ డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ కార్యాలయంలో అవసరమైన సిబ్బందిని కూడా ప్రభుత్వం నియమించనుంది. 
► మండల స్థాయిలో ఇద్దరు ఎంఈవోలను నియమిస్తారు. డివిజన్, జిల్లా స్థాయిలోనూ పోస్టులు పెరగనున్నాయని నోట్‌లో విద్యా శాఖ పేర్కొంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement