76 వేలమంది టీచర్ల బదిలీ | Transfer Of 76 Thousand Teachers In AP | Sakshi
Sakshi News home page

76 వేలమంది టీచర్ల బదిలీ

Published Thu, Jan 14 2021 3:26 AM | Last Updated on Thu, Jan 14 2021 2:23 PM

Transfer Of 76 Thousand Teachers In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బదిలీ ఉత్తర్వుల జారీ ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఈనెల 17 వరకు ఆన్‌లైన్‌లో విభాగాల వారీగా బదిలీ ఉత్తర్వులు జారీచేస్తారు. బుధవారం 1,400 మంది ఎల్‌ఎఫ్‌ఎల్‌ (లో ఫిమేల్‌ లిటరసీ) హెచ్‌ఎంలకు బదిలీ ఉత్తర్వులను వెబ్‌సైట్‌ నుంచి జారీచేశారు. రాష్ట్రంలో మొత్తం 76 వేలమంది టీచర్లకు బదిలీలు జరుగుతున్నాయి. బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం, నోటిఫికేషన్‌ విడుదల చాలారోజుల ముందే మొదలైనా.. అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ పూర్తికావడానికి తీవ్ర జాప్యం జరిగింది. ఎదురైన అనేక సమస్యల్ని పరిష్కరిస్తూ పాఠశాల విద్యాశాఖ ఒక్కో దశను దాటుకుంటూ వచ్చింది.

వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా ఈ బదిలీలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఒకే స్కూలులో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న టీచర్లను, అయిదేళ్లుగా చేస్తున్న ప్రధానోపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేస్తున్నారు. బదిలీకి దరఖాస్తు చేయడానికి రెండేళ్ల కనిష్ఠ సర్వీసు పెట్టారు. ఇలా అన్నీ కలిపి.. మొత్తం 76 వేలమంది ఈ బదిలీ ప్రక్రియలోకి చేరారు. వివిధ ప్రాతిపదికల ఆధారంగా వారికి కేటాయించే పాయింట్లను బట్టి ఈ బదిలీ చేస్తున్నారు. తీవ్ర అనారోగ్య సమస్యలు, వితంతు ఉపాధ్యాయినులు.. ఇలా కొన్ని కేటగిరీల టీచర్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు.

వారికి వచ్చిన పాయింట్ల ఆధారంగా వారు ప్రాధాన్యక్రమంలో ఇచ్చిన పాఠశాలల వెబ్‌ ఆప్షన్లను అనుసరించి బదిలీ చేస్తున్నారు. బదిలీ ఉత్తర్వులు డౌన్‌లోడ్‌ చేసుకుని తాము పనిచేస్తున్న స్కూలు నుంచి రిలీవ్‌ అయి తమకు కేటాయించిన కొత్త స్కూలులో జాయిన్‌ అవ్వాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీచేశారు. బదిలీ అయిన టీచర్ల రిలీవ్, జాయిన్‌ ప్రక్రియను రీజనల్‌ జాయింట్‌ డైరెక్టర్లు, డీఈవోలు పర్యవేక్షించాలని పేర్కొన్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈనెల 18 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement