సాక్షి, రంగారెడ్డి జిల్లా: సర్వశిక్షా అభియాన్ జిల్లా విభాగం 2014-15 వార్షిక సంవత్సరానికిగాను రూ.192.69కోట్ల వార్షిక ప్రణాళిక రూపొందించి ప్రభుత్వానికి సమర్పించింది. సర్కారు ప్రణాళికను ఆమోదించినప్పటికీ.. ఒకసారి రూ.3కోట్లు విడుదలచేసి చేతులు దులుపుకుంది. దీంతో అందుబాటులో ఉన్న నిధులను ఖర్చుచేసిన అధికారులు.. నిధులు నిండుకోవడంతో పలు కార్యక్రమాలను ఎక్కడికక్కడ నిలిపివేశారు.
వాస్తవానికి వార్షిక ప్రణాళికలో రూ.192.69కోట్లు పేర్కొనగా.. ఇందులో సిబ్బంది వేతనాల కోసం రూ.80.55కోట్లు, విద్యార్థుల యూనిఫాం, పుస్తకాల కోసం రూ.11కోట్లు, పాఠశాల, టీచర్ల గ్రాంట్ల కోసం రూ.10కోట్లు, మౌలికవసతుల కల్పనకు రూ.55కోట్లు కేటాయించారు. ప్రణాళికలో అన్ని ప్రాధాన్యత అంశాలే అయినప్పటికీ.. నిధులు విడుదల కాకపోవడంతో పలు కార్యక్రమాలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో తాజాగా రూ.16.10కోట్లు విడుదల కావడంతో అధికారులకు పనికల్పించినట్లైంది.
వచ్చింది పదిశాతమే..
వార్షిక సంవత్సరం ప్రారంభమై తొమ్మిదినెలలు గడిచింది. ఈ క్రమంలో వార్షిక బడ్జెట్‌లో మూప్పావువంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. కానీ నిధులు విడుదల కాకపోవడంతో పలుకార్యక్రమాలు అటకెక్కాయి. ఎస్‌ఎస్‌ఏకు రెండునెలల క్రితం రూ.3 కోట్లు విడుదల చేసిన సర్కారు.. తాజాగా రూ.16.10 కోట్లు ఇచ్చింది. దీంతో ఇప్పటివరకు రూ.19.10 కోట్లు విడుదలయ్యాయి. అంటే వార్షిక ప్రణాళికలో కేవలం పదిశాతం మాత్రమే నిధులు వచ్చాయి. మార్చిలోగా ప్రణాళిక ప్రకారం నిధులు వస్తాయని అధికారులు చెబుతున్నప్పటికీ.. చివరి నిమిషంలో వచ్చిన నిధులను ఖర్చుచేసే అంశంపైనా సందేహాలు లేకపోలేదు.
వారంలోగా బడుల ఖాతాల్లోకి..
తాజాగా వచ్చిన నిధుల్లో పాఠశాల నిర్వహణ నిధుల, ఇతర గ్రాంట్లు కలిపి రూ.3.15 కోట్లు విడుదలయ్యాయి. వీటిని పాఠశాలల ఖాతాల్లోకి పంపిణీ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో వారం రోజుల్లో పాఠశాలలకు ప్రాధాన్యత క్రమంలో నిధులు విడుదల చేయనున్నట్లు సర్వశిక్షా అభియాన్ జిల్లా ప్రాజెక్టు అధికారి కిషన్‌రావు ‘సాక్షి’తో పేర్కొన్నారు.
ఎట్టకేలకు విదిల్చారు!
Published Fri, Dec 5 2014 11:37 PM | Last Updated on Tue, Jun 4 2019 6:37 PM
Advertisement
Advertisement