విద్యార్థుల వివరాలతోనే నిధుల విడుదల!
►ఆన్‌లైన్‌లో విద్యార్థుల నమోదుకు ఇదివరకే కేంద్రం ఆదేశాలు
►అయినా స్పందించని మదర్సాలు, ఎన్‌సీఎల్‌పీ కేంద్రాలు
►నిధుల దుర్వినియోగంపై వెల్లువెత్తుతున్న ఆరోపణలు
►నెలాఖరులోగా వివరాలు నమోదు చేయాలని ఎస్‌ఎస్‌ఏ గడువు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పాఠశాలలు, మదర్సాలు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్టు (ఎన్‌సీఎల్‌పీ) కేంద్రాల్లో విద్యార్థుల కోసం ఖర్చు పెట్టే నిధుల విషయమై ఇకనుంచి విద్యాశాఖ పక్కాగా వ్యవహరించనుంది. ఈ మేరకు విద్యార్థుల సంఖ్య ఆధారంగానే నిధులను కేటాయించనుంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది.
నిధుల దుర్వినియోగం జరిగినట్లు అనుమానాలు!
సర్వశిక్ష అభియాన్ ఆర్థిక సహాయంతో రాష్ట్రంలో 500 వరకు మదర్సాలు, ఎన్‌సీఎల్‌పీ కేంద్రాలు కూడా కొనసాగుతున్నాయి. వాటి నిర్వహణ కింద ఒక్కో విద్యార్థికి ఎస్‌ఎస్‌ఏ రూ. 6,500 వరకు నిధులను చెల్లిస్తోంది. ఇవికాకుండా సబ్జెక్టులు బోధించే వలంటీర్లకు ఒక్కొక్కరికి వేతనాలను కూడా ఎస్‌ఎస్‌ఏ ఇస్తోంది. ఇలా మొత్తంగా వాటి నిర్వహణకు ఏటా కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది. అయితే ఇన్నాళ్లూ వాటిల్లో ఎంత మంది విద్యార్థులు ఉన్నారన్న విషయాన్ని పట్టించుకోకపోవడం, మదర్సాల్లో వలంటీర్లను నియమించకుండానే నిధులను మింగేసినట్లు గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయంలో విద్యాశాఖ విచారణ కూడా జరిపింది. హైదరాబాద్‌లో ఈ అక్రమాల విషయంలో డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు సస్పెండ్ కూడా అయ్యారు.
మదర్సాల మౌనం...
విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసేందుకు మదర్సాలు ముందుకు రావడం లేదు. గతేడాది (2015–16) లెక్కల ప్రకారం రాష్ట్రంలోని మదర్సాల్లో 57,321 మంది విద్యార్థులు ఉన్నట్లు నిర్వాహకులు వివరాలిచ్చారు. ప్రస్తుత విద్యా సంవత్సరం కూడా అంతే మంది ఉన్నట్లు చెబుతున్నారు. కాగా ఇప్పటివరకు కేవలం 17,836 మంది వివరాలను మాత్రమే ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. ఇంకా 39,485 మంది వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదు. వారంతా ఉన్నట్టా? లేనట్టా? అన్నది ప్రశ్నగా మారింది. నిజంగా లేకపోతే ఇన్నాళ్లూ పేపరుపై లెక్కలు చూపించి, నిర్వహణ సంస్థలు నిధులను మింగేశారా? అన్న అనుమానాలు అధికారుల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 31వ తేదీలోగా విద్యార్థులు అందరి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని సర్వశిక్ష అభియాన్ తాజాగా మరోసారి ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఆన్‌లైన్లో విద్యార్థుల వివరాలను నమోదైన 17,836 మందికి సంబంధించి ఆధార్ లింకు కూడా పూర్తి కాలేదు. ఇప్పటివరకు అందులో కేవలం 8,804 మందికి సంబంధించి మాత్రమే ఆధార్ లింకు పూర్తయింది. ఇక ఆధార్‌తో అనుసంధానం చేస్తే విద్యార్థుల తాలూకు పూర్తి వివరాలు బయటపడునున్నాయి.