ఎన్సీఎల్పీ నిధులు పక్కదారి
* అవినీతి ఊబిలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం
* పిల్లలసంఖ్యను అధికంగా చూపి సొమ్ము చేసుకుంటున్న నిర్వాహకులు
* పట్టించుకోని ఉన్నతాధికారులు
బాలకార్మికుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేస్తున్నా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమితో అవి పక్కదారి పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ నేరుగా సమీక్షించాల్సిన జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన పథకం (ఎన్సీఎల్పీ) జిల్లాలో అవినీతిమయంగా మారింది. ఎవరికి వారు అందినకాడికి దండుకుంటూ పిల్లల నోటి కాడ కూడు లాగేసుకుంటున్నారు. ఈ విధంగానైతే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమేనా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
గుంటూరు వెస్ట్ : జాతీయ బాలకారిృక వ్యవస్థ నిర్మూలన పథకం(ఎన్సీఎల్పీ)లో భాగంగా జిల్లాలో నడుస్తున్న శిక్షణ కేంద్రాలు అవినీతిమయంగా మారాయి. జిల్లాలో పలు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కేంద్రాలు బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయి. పిల్లల సంఖ్యను అధికసంఖ్యలో చూపించి నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ ప్రాజñ క్టు అమలు బాధ్యతలు రిటైర్డ్ ఉద్యోగులు, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించారు. తమను ప్రశ్నించేవారే లేరనే ధీమాతో సెంటర్ల నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
జిల్లాలో 22 శిక్షణ కేంద్రాలు...
జాతీయ బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనా పథకం(ఎన్సీఎల్పీ) జిల్లాలో 1996 నుంచి అమలులో ఉంది. కేరళ మినహా దేశవ్యాప్తంగా 272 జిల్లాలో ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. జిల్లా కలెక్టర్ చైర్మన్గా, డీఆర్డీఏ పీడీ సెక్రటరీగా ఉండే ఈ పథకం ముఖ్య ఉద్దేశం బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన. జిల్లా వ్యాప్తంగా వినుకొండ, గుంటూరు, మంగళగిరి, నిజాంపట్నం, పిడుగురాళ్ల, తెనాలి, రెంటచింతల, సత్తెనపల్లి, రాజుపాలెం, బొల్లాపల్లి తదితర మండలాల్లో 22 శిక్షణా సెంటర్లు ఉన్నాయి. వాటిల్లో 1,112 మంది పిల్లలు ఉన్నట్లు పథకం నిర్వాహకులు చెబుతున్నారు. స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నడపబడుతున్న ఒక్కొక్క సెంటర్లో ఇద్దరు శిక్షకులు, అకౌంటెంట్, ఆయా విధులు నిర్వర్తిస్తున్నారు. మూడుసెంటర్లకు కలిపి ఒక ఒకేషనల్ శిక్షకుడు ఉంటున్నట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. ఒక్కో సెంటర్లో 50 నుంచి 60 మంది పిల్లలు ఉంటున్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవ పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. గుంటూరు నగరంలో ఐదు సెంటర్లు ఉండగా పొన్నూరు రోడ్డులోని సాయిబాబా కాలనీలో మినహా ఏ ఒక్క సెంటర్లో కూడా పిల్లలు లేక సెంటర్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. నల్లచెరువు 23వ లైన్లోని శిక్షణా కేంద్రంలో 50 మంది విద్యార్థులు ఉన్నట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. వాస్తవంగా అక్కడ 20 మందికి మించి పిల్లలు లేకపోవడం గమనార్హం. ఇటువంటి పరిస్థితులే జిల్లాలోని అన్ని సెంటర్లలో ఉన్నట్లు సమాచారం.
మధ్యాహ్న భోజనం మినహా సౌకర్యాలు శూన్యం..
1,112 మంది పిల్లలకు సై్టఫండ్ నిమిత్తం నెలకు రూ.1.66 లక్షలు అందిస్తున్నారు. అదేవిధంగా మధ్యాహ్న భోజనం కూడా అదే సంఖ్యలో పిల్లలకు వడ్డిస్తున్నట్లు లెక్కలు తయారుచేస్తూ నిధులు డ్రా చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. విద్యార్థులకు యూనిఫాం కూడా ఇంతవరకు అందించిన దాఖలాలులేవు. మధ్యాహ్న భోజనం మినహా ఇతర సౌకర్యాలేవీ పిల్లలకు కల్పించలేదని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు. శిక్షణా కేంద్రాలకు సమీపంలోని పిల్లలను పిలిచి మధ్యాహ్న భోజనం పెట్టి ఇంటికి పంపిస్తున్నారు. వీటిని పర్యవేక్షించాల్సిన అధికారులు కూడా మామూళ్ల మత్తులో జోగుతూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి ఎన్సీఎల్పీ జాతీయ కార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రాజెక్టులో జరుగుతున్న అవకతవకలను అరికట్టాలని కోరుతున్నారు.
తెనాలిలో....
తెనాలి ఐతానగర్లోనూ ఎన్సీఎల్పీ కేంద్రం ఉంది. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలను ఎన్సీఎల్పీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. ప్రధానోపాధ్యాయురాలు, ఇద్దరు ఉపాధ్యాయులు ఉన్నట్టు విద్యార్థులు తెలిపారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు చదువుతున్న తొమ్మిది నుంచి 14 ఏళ్లలోపు వయస్ను 50 మంది విద్యార్థులు ఉన్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు. కేంద్రాల నిర్వాహకులు రికార్డుల్లో చూపెడుతున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవానికి అక్కడ విద్యనభ్యసిస్తున్న సంఖ్యకు భారీ వ్యత్యాసం ఉన్నట్లు తెలుస్తోంది.