‘ఆదరణ' దిశగా అడుగులు
‘ఆదరణ' దిశగా అడుగులు
Published Wed, Sep 17 2014 11:57 PM | Last Updated on Sat, Sep 2 2017 1:32 PM
కర్నూలు(అర్బన్):
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అందని పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. టీడీపీ ప్రభుత్వం గతంలో అధికారంలో ఉండగా అమలు చేసిన ‘ఆదరణ పథకాన్నే తిరిగి అమలు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. వాల్మీకి.. వడ్డెర.. నాయీ బ్రాహ్మణ.. భట్రాజు.. రజక.. ఉప్పర.. కుమ్మర.. క్రిష్ణబలిజ.. విశ్వ బ్రాహ్మణ.. మేదర కులాలకు చెందిన ఫెడరేషన్లకు అనుబంధ సొసైటీల సభ్యులకు కుల వృత్తులను అభివృద్ధి చేసుకునేందుకు కార్యాచరణను రూపొందిస్తుండటం అందుకు బలం చేకూరుస్తోంది. ఆధునిక సాంకేతిక పరికరాలను అందించేందుకు చర్యలు చేపడుతోంది. ఈనెల 19న రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రత్యేకంగా అన్ని జిల్లాలకు చెందిన బీసీ కార్పొరేషన్ ఈడీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సమావేశానికి ఎన్నడూ లేనివిధంగా 10 బీసీ కులాలకు చెందిన సొసైటీల నుంచి ఇద్దరు చొప్పున సభ్యులను ఆహ్వానించారు. బుధవారం స్థానిక బీసీ కార్పొరేషన్ కార్యాలయంలో జిల్లాలోని బీసీ కుల సంఘాల నేతలతో ప్రత్యేక సమావేశమైన ఈడీ ఆ విషయాన్ని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో కుల వృత్తులను అభివృద్ధి చేసుకునేందుకు ఆధునిక సాంకేతిక పరికరాల వాడకంపై సలహాలు, సూచనలు అందించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా ఈనెల చివరి వారంలో ఆధునిక సాంకేతిక పరికరాలపై విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇక బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు హుళక్కేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత ఏడాది నుంచి అష్టకష్టాలు పడి బ్యాంకులు.. మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ తిరిగి దరఖాస్తు చేసుకున్న వారికి రుణాలు మంజూరు కానట్లేననే విషయం స్పష్టమవుతోంది. 2013-14 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో మొత్తం 4,861 మంది బీసీ వర్గాలకు ఆర్థిక చేయూతనందించేందుకు బీసీ కార్పొరేషన్ లక్ష్యంగా ఎంచుకుంది. ఆ మేరకు దరఖాస్తులు స్వీకరించినా.. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఉద్యమాలు, ఎన్నికల కారణంగా జాప్యం చోటు చేసుకుంది. తాజాగా టీడీపీ ప్రభుత్వ తీరు మొదటికే మోసం తీసుకొస్తోంది.
Advertisement