మురారిచింతలలో వైఎస్ జగన్ కు తమ కష్టాలు చెప్పుకుంటున్న వృద్ధులు
* రైతులు, డ్వాక్రా మహిళలు నష్టపోయారు
* ఎల్లకాలం ఈ ప్రభుత్వమే ఉండదు
* ప్రజల ఉసురు తగిలి ఇప్పటికే అల్లాడుతోంది
* మంచి రోజులు త్వరలోనే వస్తాయి
* పింఛన్ రాని వారి తరఫున న్యాయ పోరాటం
సాక్షి, కడప: ‘గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఏదీ చేయలేక చతికిలపడ్డారు. అటు రైతులు, ఇటు డ్వాక్రా మహిళలను నమ్మించి నట్టేట ముంచారు. నిరుద్యోగభృతి ఊసే లేదు. ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతూ కాంట్రాక్టు ఉద్యోగుల్లో అభద్రతా భావం నెలకొల్పారు. ఇదంతా చూస్తుంటే ఇది మోసకారి ప్రభుత్వమని స్పష్టమైంది’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పారబట్టారు. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, లింగాల మండలం మురారిచింతల గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్‌ను చూడగానే డ్వాక్రా మహిళలు రుణాల గురించి, వృద్ధులు పింఛన్ల గురించి ఆయన దృష్టికి తెచ్చారు.
డ్వాక్రా రుణానికి కంతులు కట్టలేకపోతున్నామని మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు. ఎవరూ భయపడాల్సిన అవసరంలేదని జగన్.. వారందరికీ ధైర్యం చెప్పారు. ‘రుణాలు కట్టవద్దు.. అధికారంలోకి రాగానే అన్ని రుణాలు మాఫీ చేస్తామ’ని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు చివరకు డ్వాక్రా మహిళలకు రూ. 10 వేలు ఇస్తానని ప్రకటించి.. ఖజానా ఖాళీ పేరుతో రూ.3 వేలకు దానిని పరిమితం చేశారన్నారు. అది కూడా పెట్టుబడి నిధి కింద జమ చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. అందరి తరఫున తాను ఈ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తానన్నారు. కొద్ది రోజులు ఓపిక పట్టండి.. మంచి రోజులు త్వరలోనే వస్తాయని వారికి భరోసా ఇచ్చారు.
పింఛన్ రాని వారి తరఫున పోరాటం
వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్లు వచ్చేవని, చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కమిటీల పేరుతో తొలగించడం అన్యాయమని వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. చివరకు పండుటాకులన్న కనీస మానవత్వం లేకుండా ఇష్టానుసారం తొలగించారన్నారు. ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో వృద్ధులు పింఛన్ తొలగించారని చెబుతుంటే చాలా బాధేస్తోందన్నారు. అర్హులుగా ఉండి పింఛన్ రాని పండుటాకుల తరఫున న్యాయపోరాటం చేయనున్నట్లు ఆయన చెప్పారు.