సాక్షి, చిత్తూరు: రుణమాఫీ సంగతి దేవుడెరుగు. డ్వాక్రా రుణాలు తక్షణం వసూలు చేయాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో సీఎం సొంత జిల్లాలో అటు వెలుగు అధికారులు ఇటు బ్యాంకర్లు వేర్వేరుగా డ్వాక్రా రుణాలను బల వంతంగా వసూలు చేస్తున్నారు. కాదూ కూడదంటే రుణం చెల్లించిన వారికే రుణమాఫీ అమలు చేస్తారని భయపెడుతున్నారు. పాతబకాయి తిరిగి చెల్లించకుంటే అధిక వడ్డీ వసూలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. రుణమాఫీ ఏమైందని ప్రశ్నిస్తే దాంతో మాకు సంబంధం లేదంటూ అధికారులు తప్పించుకుంటున్నారు.
పాత బకాయి చెల్లిస్తేనే...
పాత బకాయిలు చెల్లిం చకపోతే కొత్త రుణానికి జీరో వడ్డీ వర్తించదంటూ వెలుగు అధికారులు సంఘాల ను భయపెడుతున్నారు. సకాలంలో తిరిగి చెల్లిం చకపోతే ఐదు లక్షలకు నెలకు 5వేల వడ్డీ తప్పనిసరిగా చెల్లించాల్సిందేనంటూ అధికారులు తేల్చి చెబుతున్నారు. పాతబకాయిలు చెల్లించిన వారికే రుణమాఫీ వర్తిస్తుందని కొందరు వెలుగు అధికారులు అటు బ్యాంకు అధికారులు ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. రుణమాఫీలో భాగంగా ప్రభుత్వం ఇస్తామన్న లక్షపై మాత్రం అధికారులు నోరుమెదపడంలేదు. ప్రశ్నిస్తే దాని విషయం మాకు తెలియదు ప్రభుత్వం ఇచ్చినపుడు తీసుకోమంటూ, సంబంధం లేనట్లు వ్యవహరిస్తున్నారు.
బాబువి మాయమాటలేనా?
మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రంపైకి అక్కాచెల్లెళ్లు రుణాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ మాయమాటలు వల్లిస్తున్నారు. అన్నీ తానే కడతానంటూ మాటలతో మభ్యపెడుతుండడంతో డ్వాక్రా మహిళలు రుణాలు తిరిగి చెల్లించాలా వద్దా అనే మీమాంసలో పడ్డారు. సీఎం పైకి ఎన్ని మాటలు చెప్పినా రుణ వసూళ్లు పూర్తిచేయాలంటూ తమకు ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయంటూ వెలుగు అధికారులు పేర్కొంటున్నారు.
ముఖ్యమంత్రి సొంతజిల్లాలో అధికంగా వసూళ్లుచేసి మెప్పు పొందేందుకు డ్వాక్రా రుణాల వసూళ్లలో అధికారులు కొంత కఠినంగా వ్యవహరిస్తూ బలవంత పు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో 65 వేల వరకూ డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. దాదాపు 7 లక్షల 80 వేలమంది సభ్యులున్నారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలోనే జిల్లాలో 230 కోట్ల రుణాలు ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇవి కాకుండా 2013-14కు సంబంధించి 1387 కోట్లు రుణాలు ఇచ్చారు.
ఇప్పటికే గ్రూపులు చెల్లించక పోవడంతో 154 కోట్ల బకాయిలు పెండింగ్‌లోపడ్డాయి. గడువు లోపు చెల్లించక నిలిచి పోయిన బకాయిలు మరో 55 కోట్లు ఉంది. మొత్తంగా ఈ ఏడాది ఇచ్చిన 230 కోట్లు కాక 1,596 కోట్ల బకాయిలు ఉన్నాయి. వీటిని తక్షణం వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో జిల్లాలో బ్యాంకర్లు, వెలుగు అధికారులు డ్వాక్రా సంఘాలపై ఒత్తిడి పెంచి బలవంతంగా వసూళ్లకు దిగారు. ఇప్పటికే 60 శాతం బకాయిలు వసూలు చేశామంటూ అధికారులు హడావుడి చేస్తున్నారు.
రూ.పది వేలు ఎప్పుడు ఇస్తారో
మరోవైపు అక్కచెల్లెళ్లకు ఖర్చులకోసం ఒక్కో సభ్యురాలికి 10 వేలు ఉచితంగా ఇస్తానని ముఖ్యమంత్రి ఆర్భాటంగా ప్రకటించారు. ఈ విషయం జన్మభూమి సభల్లో పదేపదే చెబుతున్నారు. ఆ మొత్తాన్ని ఎప్పుడు ఇస్తారో మాత్రం చెప్పడంలేదు. జిల్లాలో 7లక్షల 80 వేలమంది సభ్యులకు ఒక్కొక్కరికీ 10 వేల వంతున మొత్తం 780 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సీఎం మాటలు చెప్పడం తప్ప పైసా విదల్చలేదు. ఇది కూడా రుణమాఫీ మాదిరే ప్రచారార్భాటం తప్ప మరొకటి కాదని సంబంధిత అధికారులే బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండడం విశేషం.
రుణం చెల్లించాల్సిందే
Published Mon, Nov 10 2014 2:34 AM | Last Updated on Sat, Sep 29 2018 6:06 PM
Advertisement
Advertisement