బాబు హయాంలో అన్నదాతకు అష్టకష్టాలే | Farmers faced more problems in Chandrababu Naidu' rule | Sakshi
Sakshi News home page

బాబు హయాంలో అన్నదాతకు అష్టకష్టాలే

Published Tue, Apr 22 2014 2:11 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Farmers faced more problems in Chandrababu Naidu' rule

రైతుల ఉసురు పోసుకున్న చంద్రబాబు
బాబు డైరీ:  కాల్చుకుతిన్నాడు

* బాబు హయాంలో అన్నదాతకు అష్టకష్టాలే
* విత్తనాలడిగితే తూటాలతో తూట్లు పొడిచారు
* చార్జీలు తగ్గించమంటే లాఠీచార్జీలు చేయించారు
* బిల్లులు కట్టలేమంటే నిలువు దోపిడీ చేయించారు
* తలుపు చెక్కలు కూడా ఊడబెరికించిన ఘనుడు
* అవమానాలు భరించలేక అన్నదాతల ఆత్మహత్యలు
* ఆద్యంతం రైతు రక్తంతో తడిసిన బాబు హయాం
* నాటి కష్టాలను నేటికీ మర్చిపోలేకపోతున్న రైతులు

ఎలక్షన్ సెల్:  ప్రపంచబ్యాంకు దూత..
 కర్షకుడిపై విరుచుకుపడ్డాడు
 వ్యవసాయం దండగన్నాడు
 కళ్లు తిరిగేలా కరెంటు బిల్లులిచ్చాడు
 కోతలకు రైతులే కారణమన్నాడు
 చర్రున తిరిగే చైనా మీటర్లు తెచ్చాడు
 మోటార్లకు మీటర్లు బిగించాడు
 హార్స్‌పవర్ రేటును పెంచేశాడు
 రకరకాల చార్జిలతో పిప్పిచేశాడు
 నీటి తీరువానూ పెంచాడు
 నిస్సహాయులను  దొంగల్లా చూశాడు
 వేలాది కేసులు పెట్టించాడు
 కనెక్షన్లు తొలగించాడు
 ప్రభుత్వానికి సరెండర్ చేయమన్నాడు
 తుపానొస్తేనే కరువు తీరుతుందన్నాడు
 పంట ఎండిపోతే బుద్ధి వస్తుందన్నాడు. పరిహారం ఫ్యాషనవుతుందన్నాడు. పేదబతుకులను పరిహాసం చేశాడు. బషీర్‌బాగ్, కాల్దరి, చినగంజాం..  ఊరేదైనా ఉద్యమంపై ఉక్కుపాదం మోపాడు బక్కరైతు గుండెలపై తుపాకీ ఎక్కుపెట్టాడు. ఎండిన డొక్కలపై తన్నాడు.  ఎముకల గూళ్లనూ ఎండేలా చేశాడు.  కర్షకులను ‘కాల్చుకు’తిన్నాడు. ఇలా చేసిన పాలకుడు ఆయనొక్కడే అనిపించుకున్నాడు!  అన్నదాత.. నేలతల్లిని నిత్యం కొలుస్తాడు.  ఆరుగాలం మట్టితో మమేకమవుతాడు.  అవనికి ఆకుపచ్చని చీర కడతాడు. జాతికి అన్నప్రాసన చేస్తాడు. దేశానికి విస్తరి వేస్తాడు.

  తొమ్మిదేళ్ల వ్యథ..
 ప్రకృతి పగబట్టింది
 చినుకు రాలడం గగనమైంది
 భూమి బీటలు వారింది
 కరువు కరాళనృత్యం చేసింది
 అన్నపూర్ణ ఆకలికేకలు పెట్టింది
 
 గుండెకోత..
 రైతన్న అల్లాడిపోయాడు
 కన్నీళ్లు పెట్టుకున్నాడు
 కాళ్లు కడుపులో పెట్టుకు పడుకున్నాడు
 పిడికెడు మెతుకులకు తపస్సు చేశాడు
 ఫలితం లేక.. కిడ్నీలూ అమ్ముకున్నాడు
 ఆకలిచావులకు గురయ్యాడు
 ఆశ వదిలి ఆచేతనుడయ్యాడు
 ఇంటి చూరులో ఉరికొయ్యను చూశాడు
 పురుగులమందును తులసితీర్థంలా సేవించాడు

ప్రభుత్వం ఆదుకోలేదు
 నా భర్త మరణించి 14 ఏళ్లు దాటి ంది. ఆయనను పొట్టనబెట్టుకున్నాక కుటుంబ భారమంతా నా మీదే పడింది. నలుగురు కూతుర్ల ఆలనా పాలనా, పిల్లాడి చదువు భారంగా మారింది. ఆర్థిక ఇబ్బందులతో చచ్చిపోదామనిపిస్తోంది. అప్పటి ప్రభుత్వం సాయం అందించి ఉంటే బాగుండేటోళ్లం.
 - వెంకటశేషమ్మ, చినగంజాం మృతుడు పుల్లారెడ్డి భార్య

 

 పెద్దదిక్కును కోల్పోయాం
రైతు ఉద్యమంలో పాల్గొన్న మా వారిని అప్పటి ప్రభుత్వం పొట్టన పెట్టుకుంది.  మా కుటుంబం పెద్దదిక్కును కోల్పోయింది. నాకు ఇద్దరమ్మారుులు. ఒక అబ్బారుు. ఇంటాయన పోవ డంతో మేం పడిన కష్టాలు ఆ భగవంతుడికే తెలియూలి. నేటికీ ఆ బాధను మర్చిపోలేకపోతున్నాం.
 - తులసీరత్నం, కాల్దరి మృతుడు కృష్ణారావు భార్య
 
రక్తం రుచి మరిగిన పులి, కేవలం వయసుడిగినంత మాత్రాన శాకాహారిగా మారిపోతుందా? మారదు గాక మారదు. స్వర్ణ కంకణాన్ని ఎరగా వేసైనా సరే, నర మాంసంతోనే ఆకలి తీర్చుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. ఇప్పుడు చంద్రబాబూ చేస్తున్నదీ అదే. లెక్కలేనన్ని సార్లు రైతుల రక్తం కళ్లజూసిన, వారిని పిట్టల్లా కాల్పించి పొట్టన పెట్టుకున్న ఈ రక్తచరితుడు... వరుసగా రెండుసార్లు తనకు దూరమైన అధికారాన్ని ఈసారి ఎలాగైనా అందిపుచ్చుకునేందుకు నానా గిమ్మిక్కులూ చేస్తున్నారు. ఆ క్రమంలో... ‘నేనిప్పుడు పూర్తిగా మారిపోయాను’ అంటూ చిలుక పలుకులు పలుకుతున్నారు. అచ్చం ఆ ‘శాకాహారి’ ముసలి పులినే గుర్తుకు తెస్తున్నారు. సాగు దండగన్న నోటితోనే రైతు జపం చేస్తున్నారు. వారి గురించి పోరాడి తీరతానంటూ భీషణ ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తనను నమ్మి మరోసారి అధికారం అప్పగిస్తే ఏకంగా రుణాలనే మాఫీ చేసేస్తానంటూ వాగ్దానాలు గుమ్మరిస్తున్నారు. కానీ బాబు ఏం చెప్పినా సరే, ఆయన పేరు వింటేనే తెలుగు రైతులు ఇప్పటికీ భయంతో ఉలిక్కిపడుతున్నారు. ఆయన ట్రాక్ రికార్డు అలాంటిది మరి! బాబు పాలనా కాల మంతా రైతు రక్తంతో నిలువెల్లా తడిసి ఎర్రబడిందే.
 

జీవితం నాశనమైపోయింది
 ఊరెళదామని రైల్వే స్టేషన్‌కు వెళ్లాను. జనం గుంపుగా ఉంటే ఆసక్తిగా చూస్తున్నా. ఇంతలోనే పోలీసులు విరుచుకుపడ్డారు. వెంటనే వెనుతిరిగి వస్తుంటే రైల్వేట్రాక్‌లో పడి చెప్పు తెగింది. కిందకు వంగి సరిచేసుకుంటుండగా పోలీసులు కాల్చిన బుల్లెట్ వచ్చి తలకు తగిలింది. ఆ దెబ్బకు కోలుకోలేకపోయాను. తర్వాత శరీరం చచ్చుబడిపోయింది. చేతులకు పక్షవాతం వచ్చేసింది. ఉత్తిపుణ్యాన జీవితం నాశనమైపోయింది.
- ముళ్లపూడి సత్యనారాయణ, కాల్దరి బాధితుడు
 
అన్యాయంగా కాల్చారు
రెండ్రోజులు ఊరెళ్లి ఆ రోజు ఇంటికొచ్చా. మా రైస్‌మిల్లు వద్ద  కూలీలకు డబ్బులిస్తుండగా.. పక్కన పొగ రావడం చూసి ఏంటని చూశా. జనం బస్సు తగులబెట్టారు. రైలు ఆపుతున్నారంటే స్టేషన్‌కు వెళ్లా. జనాన్ని పోలీసులు చెదరగొట్టారు. కాల్పులు జరిపారు. నా కాలికి బుల్లెట్ తగిలింది. కిందపడ్డాను.  సీఐ నేరుగా వచ్చి కాలర్ పట్టుకుని తలపై పిస్టల్‌తో కాల్చాడు.  స్పృహ తప్పి పడిపోయాను. మా నాన్న రామకృష్ణకు కూడా  కాలర్‌బోన్ వద్ద బుల్లెట్ గాయమైంది. ప్రభుత్వం ఏమిచ్చినా  నష్టాన్ని పూడ్చలేదు. నా జీవితం అవిటిదైపోయింది.
 -కాకర్ల వీరవెంకట సత్యనారాయణ, కాల్దరి

కరెంటు చార్జీలను, నీటి తీరువాను తగ్గించమన్నందుకు 1996లో కాల్దరి రైతులను తూటాలతో తూట్లు పొడిచిన తీరును... కార్పొరేట్ కంపెనీని నెత్తిన పెట్టుకుని మా పొట్ట కొడతారా అని నిలదీసిన పాపానికి 2000 ఫిబ్రవరిలో చినగంజాం రైతులనూ పిట్టల మాదిరిగా కాల్పించిన వైనాన్ని... కరెంటు చార్జీల పెంపును నిరసించినందుకు 2000 ఆగస్టులో సాక్షాత్తూ రాజధాని నడిబొడ్డున, పట్టపగలు అన్నదాతలపైకి తుపాకీలు ఎక్కుపెట్టించి వారిని పొట్టన పెట్టుకున్న పాశవికత్వాన్ని... విత్తనాలివ్వండని అడిగినందుకు 2003 జూలైలో చేవెళ్లలో బడుగు రైతును బులెట్లకు బలి చేసిన బరితెగింపును... న్యాయం కోసం అన్నదాత రోడ్డెక్కినప్పుల్లా లాఠీలు విరగ్గొట్టించి, గుర్రాలతో తొక్కించి అణగదొక్కిన తీరును... దేన్నీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. మర్చిపోలేరు కూడా.

రైతులను దొంగల్లా చూసిన తీరు. కరెంటు చార్జీలు కట్టలేమన్నందుకు వారి ఇళ్లపై పడి చేసిన దౌర్జన్యం. తలుపు చెక్కలతో సహా ఊడబెరుక్కుని లాక్కెళ్లిన వైనం. ఇలాంటి అవమానాలను భరిస్తూబతకలేక రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డ దైన్యం... ఇలా బాబు పాలన సమస్తం రైతుల పాలిటి పీడకలే. ఆ గతం చెరిపేస్తే చెరిగేది కాదు. గత రెండు ఎన్నికల్లో బాబు భవిష్యత్తును నిర్దేశించింది ఆ గతమే. ప్రస్తుత ఎన్నికల్లోనూ అదే పునరావృతం కానుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement