ఆ..కలి కాలం
(తోలేటి మహేశ్వరరెడ్డి): అది 2003.. చంద్రబాబు పాలనా కాలం. రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. వర్షాలు లేక భూములన్నీ బీడు పడ్డాయి. రైతులతో పాటు వ్యవసాయ కూలీలకు పనుల్లేకుండా పోయాయి. పల్లెల్లో బతుకుదెరువు కష్టమైంది. మూటాముల్లె సర్దుకుని నగరాలకు వలస బాట పట్టారు. పల్లెలన్నీ దాదాపు ఖాళీ అయ్యాయి. ఇళ్ల వద్ద పిల్లలు, వృద్ధులు మాత్రమే మిగిలారు. కొన్ని గ్రామాల్లో శ్మశానవైరాగ్యం రాజ్యమేలింది. అయినా అప్పటి టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.
కనీసం కరువు ఉందని ఒప్పుకోవడానికి కూడా చంద్ర బాబు ఇష్టపడలేదు. కుటుంబ సభ్యులు వలస వెళ్లగా ఇళ్ల వద్ద మిగిలిన వృద్ధులు, పిల్లలు ఆకలి బాధతో అల్లాడిపోయారు. అక్కడక్కడ ఆకలి చావులూ మొదలయ్యాయి. కనీసం మధ్యాహ్న భోజన పథకాన్ని కొనసాగించి పిల్లల ఆకలి బాధలు తీర్చాలని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా చంద్రబాబు సర్కారు స్పందించలేదు. వారిది ‘పొలిటికల్ గిమ్మిక్కు’ అంటూ తేలిగ్గా తీసుకుంది. దీంతో పరిస్థితులు మరింత విషమంగా మారాయి.
చలించిన ప్రతిపక్షాలు...
జనం ఆకలితో చస్తుంటే చంద్రబాబు మాత్రం హైటెక్ జపం వీడలేదు. పైగా ఎక్కడా కరువు లేదంటూ తనను తాను సమర్ధించుకుంటూ వచ్చారు. ఆయన మొద్దునిద్ర వీడరని గుర్తించిన వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజాసంఘాలు సొంతంగా కరువు సహాయక చర్యలకు ఉపక్రమించాయి. జనాన్ని ఆకలి బాధల నుంచి తాత్కాలికంగానైనా బయటపడేయాలని నిర్ణయించాయి. ఇందులో భాగంగా గంజి కేంద్రాలు నిర్వహించాయి. వీటిని ప్రారంభించినప్పుడు చంద్రబాబు.. ‘ఈ కాలంలో గంజి ఎవరు తాగుతారు’ అంటూ ఎద్దేవా చేశారు.
అయితే.. గంజి కేంద్రాలకు జనం పోటెత్తారు. పిన్నలు, పెద్దలూ, వృద్ధులూ బారులు తీరారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్, అనంతపురం జిల్లాల్లో 200లకు పైగా కేంద్రాలు నెలల కొద్దీ కొనసాగాయంటే అప్పటి పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ఒక్కో కేంద్రంలో రోజూ దాదాపు 300 మంది గంజి తాగేవారు. ఆ రెండు జిల్లాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా 300లకు పైగా కేంద్రాలను నిర్వహించారు. అప్పటి దయనీయ పరిస్థితులకు చలిం చిన జర్నలిస్టులు, విద్యార్థులు, వ్యాపారులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు కూడా తమవంతు సహకారాన్ని అందించారు. స్వచ్ఛందంగా విరాళాలు సేకరించి... గంజి కేంద్రాల నిర్వహణకు ఆటంకం లేకుండా చూశారు. చివరకు టీడీపీవారు కూడా అక్కడక్కడ సహాయక చర్యలకు ఉపక్రమించినా చంద్రబాబు మాత్రం కనికరించ లేదు.
జనం గంజి తాగితే... ‘తమ్ముళ్లు’ బియ్యం మెక్కారు!
చంద్రబాబు హయాంలో కరువు కరాళ నృత్యం చేసి జనం ఆకలిచావులకు గురైతే...అదే సమయంలో తెలుగు తమ్ముళ్లు మాత్రం పండుగ చేసుకున్నారు. ప్రజల ఆహార భద్రత కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన పనికి ఆహార పథకం బియ్యాన్ని పందికొక్కుల్లా మెక్కారు. కేంద్రం పది విడతల్లో దాదాపు 40 లక్షల టన్నుల బియ్యాన్ని విడుదల చేసింది.
ఇందులో దాదాపు 25 లక్షల టన్నుల బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించారు. పుణె, ముంబై, షోలాపూర్, గాంధీనగర్ వంటి నగరాలతో పాటు విదేశాలకు సైతం తరలించి ...సొమ్ము చేసుకున్నారు. దీనిని బట్టి పచ్చచొక్కాలు ‘పనికి ఆహార పథకం’ బియ్యాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశాయో అర్థం చేసుకోవచ్చు. ఈ పథకానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.500 కోట్ల నగదు, రూ.800 కోట్ల విలువైన బియ్యం దుర్వినియోగమైనట్లు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ ప్రభుత్వం ప్రకటించింది.
అందరూ ఉన్నా అనాథలా..
బగర్ గోవిందు(60)ది మహబూబ్‌నగర్ జిల్లా కిష్టాపురం. ఇతనికి ముగ్గురు కుమారులు. 2003లో తీవ్ర కరువు పరిస్థితులు తలెత్తడంతో ఉన్న ఊళ్లో ఉపాధి కరువైంది. దీంతో ముగ్గురూ వలస బాట పట్టారు. ముంబై, గుజరాత్ తదితర ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ఇంటి వద్ద గోవిందు ఒక్కడే ఉన్నాడు. సరైన తిండి లేక అనారోగ్యానికి గురయ్యాడు. మందులు కొనేందుకూ డబ్బు లేకుండా పోయింది. పరిస్థితి విషమించింది. ఆకలి తాళలేక, అనారోగ్యంతో పోరాడలేక.. 2003 ఏప్రిల్ 5న చనిపోయాడు. అందరూ ఉన్నా అనాథలా తనువు చాలించిన గోవిందులాంటి వారెందరో ఉన్నారు.