బాబూ.. ఉద్యోగులను పురుగుల్లా చూశాడు: గోపాల్‌రెడ్డి | Chandrababu Naidu was treated Government employees as insects in his rule | Sakshi
Sakshi News home page

బాబూ.. ఉద్యోగులను పురుగుల్లా చూశాడు: గోపాల్‌రెడ్డి

Published Sat, Apr 26 2014 2:24 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

బాబూ.. ఉద్యోగులను పురుగుల్లా చూశాడు: గోపాల్‌రెడ్డి - Sakshi

బాబూ.. ఉద్యోగులను పురుగుల్లా చూశాడు: గోపాల్‌రెడ్డి

* బాబు హయాం.. ఉద్యోగులకు నరకప్రాయం
* పనికిరారంటూ నిత్యం తిట్టేవారు
* కూర్చోమనే మర్యాద కూడా తెలియదు
* ఆ చీకటి రోజులనెవరు కోరుకుంటారు?
* జన్మభూమి పేరుతో నానా వేధింపులు

 
చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వోద్యోగులు దినదిన గండంగా పని చేసేవారని, ఆ రోజులను గుర్తు చేసుకుంటే ఇప్పటికీ ఒళ్లు జలదరిస్తుందని ఏపీ ఎన్జీవో మాజీ రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస గోపాల్‌రెడ్డి అన్నారు. అలాంటి చీకటి రోజులను, నియుంత పాలనను ఎవరైనా కోరుకుంటారా అని ప్రశ్నించారు. బాబు పాలనలో ప్రభుత్వోద్యోగులు ఎదుర్కొన్న ఇక్కట్లు గోపాల్‌రెడ్డి మాటల్లోనే...
 
 చంద్రబాబు పాలన నాటి రోజులను ఎందుకు గుర్తు చేసుకోవడం? ఉద్యోగులంటే బాబుకు ఏమాత్రం గౌరవముండేది కాదు. వారిని పురుగుల్లా చూసేవారు. మా సమస్యలపై విన్నవించడానికి ఎప్పుడు వెళ్లినా గద్దిం పు స్వరమే సమాధానమయ్యేది. సమస్య వినకుండానే, మా చేతుల్లోని వినతి పత్రాలను లాక్కుని పక్కనే ఉన్న ఐఏఎస్ అధికారుల చేతుల్లో పెట్టి వెళ్లిపోయేవారు. కనీసం కూర్చోబెట్టే మర్యాద కూడా తెలియదు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఐదున్నరేళ్ల కాలం ప్రభుత్వ ఉద్యోగులకు సువర్ణయుగంలా గడిచింది. ఏ సమస్యపై వెళ్లినా చిరునవ్వుతో ప్రతి ఒక్కరిని పేరుపెట్టి పలకరించే వారు వైఎస్. ఆ రోజులను ఎలా మరచిపోతాం? చెప్పిన సమస్యను సావధానంగా వినడమే గాక, ‘ఇంకేమైనా ఉన్నాయా?’ అని ప్రశ్నించడం మాకిప్పటికీ గుర్తే.
 
నిలబెట్టి అవమానించేవారు
జన్మభూమి గ్రామసభలకు వెళ్లిన అధికారులను చంద్రబాబు నిలబెట్టి అవమానించేవారు. స్టేజీపైకి పిలిచి, ‘వీరిని ఎక్కడైనా చూశారా? వీరి పేరు తెలుసా?’ అంటూ ప్రజలను ప్రశ్నించేవారు. తెలియదని చెబితే ఆ ఉద్యోగులను నానా తిట్లు తిట్టి, ‘నీవు ఉద్యోగానికి పనికిరావు పో’ అంటూ అప్పటికప్పుడు సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించి జనంతో చప్పట్లు కొట్టించుకునే శాడిస్టు మనస్తత్వం బాబుది. అందరికీ తెలియడానికి ఉద్యోగులేమైనా సినీ నటులా? బది లీపై కొత్తగా వచ్చిన అధికారులు, జిల్లా స్థాయి అధికారులు గ్రామీణ ప్రజలకు ఎలా తెలుస్తారు? బాబు చేసిన ఇలాంటి అవమానాలను తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడిన వారు, గుండెపోటుతో మరణిం చిన వారు కూడా ఉన్నారు.
 
చంద్రబాబు చేసిన అవమానాన్ని తట్టుకోలేక నీటిపారుదల శాఖ ఇంజనీర్ అప్పారావు గుండెపోటుతో మరణించారు. అనంతపురం జిల్లా శింగనమల జన్మభూమి కార్యక్రమంలో లక్ష్మిరెడ్డి అనే పంచాయతీ ఆఫీసర్‌ను పంచాయతీ కా ర్యదర్శి అనుకుని ప్రజల ముందే తిట్టిపోశారు బాబు. ఆయన కార్యదర్శి కాదని అక్కడే ఉన్న డీపీఓ, కలెక్టర్ చెప్పడంతో నాలుక్కరుచుకుని కూడా, ‘సరే పో’ అంటూ ఆయన్ను విసుకున్నారు. అలా తనను అంద రి ముందూ బాబు అకారణంగా తిట్టడమే గాక విసుక్కోవడంతో లక్ష్మిరెడ్డి మనస్తాపానికి గురయ్యారు.
 
సంఘాలను తొక్కేసిన బాబు
 చంద్రబాబు తన హయాంలో ఉద్యోగ సంఘాలను, వాటి నాయకులను అణగదొక్కేశారు. అప్పట్లో ఏపీ ఎన్జీవో సంఘం అధ్యక్షుడిగా ఉన్న జి.పూర్ణచంద్రరావును తొత్తుగా మార్చుకుని, ఉద్యోగుల సమస్యలపై నోరెత్తకుండా చేశారు. అదే పూర్ణచంద్రరావు ఇప్పుడు టీడీపీలో కీలక పదవి అనుభవిస్తున్నారు. ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్ కోసం కొన్నిసార్లు మేం బాబును కలిసినా ఆయన పట్టించుకోలేదు. అసలు పెన్షనర్లకు ఐదు విడతల డీఆర్ కూడా ఎగరగొట్టిన ఘనత కూడా బాబుదే. దీనిపై అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కలిస్తే, విచిత్రంగా స్పందించారు. ‘మీరు ఉద్యోగులు. మీ పనులు మీరు చేసుకోండి. ఏం చేయాలో మాకు తెలుసు. ఇంతకు మించి ఏమైనా అడిగితే పరిణామాలు కూడా అలాగే ఉంటాయి’ అంటూ బెదిరించారు.  పైగా ‘ఎన్నికల్లో చక్రం తిప్పి ప్రభుత్వాన్ని మార్చేస్తామని కలలు కంటున్నారేమో! అలాంటివేమీ సాధ్యం కాదు.
 
గెలిచే వారిని మీరు ఓడించలేరు. ఓడిపోయే వారిని గెలిపించనూ లేరు’ అనేవారు. ఆ రోజులు తలచుకుంటే ఇప్పటికీ భయుమేస్తుంది. కరెంటు చార్జీలు తగ్గించాలంటూ ఆందోళన చేసిన రైతులపై కాల్పులు బాబు జరిపించారు. కరెంటు బిల్లులు కట్టలేని రైతులపై కేసులు పెట్టించి అరెస్టు చేయించారు. కానీ అదే చంద్రబాబు నెల్లూరు జిల్లాలోని తన 40 ఎకరాల వ్యవసాయ క్షేత్రం తాలూ కు పంపుసెట్లపై ఒక్కరోజు కూడా కరెంటు బిల్లు కట్టిన పాపాన పోలేదు. వేతనాలు పెంచాలంటూ ధర్నా చేసిన అంగన్‌వాడీ మహిళలను గుర్రాలతో తొక్కించిన రోజులు ఇప్పటికీ గుర్తున్నాయి. ప్రభుత్వ నియామకాలను ఆపేసి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టింది బాబే. ఎన్టీరామారావు మధ్య నిషేధం విధిస్తే దాన్ని నానా సాకులతో ఎత్తేసి మద్యపుటేరులను పారించారు. బెల్టుషాపులనే పదాన్ని పరిచయం చేసింది కూడా బాబే.
 
 వైఎస్ వచ్చాకే...
 2004లో వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రభుత్వోద్యోగుల సమస్యలన్నీ తీరాయి. అసలు ప్రభుత్వోద్యోగిని మనిషిగా చూడటం వైఎస్ పాలనలోనే జరిగింది. విధి నిర్వహణలో కూడా సమయం తెలిసేది కాదు. గంటలకు గంటలు ఎంతో సంతోషంగా గడిచిపోయేవి. ఎంత ఒత్తిడినైనా భరించి ఆహ్లాదకరమైన వాతావరణంలో పనిచేసేవాళ్లం. ధర్నాలనేవి లేవు.
 
 శాశ్వతంగా కడుపుకోత...
 ‘‘అది 2001. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలం. మండువేసవిలో అనంతపురం జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామంలో బాబు జన్మభూమి గ్రామ సభ నిర్వహించారు. ఆ సభ నుంచి మినహాయింపు ఇవ్వండంటూ ఓ పశువైద్యాధికారి నోడల్ ఆఫీసర్‌ను ప్రాధేయపడ్డారు. ‘‘నా భార్య గర్భవతి. నెలలు నిండాయి. నేడో, రేపో కాన్పు కావచ్చు. మా ఇల్లు పట్టణానికి దూరం. తనను చూసుకోవడానికి నేను ఇంటి దగ్గరే ఉండాలి’ అంటూ వేడుకున్నారు. అయినా బాబు భయంతో ఆ అధికారి ససేమిరా అన్నారు. జన్మభూమికి గైర్హాజరైతే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. విధి లేక దానికి హాజరై, సాయంత్రం ఇంటికెళ్లే సరికి ఆయన భార్య అపస్మారక స్థితిలో పడిపోయి కన్పించింది. హుటాహుటిన ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది.
 
 గంటల కొద్దీ ప్రసవవేదన అనుభవించి, తాళలేక కింద పడిపోవడంతో బిడ్డ కడుపులోనే చనిపోరుుందని వైద్యులు చెప్పారు. ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు. ఆ దంపతులకు ఇప్పటిదాకా పిల్లలు కలగలేదు! ఆ రోజు తాను ఇంట్లో ఉండి ఉంటే ఈ దుర్గతి పట్టేది కాదంటూ ఆ పశువైద్యాధికారి ఇప్పటికీ ఆవేదనకు లోనవుతుంటారు. ప్రభుత్వోద్యోగులను అప్పట్లో బాబు ఎంతగా హడలగొట్టారో చెప్పేందుకు ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి?’’
 - గోపాల్‌రెడ్డి, ఏపీఎన్జీవో మాజీ అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement