నరకం చూపిన నారా బాబు
* ప్రభుత్వోద్యోగులను చెండుకు తిన్న చంద్రబాబు
* చీటికీమాటికీ ఛీత్కారాలు, అకారణంగా సస్పెన్షన్లు
* ప్రజల్లో ఇమేజీ పెంచుకోవడమే లక్ష్యంగా వేధింపులు
* పెన్షనర్లకు డీఆర్ ఇవ్వకుండా వేధించిన ఘనుడు
* బాబు పేరు వింటే ఉద్యోగులకు నేటికీ ఉలికిపాటే
‘‘ఏం? పిచ్చ పిచ్చగా ఉందా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్? నాతోనే వాదిస్తావా? తమాషాలు పడుతున్నావా?’’
...ఇవి ఏ తాపీ మేస్త్రీయో తన దగ్గర పని చేసే కూలీలపై అరిచిన అరుపులు కావు. సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వాధినేత అయిన ముఖ్యమంత్రి నోటి వెంట జాలువారిన తిట్ల దండకాలు. ‘పిచ్చ పిచ్చగా ఉందా’ అంటూ దుయ్యబట్టిందెవరినో తెలుసా? అంబేద్కర్ వర్సిటీ వైఎస్ చాన్సలర్‌ను! ఇక ‘తమాషాలు పడుతున్నావా’ అంటూ నోరు పారేసుకున్నదేమో ఏకంగా న్యాయ శాఖ అదనపు కార్యదర్శిపై! అక్కడితో ఆగకుండా, ‘నీ పరిధిలో నువ్వుండు! యాక్షన్ తీసుకుంటాను జాగ్రత్త. ఎవ్వరినీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
సదరు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని చెబితే అది ముంజేతి కంకణాన్ని అద్దంలో చూపించడమే అవుతుంది. చివరికి రాష్ట్రంలో అత్యున్నతాధికారి అయిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కూడా, ‘మీరు నేననుకున్నంతగా పని చేయడం లేదు’ అనేసి ఆయన మనసు విరవగలిగిన ఘనుడు చంద్రబాబు. అత్యున్నత ప్రభుత్వాధికారులకే ఇలా చుక్కలు చూపిన చంద్రబాబు... సాధారణ ప్రభుత్వోద్యోగుల విషయంలోనైతే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు! ‘మీ గుండెల్లో నిద్రపోతాను’ అంటూ నిత్యం బెదిరించారు. బెదిరించడమే కాదు... తన పాలన పొడవునా వేతన జీవులు ఏనాడూ కంటి నిండా నిద్ర కూడా పోకుండా చేశారు. జనం ముందు, సాటి ఉద్యోగుల ముందు వారిని దోషుల్లా నిలబెట్టి, నిలువునా పరువు తీయడాన్ని, కసురుకోవడాన్ని, సస్పెండ్ చేసిపారేయడాన్ని అలవాటుగా మార్చుకున్నారు...
ప్రజల ముందు దోషుల్లా నిలదీశాడు
‘‘చంద్రబాబు పాలనలో ఉద్యోగులు నిత్య నరకం అనుభవించారు. ఒకవైపు ఉద్యోగ నియామకాల్లేవు. మరోవైపు ప్రచారం కోసం కొత్త కొత్త పథకాలు పెడుతూ ఉద్యోగులపై పని భారం పెంచేవారు. రాత్రింబవళ్లూ కష్టపడ్డా ఉద్యోగులకు సమాజంలో కనీస గౌరవం లేకుండా చేశారు. ‘గ్రామ సభలు’, ‘ప్రజల వద్దకు పాలన’ పేరుతో ఉద్యోగులను ప్రజల ముందు దోషుల్లా నిలదీశారు.చిన్న పొరపాట్లకు కూడా ఉద్యోగులను ‘చెట్లకు కట్టేయండి... చిత క్కొట్టండి...’ అంటూ ముఖ్యమంత్రే అనడంతో ఉద్యోగులు తీవ్ర మనోవేదనకు గురైన సందర్భాలు కోకొల్లలు. గ్రామస్థాయిలో ఉండే ఏఎన్‌ఎంలు, వీఆర్‌వోలు ఏకంగా సీఎం కార్యక్రమంలో పాల్గొని, ఆయనకు సమాధానాలు చెప్పాలంటే ఎంత ఒత్తిడిలో ఉం టారో తెలిసి కూడా ఇష్టానుసారం మాట్లాడి అవమానించాచారు.
ఉద్యోగులను వేధించిన పాపం ఊరికే పోతుందా. వారి ఉసురు తగిలింది. అందుకే బాబు ఇన్నేళ్లుగా సీఎం కుర్చీ దగ్గరికి రాకుండా ఉద్యోగులు చేశారు. పనికి తగ్గ వేతనమిస్తూ, ఖాళీలు భర్తీ చేస్తూ, ఉద్యోగుల సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వాలుంటే ఎంతటి పని భారాన్నయినా మోస్తాం. కష్టపడుతూ పని చేయమంటే ఉద్యోగులు ఆనందంగా చేస్తారు గానీ బాధ పడుతూ చేయమంటే చేయలేరని పాలకులు గుర్తుంచుకుంటే మంచిది’’
- భవానీ ప్రసాద్, తెలంగాణ వార్డెన్ల
సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడు