ఒంగోలు టూటౌన్, న్యూస్‌లైన్: కౌలు రైతుల కష్టాలు నానాటికీ పెరుగుతున్నాయి. సర్కారు నిర్లక్ష్యంతో వేలాది మంది కౌలు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దశాబ్దాలుగా వ్యవసాయ భూమిలేని పేద, మధ్యతరగతి కుటుంబాలు రైతుల వద్ద నుంచి భూముల్ని కౌలుకు తీసుకుని సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. పదేళ్లుగా వ్యవసాయంలో తీవ్రంగా నష్టాలు వస్తుండటంతో వేలాది మంది భూ యజమానులు తమ భూములను కౌలుకు ఇవ్వడం ప్రారంభించారు.
అంతే స్థాయిలో కౌలుకు తీసుకునేవారు అధికమయ్యారు. అలా కౌలు భూములపై ఆధారపడి జీవించే కుటుంబాలు జిల్లాలో 1.50 లక్షలకుపైగా ఉన్నాయి. కౌలు రైతులకు ఎలాంటి రక్షణ చట్టాలు లేకపోవడంతో భూ యజమానుల నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రకృతి విపత్తులకు గురై తీవ్రంగా నష్టపోతున్న రైతులకు పంట నష్టపరిహారంలోనూ అన్యాయం జరుగుతోంది. గ్రామ సభల ద్వారా స్థానిక రెవెన్యూ అధికారులు కౌలు రైతులను గుర్తించాలి. ప్రతి కౌలు రైతుకు రుణ అర్హత కార్డుల్ని రెవెన్యూ అధికారులు మంజూరు చేయాలి. ఇవి ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు చేయాలి. జూలై నాటికి రుణ అర్హత కార్డుల పంపిణీ పూర్తికావాలి. గుర్తించిన కౌలు రైతులకు బ్యాంకు రుణాలు మంజూరు చేయించాలి. కానీ అధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. జూన్ నెల ప్రారంభమైనా నేటికీ అధికారుల్లో కౌలు రైతుల ఊసే లేకుండా పోయింది.
నాలుగేళ్లుగా పరిశీలిస్తే...
2011-12లో 14, 500 మందికి రుణ అర్హత కార్డులిచ్చారు. 2012-13 సంవత్సరంలో 8,149 మందికి ఇవ్వగా, గత ఏడాది 5,213 మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారు. బ్యాంకులు మాత్రం 30 వేల మందికి దాదాపు రూ.40 కోట్ల వరకు రుణాలివ్వాలని లక్ష్యం కాగా..కేవలం 200 మందికి రూ.30 లక్షలే ఇచ్చారు. పైగా ఈ ఏడాది కౌలు రైతులకు విభజన దెబ్బ తగిలింది. రాష్ట్ర విభజన ఒక వైపు.. మరోవైపు సార్వత్రిక ఎన్నికలు రావడంతో కౌలు రైతులను ఎవరూ పట్టించుకోలేదు.
ప్రభుత్వం ప్రకటించిన రుణాలపై కౌలు రైతులు ఎన్నో ఆశలుపెట్టుకున్నారు. రుణ మాఫీతో కొంతైనా ఊరట కలుగుతుందని ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు సంఘాలు కూడా ఎలాంటి ఆంక్షలు లేని రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఏడాది కౌలు రైతులను గుర్తించేందుకు షెడ్యూల్ ప్రకటించాలని, అందరికీ బ్యాంకు రుణాలు ఇప్పించాలని కోరుతున్నారు.
కౌలు రైతుల ఊసేదీ..!
Published Mon, Jun 9 2014 2:03 AM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM
Advertisement