మారుతున్న వాతావరణం.. నెలాఖరుకల్లా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల
విశాఖపట్నం, సాక్షి: వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రెండురోజుల నుంచి తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరుగుతుండగా, ఆంధ్రప్రదేశ్‌లో తగ్గుతున్నాయి. వాస్తవానికి ఈ సమయంలో తెలంగాణలో చలి ప్రభావం కనిపిస్తుంది. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు తెలంగాణలో సాధారణ వాతావరణం కనిపిస్తోంది. ఫలితంగా అక్కడ పలుచోట్ల సాధారణ ఉష్ణోగ్రతలే రికార్డవుతుండగా, ఒకట్రెండు చోట్ల మాత్రం 1నుంచి2 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో తెలంగాణలో చలి తీవ్రత తగ్గింది. అదే సమయంలో కోస్తాంధ్రలో సాధారణంకంటే 2 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు తక్కువగా రికార్డవుతున్నాయి. అందువల్ల కోస్తాంధ్రలో చలి ప్రభావం కొనసాగుతోంది. మరోవైపు రాయలసీమలోనూ 2నుంచి3 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఫలితంగా అక్కడ కూడా చలి ప్రభావం కనిపించడం లేదు.
గడచిన 24 గంటల్లో తెలంగాణలో అత్యల్పంగా హకీంపేటలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. ఎప్పుడూ అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్‌లో 18 డిగ్రీలు రికార్డయింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, కళింగపట్నంలలో అత్యల్పంగా 13 డిగ్రీలు నమోదు కావడం విశేషం. ఇవి సాధారణంకంటే 5 డిగ్రీలు తక్కువ. విశాఖపట్నంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత (-3 డిగ్రీలు) నమోదయింది. ఉత్తరాది నుంచి వస్తున్న గాలులు బలంగా లేకపోవడం, అదే సమయంలో తూర్పు గాలులు మొదలుకావడం వల్ల చలి ప్రభావం తెలంగాణపై తక్కువగా ఉంటోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం రిటైర్డు అధికారి ఆర్.మురళీకృష్ణ శనివారం ‘సాక్షి’కి తెలిపారు. నాలుగైదు రోజుల్లో కోస్తాంధ్రలోనూ ఉష్ణోగ్రతలు పెరిగి చలి తగ్గుతుందని చెప్పారు.
ఆంధ్రలో చలి.. తెలంగాణలో వేడి
Published Sun, Jan 25 2015 11:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:12 PM
Advertisement