సాక్షి, హైదరాబాద్: రోజు రోజుకూ పెరిగిపోతున్న చలి రాష్ట్రాన్ని వణికిస్తోంది. గత వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలతో పాటు పగటి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో.. చలికి ప్రజలు వణికిపోతున్నారు. హైదరాబాద్‌తోపాటు అన్ని ప్రాంతాల్లోనూ చలి తీవ్రత బాగా పెరిగింది. సాయంత్రం నాలుగు గంటలయ్యే సరికే చలిగాలులు వీస్తున్నాయి. శివారు ప్రాంతాలు, ఏజెన్సీలో తెల్లవారుజామున, సాయంత్రం తర్వాత ఇళ్లలోంచి బయటకు రావాలంటే భయపడే పరిస్థితి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో శనివారం అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది ఇదే సమయంలో వివిధ ప్రాంతాల్లో నాలుగైదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డు కావడం గమనార్హం. సాధారణంగా తుపాను పరిస్థితులున్నప్పుడు చలి తక్కువగా ఉంటుంది.
కానీ, నైరుతి బంగాళాఖాతంలో ‘మాదీ’ తుపాను విజృంభించే అవకాశం కనిపిస్తున్నా.. ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఓ వైపు మేఘాలు దట్టంగా ఏర్పడడం, మరోవైపు మధ్యప్రదేశ్, ఒడిశా నుంచి ఉత్తరదిశగా శీతల గాలులు వీస్తుండడమే దీనికి కారణం. శనివారం విశాఖ ఏజెన్సీలో లంబసింగిలో 6 డిగ్రీలు, చింతపల్లిలో 9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అక్కడి వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌లో 8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. రంగారెడ్డి జిల్లా తాండూరులో 9.2 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయింది. సముద్ర మట్టానికి సుమారు 1,000 అడుగులకు పైగా ఎత్తులో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లోనైతే సాయంత్రం 4 దాటితే.. జనం ఇళ్లకే పరిమితమైపోతున్నారు. హైదరాబాద్ నగరంలోనూ గత ఏడాది ఇదే తేదీన నమోదైన కనిష్ట ఉష్ణోగ్రత కంటే శనివారం ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు కావడం గమనార్హం. శ్రీవారి క్షేత్రమైన తిరుమలలోనూ చలి వణికిస్తోంది.
కారణాలివీ..
డిసెంబర్ 15వ తేదీతో తుపాన్ల సీజన్ ముగుస్తుందని, ఫిబ్రవరి నెలాఖరువరకు చలి తప్పదని వాతావరణ శాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ చెప్పారు. సముద్ర మట్టం నుంచి ఎత్తు పెరుగుతున్న కొద్దీ చలి తీవ్రత తక్కువగా ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా చలి వేస్తుందని, పొగ మంచు దట్టంగా కురుస్తుందని అధికారులు తెలిపారు. కాగా.. ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలతో శ్వాసకోశ, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూమోనియా, ఆస్తమాలతో బాధపడుతున్నవారు, దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య పెరుగుతోందని హైదరాబాద్, తిరుపతి నగరాలకు చెందిన పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు.
వణుకుతున్న రాష్ట్రం
Published Sun, Dec 8 2013 3:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:22 AM
Advertisement