పగలు ఎండ.. రాత్రిళ్లు చలి...
రాష్ట్రంలో విచిత్ర వాతావరణ పరిస్థితులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రోజురోజుకి చలి తీవ్రత పెరుగుతోంది. ఉత్తర భారతం నుంచి చలి గాలులు వీస్తుండటంతో రాత్రి వేళ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. నవంబర్ నుంచి చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన 24 గంటల్లో మెదక్‌లో 14 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. మెదక్‌లో సాధారణం కంటే 4 డి గ్రీలు తక్కువగా ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్, ఆదిలాబాద్‌ల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోయాయి. హైదరాబాద్‌లో సాధారణం కంటే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీలు తక్కువగా నమోదైంది. మహబూబ్‌నగర్‌లో రాత్రి వేళ కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీలకు పడిపోగా, పగటి పూట గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీలుండటం గమనార్హం.
మహబూబ్‌నగర్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గగా, పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు అధికంగా ఉన్నాయి. ఖమ్మంలో రాత్రి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు తగ్గితే, పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు అధికంగా పెరిగాయి. ఇదిలావుండగా ఈశాన్య రుతుపవనాలు ఇప్పటికీ రాకపోవడంతో ఈ నెల నుంచి శుక్రవారం నాటికి రాష్ట్రంలో 23 శాతం లోటు వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 82 శాతం, రంగారెడ్డి జిల్లాలో 67 శాతం, నల్లగొండ జిల్లాలో 57 శాతం, హైదరాబాద్‌లో 30 శాతం, వరంగల్ జిల్లాలో 29 శాతం లోటు వర్షపాతం నమోదైంది.
రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా తెలంగాణలో శనివారం నుంచి మూడు రోజులపాటు అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ తర్వాత వాతావరణం పొడిగానే ఉంటుందని, అనంతరం చలి తీవ్రత కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని వివరించింది.