మూడు రోజులు ఓ మోస్తరు వర్షాలు
గణనీయంగా పడిపోయిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే మూడు రోజులపాటు (14, 15, 16 తేదీల్లో) అక్కడక్కడ ఉరుములతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వై.కె.రెడ్డి తెలిపారు. అక్కడక్కడ వడగండ్లు పడే అవకాశముందని చెబుతున్నారు. మరోవైపు రాష్ట్రం లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. గత 24 గంటల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6 డిగ్రీల వరకు తగ్గగా.. పగటి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల వరకు క్షీణించాయి. ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
మెదక్‌లో 14 డిగ్రీలు, భద్రాచలంలో 18 డిగ్రీలు, రామగుండం, హన్మకొండల్లో 17 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, హకీంపేటల్లో 17 డిగ్రీలు, నల్లగొండలో 18 డిగ్రీలు, మహబూబ్‌నగర్‌లో 20, నిజామాబాద్‌లో 19 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలూ సాధారణం కంటే తగ్గాయి. నిజామాబాద్‌లో 4 డిగ్రీలు తక్కువగా 33 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రామగుండంలో 34 డిగ్రీలు, భద్రాచలం, మహబూబ్‌నగర్‌లో 35 డిగ్రీల చొప్పున, ఖమ్మం, మెదక్, నల్లగొండల్లో 36 డిగ్రీల చొప్పున పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.