మళ్లీ చలి!
సాక్షి, విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత మళ్లీ పెరిగింది. చాన్నాళ్ల విరామం తర్వాత మళ్లీ చలి గజగజలాడిస్తోంది. కొన్నాళ్లుగా దక్షిణ, ఆగ్నేయ గాలులు ప్రభావం చూపడంతో చలి తీవ్రత తగ్గిపో యింది. తాజాగా గాలులు తమ గమనాన్ని మార్చుకుని ఈశాన్య, తూర్పువైపుల నుంచి వీయడం మొదలెట్టాయి. ఫలితంగా ఈశాన్యం, ఉత్తర దిశల నుంచి చల్లగాలులకు ఆస్కారమిస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల్లో కనిష్ట, గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం సాధారణం కంటే పగటి(గరిష్ట) ఉష్ణోగ్రతలు రాయలసీమలో 6 నుంచి 10 డిగ్రీలు, కోస్తాంధ్రలో 2 నుంచి 5 డిగ్రీలు, తెలంగాణలో 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి.
అలాగే కనిష్ట(రాత్రి) ఉష్ణోగ్రతలు తెలంగాణలో 2-3 డిగ్రీలు తక్కువగా రికార్డవుతున్నాయి. ఆదిలాబాద్‌లో బుధవారం అత్యల్పంగా 12 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా గురువారం 8 డిగ్రీలకు, ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామలో 19 నుంచి 17 డిగ్రీలకు పడిపోయింది. రాబోయే రెండు రోజులు కూడా తెలుగు రాష్ట్రాల్లో సగటున 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) గురువారం రాత్రి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ఫలితంగా ఇరు రాష్ట్రాల్లోనూ మళ్లీ చలి తీవ్రత పెరగనుందని పేర్కొంది. కొద్దిరోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేసింది.
పలుచోట్ల వర్షాలు..
ఇదిలా ఉండగా ఉత్తర, ఈశాన్య గాలులు... దక్షిణ, ఆగ్నేయ గాలులు కలవడం వల్ల మేఘాలేర్పడి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయని రిటైర్డ్ వాతావరణ అధికారి ఆర్.మురళీకృష్ణ ‘సాక్షి’కి తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో ఈ వర్షాలు కూడా తగ్గుముఖం పడతాయన్నారు. గడచిన 24 గంటల్లో ఏపీ, తెలంగాణలలో పలుచోట్ల వర్షాలు పడ్డాయి.