చలి మంటలు | Night Temperatures Fell Down In AP | Sakshi
Sakshi News home page

చలి మంటలు

Published Sun, Dec 13 2020 3:06 AM | Last Updated on Sun, Dec 13 2020 3:06 AM

Night Temperatures Fell Down In AP - Sakshi

సాక్షి,అమరావతి/సాక్షి, విశాఖపట్నం: శీతాకాలం ప్రభావం రాష్ట్రంపై కనిపిస్తోంది. క్రమేణా చలి పెరుగుతోంది. రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సాధారణంగా వేడి ఎక్కువగా ఉండే విజయవాడ, గుంటూరు వంటి నగరాల్లో సైతం చలి తీవ్రత పెరిగింది. దీంతో ఇంట్లో ఏసీల వాడకం తగ్గింది. స్వెట్టర్లు ధరించి చలి నుంచి ఉపశమనం పొందుతున్నారు. ఏజెన్సీ, కొండప్రాంతాల్లోని ప్రజలను చలిపులి వణికిస్తోంది. విశాఖపట్నం జిల్లాలోని అరకు ప్రాంతం పర్యాటకులతో కళకళలాడుతోంది. ఇక్కడ చలిమంటల (క్యాంప్‌ ఫైర్‌) వేస్తూ, చల్లటి వాతావరణంలో వేడిని ఆస్వాదిస్తూ పర్యాటకులు సందడి చేస్తున్నారు. ఇక రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఉదయం పది వరకూ పొగమంచు తెరలు వీడటంలేదు. దీంతో రహదారులు కానరాక వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పొగమంచు సమయంలో ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని రవాణా, పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. శనివారం విశాఖపట్నం జిల్లా లంబసింగిలో 9, చింతపల్లిలో 12.2, పాడేరులో 12, అరకులో 14 డిగ్రీల సెల్సియస్‌ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. విశాఖపట్నం నగరంలో కనీస ఉష్ణోగ్రత సాధారణం కంటే 3, కళింగపట్నంలో 2 డిగ్రీల సెల్సియస్‌ తక్కువగా నమోదైంది. 

అప్రమత్తంగా ఉండటం అవసరం
చలి పెరిగిన నేపథ్యంలో వృద్ధులు, చిన్న పిల్లలు, గర్భిణిలు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధిగ్రస్తులు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఉదయం వాకింగ్‌కు వెళ్లే వృద్ధులు, వ్యాధిగ్రస్తులు ఎండ వచ్చిన తర్వాత వెళ్లాలని చెప్పారు. చలి నుంచి రక్షణకు ఊలు కోటు, మంకీక్యాప్‌/మఫ్లర్‌ వాడటం ఉత్తమని, ఉదయం గోరు వెచ్చటి నీటితో స్నానం చేయాలని, ఆస్తమా బాధితులు చలి ప్రాంతాలకు వెళ్లరాదని హైదరాబాద్‌కు చెందిన గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ పీఎల్‌ఎన్‌ కపర్ధి సూచించారు. చర్మసంబంధిత సమస్యలు కూడా చలికి ఎక్కువవుతాయని వైద్య నిపుణులు చెప్పారు.  

ఈ చలికాలం భిన్నం సుమీ!
ఈ ఏడాది చలికాలం భిన్నంగా ఉంటుందని భారత వాతావరణ కేంద్రం  (ఐఎండీ) వెల్లడించింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ ఎక్కువ నమోదై వేడి పెరుగుతుంది.. రాత్రి ఉష్ణోగ్రతలు 1 నుంచి 3 డిగ్రీలు తగ్గి.. చలిగా ఉంటుందని వెల్లడించింది. గతేడాదితో పోలిస్తే సాధారణం కన్నా స్వల్ప అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయనీ పేర్కొంది. ఈ నెలాఖరు వరకూ ఇదే పరిస్థితి ఉంటుందని స్పష్టం చేసింది. దేశ ఉత్తర అంచుల్లో ఉన్న ప్రాంతాలు మినహా.. అన్నిచోట్లా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. ముఖ్యంగా రాష్ట్రంలో తీర ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయని వెల్లడించింది. మాన్‌సూన్‌ కపుల్డ్‌ ఫోర్‌కాస్టింగ్‌ సిస్టమ్‌ (ఎంసీఎఫ్‌ఎస్‌) ఆధారంగా, నవంబర్‌లో నెలకొన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఐఎండీ ఈ అంచనాల్ని విడుదల చేసింది. దీని ప్రకారం డిసెంబర్‌ నెలాఖరు వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుంచి 3 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతల్లో తగ్గుదల కనిపిస్తుందని స్పష్టం చేసింది. కోస్తా తీరంలో వెచ్చటి సముద్ర గాలుల కారణంగా.. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 డిగ్రీ అధికంగా ఈ నెలాఖరు వరకూ నమోదవుతాయని అధికారులు తెలిపారు. రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం 1 నుంచి 3 డిగ్రీల వరకూ తగ్గుతాయన్నారు. 

రాయలసీమలో మరోరకంగా..
రాయలసీమలో పరిస్థితి మాత్రం కోస్తాకు భిన్నంగా ఉంటుందని, ఈసారి ఆ ప్రాంతంలో చలి వణికించనుందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఉదయం, రాత్రి సాధారణం కంటే కనీసం 2 నుంచి 3 డిగ్రీలు తగ్గుదల కనిపిస్తుందన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement