
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. గతవారం వరకు సాధారణం కంటే 5 డిగ్రీల వరకు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదు కాగా... ఇప్పుడు గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా తగ్గాయి. నైరుతి రుతుపవనాల నిష్క్రమణ పూర్తి కావడంతో వాతావరణంలో వేగంగా మార్పులు చోటుచేసుకున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావం తోడుకావడం, రాష్ట్రానికి ఈశాన్య దిశ నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
పగటి ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో ఉన్నప్పటికీ రాత్రి ఉష్ణోగ్రతలు మాత్రం సాధారణం కంటే రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. దీంతో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగినట్లు కనిపిస్తోంది. ఉష్ణోగ్రతలు పతనం కావడంతో పాటు ఈశాన్య దిశల నుంచి వస్తున్న గాలుల ప్రభావంతో చలి పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఉత్తర ప్రాంత జిల్లాల్లో తక్కువగా..
సెప్టెంబర్ నెలాఖరుతో వానాకాలం ముగిసినప్పటికీ... అక్టోబర్ రెండో వారం వరకు నైరుతి ప్రభావం ఉంటుంది. తాజాగా నాలుగో వారం వరకు చలి తీవ్రత పెద్దగా లేకపోగా... రెండ్రోజులుగా వాతావరణంలో వేగంగా మార్పులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తర ప్రాంత జిల్లాల్లో కని ష్ట ఉష్ణోగ్రతల్లో భారీగా తగ్గుదల నమోదవుతోంది. మెదక్, వరంగల్ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీల సెల్సియస్ నుంచి 5 డిగ్రీల సెల్సియస్ మధ్యన నమోదయ్యాయి. ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2 డిగ్రీ సెల్సియస్ తక్కువగా నమోదయ్యాయి.
ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే దక్షిణ ప్రాంత జిల్లాల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా... ఉత్తర ప్రాంతంలో మాత్రం సాధారణం కంటే 2 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం రాష్ట్రంలో నమోదైన ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 35.8 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత మెదక్‌లో 15 డిగ్రీ సెల్సియస్‌గా నమోదయ్యాయి. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో ఇదే తరహాలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment