విశాఖలో చలిమంటలు కాగుతున్న దృశ్యం
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా అతి శీతల ప్రభావాన్ని చవిచూస్తున్నారు. శీతాకాలం అంటే సహజంగా రాత్రి వేళ చలి వణికిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. కానీ కొన్నాళ్లుగా రాత్రే కాదు.. పగలు కూడా చలి వెంటాడుతోంది. ఇటీవల సంభవించిన పెథాయ్ తుపాను తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమయింది. ఉత్తరాదితో పాటు వాయవ్య భారతదేశంలోనూ శీతల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉత్తరాదిలో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది.
గడ్డకట్టిన దాల్ సరస్సు
చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
పగలు చలి ఎందుకంటే..?
సాధారణంగా ఆకాశం నిర్మలంగా ఉంటే సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అందువల్ల పగటి వేళ ఎండ ప్రభావం ఉండడంతో చలి తీవ్రత కనిపించదు. కానీ పగలు పొగమంచు కూడా ఏర్పడుతోంది. ఈ మంచు సూర్యోదయంకాగానే పైకి చేరి తేలికపాటి మేఘాలుగా ఏర్పడుతోంది. దీంతో సూర్యరశ్మి భూమికి అంతగా చేరడం లేదు. ఇదే వాతావరణం అటు ఉత్తర, వాయవ్య భారతదేశంలోనూ ఉంటోంది. ఫలితంగా అటు నుంచి పగలు కూడా చల్లగాలులు వీస్తున్నాయి. ఇవన్నీ వెరసి పగటి చలికి కారణమవుతున్నాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం ఇటు కోస్తాంధ్ర (రాయలసీమ మినహా), అటు ఉత్తర తెలంగాణల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా రికార్డవుతుండడంతో చలి తీవ్రతకు కారణమవుతోంది.
11 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. ముఖ్యంగా మైదానంకంటే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా క్షీణిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోను 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు 27–30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 11–21 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అయితే రాయలసీమలో మాత్రం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు అ«ధికంగా నమోదవుతుండడం వల్ల కోస్తా, తెలంగాణ కంటే చలి ప్రభావం అక్కడ తక్కువగా ఉంటోంది. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగడమే కాక చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి క్రమంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వీరు పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment