Weather scientists
-
ఈ వేసవిలో భగభగలే!
సాక్షి, హైదరాబాద్ : మండుటెండలు.. వేడిగాలులు ఈ వేసవిలో రాష్ట్ర ప్రజలను ఠారెత్తించనున్నాయి. ఫిబ్రవరి మూడో వారంలోనే ఉష్ణోగ్రతలు 33 డిగ్రీలకు పైగా నమోదవుతున్న నేపథ్యంలో రాబోయే మండు వేసవిని తలచుకుంటే సొమ్మసిల్లే పరిస్థితి నెలకొంది. ఎల్‌నినో ప్రభావం తటస్థంగా ఉన్నప్పటికీ ఈసారి ఏప్రిల్ మూడో వారం నుంచి మే నెల చివరి వారం వరకు వాయవ్య దిశ నుంచి రాష్ట్రవ్యాప్తంగా వడగాలులు వీచే ప్రమాదం ఉందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇలాంటి వాతావరణ పరిస్థితులు వేసవిలో సర్వసాధారణమేనని.. 2016, 2017 సంవత్సరాల్లోనూ ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. ఈసారి రాష్ట్రంలో ఏప్రిల్ మూడో వారం నుంచి మే చివరి వరకు పగటి ఉష్ణోగ్రతలు 45–46 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. రామగుండం, భద్రాచలంతోపాటు మైనింగ్ ఏరియాల్లో పగటి ఉష్ణోగ్రతలు 47–48 డిగ్రీల మేర నమోదవుతాయని అంచనా వేస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోనూ గరిష్టంగా 44–45 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈసారి ఎండలు ఎక్కువే.. గతేడాది ఏప్రిల్–మే నెలల్లో దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపుగా తేమగాలులు వీయడంతో ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ఉధృతి అంతగా లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి కేరళ, లక్షద్వీప్ నుంచి వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. దీని కారణంగా వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. కాగా 2016 ఏప్రిల్–మే నెలల్లో సుమారు 27 రోజులపాటు వడగాలులు వీయగా.. 2017లో ఇవే మాసాల్లో 23 రోజులపాటు వడగాలులతో పాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. -
చలి గుప్పిట్లో తెలుగు రాష్ట్రాలు
సాక్షి, విశాఖపట్నం/న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇటీవలి కాలంలో ఎన్నడూ లేనంతగా అతి శీతల ప్రభావాన్ని చవిచూస్తున్నారు. శీతాకాలం అంటే సహజంగా రాత్రి వేళ చలి వణికిస్తుంది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉంటాయి. కానీ కొన్నాళ్లుగా రాత్రే కాదు.. పగలు కూడా చలి వెంటాడుతోంది. ఇటీవల సంభవించిన పెథాయ్ తుపాను తర్వాత ఈ పరిస్థితి మరింత తీవ్రమయింది. ఉత్తరాదితో పాటు వాయవ్య భారతదేశంలోనూ శీతల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో చలి విజృంభిస్తోంది. ఆయా రాష్ట్రాల్లో 2 నుంచి 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీసహా వాయవ్య భారతంలో వచ్చే రెండు మూడ్రోజుల్లో చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఉత్తరాదిలో పగటి పూట ఉష్ణోగ్రతలు కూడా సింగిల్ డిజిట్‌కి చేరుకోవడంతో పంటలపై కూడా ప్రభావం పడుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఢిల్లీలో ఇప్పటికే కనిష్ట ఉష్ణోగ్రత 3 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయింది. గడ్డకట్టిన దాల్ సరస్సు చలితో జమ్ము కశ్మీర్ వాసులు గజగజలాడుతున్నారు. రోజురోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. గత 11 ఏళ్లలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు మైనస్ 6.8 డిగ్రీలకు పడిపోయాయి. ఫలితంగా ప్రఖ్యాత దాల్ సరస్సులో కొంత భాగం గడ్డ కట్టింది. వాటర్ పైపులలో నీరు గడ్డ కట్టేయడంతో ప్రజలకు నీటి సరఫరా ఇబ్బందిగా మారింది. సరస్సులు కూడా గడ్డ కట్టేయడం గత పదకొండేళ్లలో ఇప్పుడే జరిగింది. ఇక కార్గిల్‌లో మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. పగలు చలి ఎందుకంటే..? సాధారణంగా ఆకాశం నిర్మలంగా ఉంటే సూర్య కిరణాలు నేరుగా భూమిని తాకుతాయి. అందువల్ల పగటి వేళ ఎండ ప్రభావం ఉండడంతో చలి తీవ్రత కనిపించదు. కానీ పగలు పొగమంచు కూడా ఏర్పడుతోంది. ఈ మంచు సూర్యోదయంకాగానే పైకి చేరి తేలికపాటి మేఘాలుగా ఏర్పడుతోంది. దీంతో సూర్యరశ్మి భూమికి అంతగా చేరడం లేదు. ఇదే వాతావరణం అటు ఉత్తర, వాయవ్య భారతదేశంలోనూ ఉంటోంది. ఫలితంగా అటు నుంచి పగలు కూడా చల్లగాలులు వీస్తున్నాయి. ఇవన్నీ వెరసి పగటి చలికి కారణమవుతున్నాయని వాతావరణ శాఖ రిటైర్డ్ అధికారి రాళ్లపల్లి మురళీకృష్ణ ‘సాక్షి’కి వివరించారు. ప్రస్తుతం ఇటు కోస్తాంధ్ర (రాయలసీమ మినహా), అటు ఉత్తర తెలంగాణల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదవుతున్నాయి. ఇక రాత్రి (కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా తక్కువగా రికార్డవుతుండడంతో చలి తీవ్రతకు కారణమవుతోంది. 11 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రతలు తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 11 డిగ్రీలకు పడిపోయాయి. ముఖ్యంగా మైదానంకంటే ఏజెన్సీ ప్రాంతాల్లోనే ఇవి ఎక్కువగా క్షీణిస్తున్నాయి. కొన్నాళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో తెలంగాణలోని ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోనూ, ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా లంబసింగిలోను 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్రలో గరిష్ట ఉష్ణోగ్రతలు 27–30 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 11–21 డిగ్రీల మధ్య రికార్డవుతున్నాయి. అయితే రాయలసీమలో మాత్రం పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంకంటే 2–3 డిగ్రీలు అ«ధికంగా నమోదవుతుండడం వల్ల కోస్తా, తెలంగాణ కంటే చలి ప్రభావం అక్కడ తక్కువగా ఉంటోంది. మరో వారం రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగడమే కాక చలి మరింత పెరిగే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. జనవరి మొదటి వారం నుంచి క్రమంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వీరు పేర్కొంటున్నారు. -
ముంచుకొస్తోంది
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: వాయువేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వడివడిగా ప్రయాణిస్తూ అలజడి రేపుతోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్రవాయుగుండం సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుపానుగా బలపడింది. శనివారం రాత్రి సమయానికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఫెథాయ్ తుపాను ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ ఆదివారం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం... తుపాన్ ప్రభావంతో ఆది, సోమవారాల్లో గంటకు 80 – 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం కొన్నిచోట్ల భారీ వర్షాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు, పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలవచ్చని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీవ్రతతో కెరటాలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే ప్రాంతంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఆర్టీజీఎస్ సూచించింది. గాలుల తీవ్రత ఎక్కువే... తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్టోబరు రెండోవారంలో శ్రీకాకుళం జిల్లాను వణికించిన తిత్లీ తుపాను తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలులకు ఉద్దానంలో జీడి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. పెట్రోలు బంకులు, రైస్‌మిల్లులు, గ్రానైట్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, నివాస గృహాల పైకప్పులు ఎగిరిపోయాయి. పెథాయ్ కూడా తీవ్ర తుపానుగా మారుతున్నందున జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. తీరప్రాంతాల ప్రజలు 17వ తేదీన తుపాను తీరం దాటే సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఇళ్లలో ఉండటం మంచిదని సూచిస్తున్నారు. సీఎంకు గవర్నర్ నరసింహన్ ఫోన్ ఏపీకి పెథాయ్ తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేసి ముందస్తు జాగ్రత్త చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు. కోనసీమ తీర ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు.. తుపాన్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశం, కార్యదర్శి వరప్రసాద్ ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో సమీక్షించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు రాష్ట్ర విపత్తు సహాయక దళాల (ఎస్డీఆర్ఎఫ్) తోపాటు జాతీయ విపత్తు సహాయ దళాలను (ఎన్డీఆర్ఎఫ్ను) పంపించారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా సహాయక చర్యలకోసం సిద్ధం చేశారు. పెథాయ్ తీవ్ర తుపాను తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్య తీరం దాటే అవకాశముందని భావిస్తున్నారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా సూచించారు. మరోవైపు కోనసీమలో 27 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోనసీమలోని ఎనిమిది తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం, మంగళవారం అధికార యంత్రాంగం సెలవుగా ప్రకటించింది. కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ హెచ్చరిక జారీ... తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి మరపడవల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. మరోవైపు చీరాల వాడరేవు నుంచి గత మంగళవారం ఐదుబోట్లలో వేటకు వెళ్లిన 30 మంది మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావటంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో తీరప్రాంత మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశామని జాయింట్ కలెక్టర్ క్షితిజ తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు తమ కేంద్రాలను వదిలి వెళ్లరాదని పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్తర్వులు జారీ చేశారు. నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం మండలాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక అధికారులు, బృందాలను నియమించారు. గుంటూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వరి పంట కోతకు సిద్ధంగా ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. బలపడే అవకాశం తక్కువే! – ‘సాక్షి’తో ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్ పెథాయ్’ తీవ్ర తుపానుగా బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, ఇది తుపాను దశ నుంచి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘పెథాయ్ శనివారం సాయంత్రం 5.30 గంటలకు తుపానుగా మారింది. ఇది తీవ్ర తుపానుగా మారడానికి ప్రస్తుతం సముద్రంలో వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి తుపాన్ ఒంగోలు సమీపానికి చేరుకుంటుంది. చెన్నై, మచిలీపట్నం రాడార్ కేంద్రాల పరిధిలోకి వచ్చాక పెథాయ్ కదలికలు, స్థితిగతులను పరిశీలించాక అది తుపానుగానే మిగిలిపోతుందా? తీవ్ర తుపానుగా మారుతుందా? ఎక్కడ తీరం దాటుతుందనే అంశాలను అంచనా వేయవచ్చు’ అని న్యూఢిల్లీలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం పెథాయ్ తీవ్ర వాయుగుండంగానే తీరం దాటేలా ఉందన్నారు. ‘ఇది సోమవారం మధ్యాహ్నానికిగానీ తీరం దాటదు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత సమీక్షించాక ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా నిర్ధారణకు రావచ్చు..’ అని వివరించారు. కంట్రోల్ రూంల నంబర్లు ఇవీ... తుపాను, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలు, సాయం పొందేందుకు పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మచిలీపట్నం కలెక్టరేట్ : 08672– 252170, 252171, 252172 గుడివాడ: 08674–243697 నూజివీడు : 08656–232717 విజయవాడ : 0866–2574454 పశ్చిమ గోదావరి కలెక్టర్ కార్యాలయం: 1800233 1077 (టోల్‌ఫ్రీ నెంబరు) ప్రకాశం జిల్లా కంట్రోల్ రూం: 08592–281400, 1077 (టోల్ ఫ్రీ నంబర్) శ్రీకాకుళం కంట్రోల్ రూం నంబర్ 08942–240557 -
గర్జించిన క్యుములోనింబస్!
సాక్షి, హైదరాబాద్: క్యుములోనింబస్ మేఘాలు భాగ్యనగరంపై మళ్లీ గర్జించాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా నగరంలో పలు చోట్ల ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా కురిసిన కుండ పోతకు గ్రేటర్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రధానంగా ఆసిఫ్‌నగర్, చార్మినార్, విరాట్‌నగర్, శ్రీనగర్‌కాలనీ, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించింది. బుధవారం కురిసిన భారీ వర్షానికి నగరంలో లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులు చెరువులను తలపించాయి. పలు కాలనీలు, బస్తీల్లో ఇళ్ల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు, తోపుడు బండ్లు వరదనీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షం కారణంగా సద్దుల బతుకమ్మ వేడుకలకు తీవ్ర ఆటంకం కలిగింది. దసరా సందర్భంగా షాపింగ్, దూర ప్రాంతాలకు బయలుదేరిన వారు వర్షంలో చిక్కుకొని ఇబ్బందులు పడ్డారు. పలు ప్రధాన రహదారులపై నడుములోతున వరదనీరు పోటెత్తడంతో ద్విచక్రవాహనాలు, కార్లు, ఆటోలు, బస్సులు భారంగా ముందు కు కదిలాయి. భారీ వర్షానికి చాలాచోట్ల దాదాపు 2–4 గంటల పాటు ట్రాఫిక్ జాం నగరవాసులకు నరకం చూపించింది. సాయంత్రం 6 గంటల వరకు 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాగల 24 గంటల్లోనూ ఈ మేఘాల ప్రభావంతో పలుచోట్ల కుంభవృష్టి కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. అధికార యంత్రాంగం అలర్ట్ భాగ్యనగరంలోని చార్మినార్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 నుంచి 5.30 గంటల మధ్య భారీ వర్షం కురియడంతో జీహెచ్ఎంసీ యంత్రాంగం అప్రమత్తమైంది. విపత్తు నిర్వహణ బృందాలు, వర్షాకాల అత్యవసర బృందా లు రంగంలోకి దిగాయి. నగరంలో పలు ప్రాంతాల్లో జడివాన ఉధృతి నేపథ్యంలో.. అధికారులతో జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్ సమీక్ష నిర్వహించారు. వర్షం కురిసే ప్రాంతాల్లో తాత్కాలికంగా పర్యటనలు వాయిదా వేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ట్యాంక్‌బండ్, కోఠి, బేగం బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, లిబర్టీ, హైదర్ గూడ, హిమాయత్ నగర్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం కష్టాలు వర్ణనాతీతంగా మారాయి. రోడ్లపై ఎక్కడికక్కడే నీరు నిలవడంతో రోడ్లపై చిన్న కొట్లు పెట్టుకునేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కంట్రోల్ రూం నుంచి పరిస్థితులను సమీక్షించారు. పగటి ఉష్ణోగ్రతలు పెరగటమే! ఇటీవల దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల మేర పెరిగిన కారణంగా భూవాతావరణం వేడెక్కింది. ఈ తరుణం లో బుధవారం ఒక్కసారిగా అండమాన్ నికోబార్, తూర్పు దిశ నుంచి వీస్తున్న తేమగాలులు నగరాన్ని తాకడంతో అకస్మాత్తుగా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి కుండపోత కురిసిందని బేగంపేట్‌లోని వాతావరణ శాఖ శాస్త్రవేత్త రాజారావు ‘సాక్షి’కి తెలిపారు. వాతావరణంలో అస్థిర పరిస్థితులు చోటుచేసుకోవడమే ఇందుకు కారణమన్నారు. తరచుగా వేసవిలో ఏర్పడే క్యుములోనింబస్ మేఘాలు.. ఈ సారి వర్షాకాలం పూర్తవుతున్న సమయంలో ఏర్పడుతున్నాయని రాజారావు వెల్లడించారు. మరోవైపు దక్షిణ అండమాన్ సముద్రం దాని పరిసర ప్రాంతాలలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. అలాగే నైరుతి రుతుపవనాలు ఈ నెల 20వ తేదీ నాటికి దేశం నుండి పూర్తిగా ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి. తదుపరి ఈశాన్య రుతుపవనాలు ప్రవేశానికి కూడా అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన వివరించారు. దీంతో రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. -
ఆగస్టు ఆశలు ఆవిరి..!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు దేశంలోకి అడుగుపెట్టి 2 నెలలు పూర్తవుతున్నా.. తగినన్ని వర్షాలు కురవకపోవడంతో ఏపీ, తెలంగాణల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జూన్, జూలైల్లో 2 రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే పడటంతో ఈ ఏడాది వ్యవసాయం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కనీసం ఆగస్టులో నైనా తగినంతగా వర్షాలు పడితే వేసిన పంటలను కాపాడుకోవచ్చని భావించిన రైతుల ఆశలపై వాతావరణ శాస్త్రవేత్తలు నీళ్లు చల్లుతున్నారు. రుతుపవనాల ప్రభావం ఈ నెల కూ డా సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని అంటున్నారు. మధ్య బంగాళాఖాతంలో బల మైన వాతావరణ వ్యవస్థలేవీ ఏర్పడకపోవడం దీనికి కారణమని ప్రైవేట్ వాతావరణ అంచనా ల సంస్థ స్కైమెట్ శాస్త్రవేత్త ‘సాక్షి’కి తెలిపారు. జూన్ చివరలో పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడ్డ భారీ తుపానులు హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి తేమను మోసుకెళ్లడంతో జూలైలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని వివరించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఉత్తర ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు పడే అవకాశముందన్నారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతం లో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు పశ్చిమ దిక్కుగా ప్రయాణిస్తూ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిపిస్తున్నాయన్నారు. అయితే ఈ నెల 13, 14 తేదీల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడవచ్చని, వాటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి 20వ తేదీల మధ్య కొంత స్తబ్దత ఏర్పడినా ఆ తరువాత వానలు ఎక్కువగా పడే అవకాశముందని తెలిపారు. లెక్కల్లో సాధారణం.. కొన్నిచోట్ల అధికం ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా ఒకే తీరుగా లేదు. లెక్కల ప్రకారం చూస్తే వర్షాలు సాధారణం కంటే కేవలం 3 శాతం మాత్రమే తక్కువగా కురిశాయి. కానీ గుజరాత్‌తో పాటు, రాజస్తాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో వరదలు పోటెత్తాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణల్లో సగటు కంటే 10 నుంచి 20 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి. అంచనాలు సవరించిన స్కైమెట్: నైరుతి రుతుపవనాల ప్రభావం అంచనాలను స్కైమెట్ తాజాగా సవరించింది. సాధారణ వర్షాలు కురుస్తాయని మొదట్లో ప్రకటించిన ఈ సంస్థ తాజాగా దీర్ఘకాలిక సగటులో 98% వరకూ వానలు పడే అవకాశముందని శనివారం పేర్కొంది. జూన్, జూలైలలో దేశం మొత్తమ్మీద 452 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉం డగా, 4% తక్కువగా నమోదైందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. జూన్‌లో సగటు కంటే 16% ఎక్కువగా, జూలైలో 15% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. -
రుణ భారం
(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : వర్షాలు ముందుగానే ‘అనంత’ను పలకరించాయి. నైరుతి రుతు పవనాలూ తొందరగానే వచ్చే అకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైతులు పొలాలను దుక్కి దున్నారు. సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది కాస్త ముందస్తుగా జూన్‌లో విత్తనాలు వేయాలని భావిస్తున్నారు. విత్తనాలతో పాటు పంట సాగుకు పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. రుణమాఫీ హామీని నమ్మి గత ఏడాది చాలామంది రైతులు పంట రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోయారు. రైతులు తీసుకున్న పంట రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఐదు విడతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. పాత బకాయిలు చెల్లించే దాకా కొత్త రుణాలు ఇచ్చేది లేదంటూ బ్యాంకర్లు భీష్మించారు. దీనివల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ఏడాది అధిక శాతం మంది బ్యాంకుల కంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దే రుణాలు పొందారు. గత ఏడాది జిల్లాలో 5.06 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావంతో పంట మొత్తం ఎండిపోయింది. దీనివల్ల పాత అప్పులకు తోడు గతేడాది పంట సాగుకు చేసిన అప్పులు రైతులకు భారమయ్యాయి. ఇలాంటి కష్టకాలంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు. నత్తనడకన రుణాల పంపిణీ ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు రూ.3,595 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఖరీఫ్‌లో రూ.3,056 కోట్లు, రబీలో రూ.539 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి జూన్ ఆఖరులోగా రుణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే.. అది సాధ్యపడేలా లేదు. ఇప్పటిదాకా రూ.448 కోట్లు మాత్రమే ఇచ్చారు. కొన్ని బ్యాంకులు పాతబకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని గట్టిగా చెబుతున్నాయి. ఇంకొన్ని వడ్డీ కట్టించుకుని రెన్యూవల్ చేస్తున్నాయి. దీంతో కొందరు రైతులు స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణమాఫీ కింద తమ ఖాతాలో జమ అయిన సొమ్ము మినహా తక్కిన సొమ్మును అప్పుగా తెచ్చి బకాయిలు మాఫీ చేసుకుంటున్నారు. తిరిగి కొత్త రుణాలు తీసుకుంటున్నారు. వడ్డీ కట్టించుకుని రెన్యూవల్ చేసేలా ప్రభుత్వం అన్ని బ్యాంకులకూ మార్గనిర్దేశం చేస్తేనే ఈ ఏడాది పంట సాగుకు పెట్టుబడి దక్కుతుందని రైతులు అంటున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు ఇంతకుముందు రైతులు, బ్యాంకర్ల మధ్య చక్కటి సంబంధాలుండేవి. పంట సాగుకు అవసరమైన మేరకు రైతులకు బ్యాంకర్లు రుణాలిచ్చేవారు. గతేడాది రుణమాఫీ సమయంలో దీనిపై పెద్ద వివాదం రేగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కాకుండా బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా రుణాలు ఇచ్చారని ప్రభుత్వం నిందించింది. తాము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే మాఫీ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో బ్యాంకర్లు చిక్కుల్లో పడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఎకరాకు రూ.13 వేల చొప్పున రుణం మంజూరు చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు మాత్రం 20 శాతం అదనంగా ఇస్తున్నాయి. ప్రస్తుతం సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. వేరుశనగ సాగుకు ఎకరాకు రూ.20 వేలకుపైగా అవుతోంది. బ్యాంకర్లు ఇచ్చే పంట రుణం పెట్టుబడికి సరిపోదు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద 2, 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మూడేళ్లుగా తీవ్ర పంట నష్టం వాటిల్లడం, 2013కు సంబంధించి రూ.576 కోట్ల ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాదైనా పంట పండితే అప్పుల గండం నుంచి గట్టెక్కాలని రైతులు చూస్తున్నారు. కావున పాతబకాయిల విషయంలో బ్యాంకర్లు ఒత్తిడి చేయకుండా, కొత్త రుణాలు ఇప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. లేనిపక్షంలో గతేడాది మాదిరిగానే (రూ.3,200 కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.1,600 కోట్లు మాత్రమే ఇచ్చారు.) ఈసారీ రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందవని పరిశీలకులు చెబుతున్నారు. -
బంగాళాఖాతంలో వాయుగుండం
న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో తూర్పు మధ్య ప్రాంతంపై కేంద్రీకృతమైన వాయుగుండం దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకను ప్రభావితం చేసే అవకాశముండటంతో వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. పోర్ట్‌బ్లెయిర్‌కు వాయవ్య దిక్కున 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం సైక్లోన్‌గా మారుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. వాయుగుండం రుతుపవనాలను ప్రభావితం చేస్తుందా లేదా సైక్లోన్‌గా మారుతుందా అనేది నిరంతరం పరిశీలిస్తున్నామని ఐఎండీ శాస్త్రవేత్త ఎస్కే మహాపాత్ర తెలిపారు. వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారవచ్చని, 48 గంటల్లో ఉత్తర , ఈశాన్య దిశగా ప్రయాణించి మయన్మార్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకవచ్చని ఐఎండీ బుధవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 5న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించవచ్చని ఐఎండీ 15వ తేదీన ప్రకటించింది.