న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో తూర్పు మధ్య ప్రాంతంపై కేంద్రీకృతమైన వాయుగుండం దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకను ప్రభావితం చేసే అవకాశముండటంతో వాతావరణ శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలిస్తున్నారు. పోర్ట్‌బ్లెయిర్‌కు వాయవ్య దిక్కున 530 కి.మీ. దూరంలో కేంద్రీకృతమైన వాయుగుండం సైక్లోన్‌గా మారుతుందా? లేదా? అనేది ఇప్పుడే చెప్పలేమని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. వాయుగుండం రుతుపవనాలను ప్రభావితం చేస్తుందా లేదా సైక్లోన్‌గా మారుతుందా అనేది నిరంతరం పరిశీలిస్తున్నామని ఐఎండీ శాస్త్రవేత్త ఎస్‌కే మహాపాత్ర తెలిపారు.
వాయుగుండం రాగల 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారవచ్చని, 48 గంటల్లో ఉత్తర , ఈశాన్య దిశగా ప్రయాణించి మయన్మార్, బంగ్లాదేశ్ తీరాన్ని తాకవచ్చని ఐఎండీ బుధవారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. ప్రస్తుతానికి నైరుతి రుతుపవనాల రాకకు పరిస్థితులు అనుకూలంగానే ఉన్నాయని తెలిపింది. కాగా, నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకుతాయి. అయితే ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్ 5న నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించవచ్చని ఐఎండీ 15వ తేదీన ప్రకటించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం
Published Thu, May 22 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement