(సాక్షి ప్రతినిధి, అనంతపురం) : వర్షాలు ముందుగానే ‘అనంత’ను పలకరించాయి. నైరుతి రుతు పవనాలూ తొందరగానే వచ్చే అకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలకు రైతులు పొలాలను దుక్కి దున్నారు. సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఈ ఏడాది కాస్త ముందస్తుగా జూన్‌లో విత్తనాలు వేయాలని భావిస్తున్నారు. విత్తనాలతో పాటు పంట సాగుకు పెట్టుబడి కోసం తిప్పలు పడుతున్నారు. రుణమాఫీ హామీని నమ్మి గత ఏడాది చాలామంది రైతులు పంట రుణాలను రెన్యూవల్ చేసుకోలేకపోయారు.
రైతులు తీసుకున్న పంట రుణాలను స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఐదు విడతల్లో మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే.. పాత బకాయిలు చెల్లించే దాకా కొత్త రుణాలు ఇచ్చేది లేదంటూ బ్యాంకర్లు భీష్మించారు. దీనివల్ల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గత ఏడాది అధిక శాతం మంది బ్యాంకుల కంటే ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్దే రుణాలు పొందారు. గత ఏడాది జిల్లాలో 5.06 లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. వర్షాభావంతో పంట మొత్తం ఎండిపోయింది. దీనివల్ల పాత అప్పులకు తోడు గతేడాది పంట సాగుకు చేసిన అప్పులు రైతులకు భారమయ్యాయి. ఇలాంటి కష్టకాలంలో ఈ ఏడాది ఖరీఫ్ సాగుకు సన్నద్ధమవుతున్నారు.
నత్తనడకన రుణాల పంపిణీ
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో రైతులకు రూ.3,595 కోట్ల రుణాలను ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇందులో ఖరీఫ్‌లో రూ.3,056 కోట్లు, రబీలో రూ.539 కోట్లు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. ఖరీఫ్‌కు సంబంధించి జూన్ ఆఖరులోగా రుణ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. అయితే.. అది సాధ్యపడేలా లేదు. ఇప్పటిదాకా రూ.448 కోట్లు మాత్రమే ఇచ్చారు. కొన్ని బ్యాంకులు పాతబకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని గట్టిగా చెబుతున్నాయి.
ఇంకొన్ని వడ్డీ కట్టించుకుని రెన్యూవల్ చేస్తున్నాయి. దీంతో కొందరు రైతులు స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణమాఫీ కింద తమ ఖాతాలో జమ అయిన సొమ్ము మినహా తక్కిన సొమ్మును అప్పుగా తెచ్చి బకాయిలు మాఫీ చేసుకుంటున్నారు. తిరిగి కొత్త రుణాలు తీసుకుంటున్నారు. వడ్డీ కట్టించుకుని రెన్యూవల్ చేసేలా ప్రభుత్వం అన్ని బ్యాంకులకూ మార్గనిర్దేశం చేస్తేనే ఈ ఏడాది పంట సాగుకు పెట్టుబడి దక్కుతుందని రైతులు అంటున్నారు.
స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అమలు
ఇంతకుముందు రైతులు, బ్యాంకర్ల మధ్య చక్కటి సంబంధాలుండేవి. పంట సాగుకు అవసరమైన మేరకు రైతులకు బ్యాంకర్లు రుణాలిచ్చేవారు. గతేడాది రుణమాఫీ సమయంలో దీనిపై పెద్ద వివాదం రేగింది. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం కాకుండా బ్యాంకర్లు ఇష్టారాజ్యంగా రుణాలు ఇచ్చారని ప్రభుత్వం నిందించింది. తాము స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారమే మాఫీ చేస్తామని తేల్చి చెప్పింది. దీంతో బ్యాంకర్లు చిక్కుల్లో పడ్డారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఎకరాకు రూ.13 వేల చొప్పున రుణం మంజూరు చేస్తున్నారు. కొన్ని బ్యాంకులు మాత్రం 20 శాతం అదనంగా ఇస్తున్నాయి.
ప్రస్తుతం సాగు ఖర్చులు భారీగా పెరిగాయి. వేరుశనగ సాగుకు ఎకరాకు రూ.20 వేలకుపైగా అవుతోంది. బ్యాంకర్లు ఇచ్చే పంట రుణం పెట్టుబడికి సరిపోదు. దీంతో రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద 2, 3 రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చుకోవాల్సి వస్తోంది. మూడేళ్లుగా తీవ్ర పంట నష్టం వాటిల్లడం, 2013కు సంబంధించి రూ.576 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇవ్వలేమని ప్రభుత్వం చేతులెత్తేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాదైనా పంట పండితే అప్పుల గండం నుంచి గట్టెక్కాలని రైతులు చూస్తున్నారు.
కావున పాతబకాయిల విషయంలో బ్యాంకర్లు ఒత్తిడి చేయకుండా, కొత్త రుణాలు ఇప్పించేలా ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. లేనిపక్షంలో గతేడాది మాదిరిగానే (రూ.3,200 కోట్ల రుణ లక్ష్యానికి గాను రూ.1,600 కోట్లు మాత్రమే ఇచ్చారు.) ఈసారీ రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందవని పరిశీలకులు చెబుతున్నారు.
రుణ భారం
Published Thu, May 28 2015 2:50 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement
Advertisement