చినుకు రాక.. ‘బోరు’వాక | there is no chance of rain until next week | Sakshi
Sakshi News home page

చినుకు రాక.. ‘బోరు’వాక

Published Fri, Jul 4 2014 1:47 AM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

చినుకు రాక.. ‘బోరు’వాక - Sakshi

చినుకు రాక.. ‘బోరు’వాక

 నైరుతి ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన  సగటు వర్షపాతంలో 61 శాతం లోటు
 
* గత ఏడాదితో పోలిస్తే సగం కూడా సాగని సాగు..
* విత్తనాలు నాటినా.. అవీ ఎండిపోతున్న దైన్యం
* జలాశయాల్లో ఇన్‌ఫ్లో నిల్... తాగునీటికీ కొరతే
 * మరో వారం దాకా వర్షాలకు నో చాన్స్

 
సాక్షి, హైదరాబాద్: చినుకు లేక చేను బోరుమంటోంది. ఆదుకుంటాయనుకున్న నైరుతి రుతుపవనాలు మొహం చాటేయడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఇప్పటివరకూ కురవాల్సిన సగటు వర్షపాతంలో ఈసారి సగం కూడా నమోదు కాలేదు. ఖరీఫ్‌కు సంబంధించి రాష్ట్రంలో జూన్ రెండు మూడు వారాలే చాలా కీలకం. జూన్ 15 నాటికి రాయలసీమలో ప్రవేశించిన రుతు పవనాలు 21 నాటికి తెలంగాణ జిల్లాల్లో ప్రవేశించినా.. తర్వాత  ముఖం చాటేశాయి.
 
అప్పట్లో కురిసిన జల్లులను చూసి రైతులు విత్తనాలు నాటారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. అష్టకష్టాలు పడి చివరికి బిందెల తో నీళ్లు పోస్తున్నా ఫలితం కనిపించడం లేదు. మొలకెత్తిన విత్తనాలు ఇప్పటికే 40 శాతం వరకు ఎండిపోయాయి. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎండలు మళ్లీ తీవ్రమయ్యాయి.  రెండు రోజులుగా వాతావరణం మండిపోతోంది. మరో వారం రోజుల దాకా వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రైతన్నల పరిస్థితి మరింత దయనీయంగా మారే పరిస్థితి నెలకొంది.
 
ఎండిపోతున్న పంటలు..
ఈ సీజన్‌లో ఇప్పటివరకూ 137.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదు కావాలని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే, 54.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. సగటు వర్షపాతంలో 61 శాతం లోటు ఏర్పడింది. అదే గతేడాది ఈ సీజన్ నాటికి 166.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అంతకుముందు సంవత్సరం ఈ సమయానికి 119.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. ఈ సీజన్‌లో 40.38 ల క్షల హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా.. ఈ సమయానికి సగటున 14.16 ల క్షల హెక్టార్లలో పంటలు సాగు చేయాల్సి ఉంది. వానలు పడకపోవడంతో ఇప్పటివరకు కేవలం 8.81 లక్షల హెక్టార్లలోనే పంటలు వేశారు.
 
అదే గతేడాది లెక్క తీసుకుంటే.. ఈ సమయానికి 18.77 లక్షల హెక్టార్లలో రైతుల పంటలు వేశారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులతో వేసిన పంటలు కూడా ఎండిపోతున్నాయి. ఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే 8 వేల హెక్టార్లలో వేసిన మొక్కజొన్న, 8,458 హెక్టార్లలో వేసిన జొన్న, 16,122 హెక్టార్లలో వేసిన పత్తి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. మిగతా జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. అటు జలాశయాల్లోకి పైనుంచి చుక్క నీరు రావడం లేదు. దీంతో నీటిమట్టం పెరగడం లేదు. ఒక్క జూరాల, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి వస్తున్న కాసింత వరదనీరు మినహా మిగతా ఏ జలాశయంలోకి నీరు రావడం లేదు. ఎగువ రాష్ట్రాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అటు తాగునీటికీ కటకట వచ్చే పరిస్థితి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement