ఖరీఫ్ సాగేదెలా? | The arrival of the monsoon weather | Sakshi
Sakshi News home page

ఖరీఫ్ సాగేదెలా?

Published Mon, Jun 9 2014 2:36 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఖరీఫ్ సాగేదెలా? - Sakshi

ఖరీఫ్ సాగేదెలా?

 సాక్షి, ఖమ్మం: అతివృష్టి, అనావృష్టి.. వరుస వైపరీత్యాలతో జిల్లా రైతులు ఏటా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. కొండంత నష్టం జరిగితే ప్రభుత్వం  గోరంత పరిహారం మాత్రమే ఇస్తుండడంతో అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఖరీఫ్‌పైనే గంపెడాశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించడం వారిలో ప్రోత్సాహం నింపే ప్రకటనే అయినా.. గత అనుభవాలతో మళ్లీ  ఈ సారి ఏమవుతుందోననే ఆందోళన రైతుల్లో నెలకొంది.
 
ఈ ఖరీఫ్‌లో జిల్లా సాధారణ సాగు విస్తర్ణం 4,05,014 హెక్టార్లు కాగా,  గత ఏడాది 3,89,408 హెక్టార్లలో పలు రకాల పంటలు సాగు చేశారు. ఈ ఏడాది అదనంగా 15,606 హెక్టార్ల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అంచనా. నాగార్జునసాగర్‌లో నిండా నీరుంటే ఆయకట్టు, వర్షాలు ఆశించిన స్థాయిలో పడితే మెట్ట ప్రాంతంలో వర్షాధార పంటలు సాగు చేస్తారు. వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తేనే వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం అన్ని రకాల పంటలు పండేది. అయితే ఏటా వ్యవసాయ శాఖ ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నట్లు నివేదికలు సిద్ధం చేస్తున్నా.. ఆ స్థాయిలో దిగుబడి మాత్రం రావడం లేదు.
 
ఏటా నష్టాలే..
సకాలంలో విత్తనాలు, ఎరువులు దొరకకపోవడంతో పాటు అనేక ఇబ్బందులు పడి వేసిన పంటలు చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలు రైతులను నిండాముంచుతున్నాయి. దీంతో ప్రధానంగా పత్తి, వరి, మిర్చి, మొక్కజొన్న సాగు చేసే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయితే ఈ ఖరీఫ్ సీజన్‌లో ముందుగానే నైరుతి రుతుపవనాల ఆగమనం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెపుతుండడంతో రైతుల్లో ఆనందం తొణికిసలాడుతోంది. గతంలో డిమాండ్ ఉన్న పత్తి విత్తనాలు, ఎరువులు దొరకక వారు నానా అగచాట్లు పడ్డారు. మహరాష్ట్ర, గుజరాత్ ప్రాంతాలకు వెళ్లి తమకు కావాల్సిన విత్తనాలు తెచ్చుకున్నారు. ఈ ఏడాది రుతుపవనాలు ముందే వస్తుండడంతో సకాలంలో విత్తనాలు దొరుకుతాయా.. లేక గతంలో మాదిరిగానే  కష్టాలు పడాల్సిందేనా అని మథనపడుతున్నారు.
 
కాగా, అన్ని జిల్లాల్లో సాగు విస్తీర్ణం పెంచాలని, రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించాలని మూడు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయించడం వారిలో కొంతమేర హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నా.. మరోవైపు ఆందోళన మాత్రం వెంటాడుతూనే ఉంది. సాగుకోసం అన్నీ సిద్ధం చేశామని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నా తీరా.. సీజన్ నెత్తిమీదకు వచ్చే సరికి మళ్లీ విత్తనాలు, ఎరువుల పరిస్థితి షరా మామూలేనని రైతు సంఘాల నాయకులు అంటున్నారు.
 
డిమాండ్ ఉన్న విత్తనాలు దొరికేనా..?
గతంలో సాగు చేసిన ఏ పత్తి విత్తనాలతో దిగుబడి ఎక్కువగా వచ్చిందో.. వాటికే డిమాండ్ ఉంటుంది. కానీ రైతుల అవసరానికి తగినట్లుగా అవి మార్కెట్‌లో దొరకడం లేదు. డిమాండ్ లేని రకాలను అందుబాటులో ఉంచి, విత్తనాలు అన్నీ సిద్ధం చేశామని వ్యవసాయ శాఖాధికారులు చెపుతున్నారు. అయితే రైతులకు ఏ రకమైన విత్తనాలు కావాల నేది వారు అంచనా వేయలేకపోతుండడం గమనార్హం. ఈ ఖరీఫ్‌లో జిల్లాకు 10.25 లక్షల విత్తన ఫ్యాకెట్లు అవసరమని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. నూజివీడు సీడ్స్, మైకో (డాక్టర్ బ్రెంట్, నీరజ తదితరాలు), కావేరి, తులసి ప్యాకెట్లు అందుబాటులో ఉంటాయని ఈ నివేదికలో పేర్కొన్నారు.
 
ఇందులో  రైతులు డిమాండ్ చేసే విత్తనాలు అదను దాటాక వస్తుండడం, పలు మండలాల్లో అసలే దొరకకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. కోరుకున్న విత్తనం దొరకక చివరకు దిగుబడి రాని పంటలను సాగు చేసి నష్టపోతున్నారు. అంతేకాకుండా వ్యవసాయ శాఖ పంపిన నివేదిక ప్రకారం విత్తనాలన్నీ ఈనెలలో అందుబాటులో ఉంటేనే పంట సాగుకు అనుకూలంగా ఉంటుంది. కానీ విడతల వారిగా విత్తనాలు జిల్లాకు రావడం, అప్పటికే సాగు సమయం ముగుస్తుండడంతో రైతులు గతంలో విత్తనాల కోసం దుకాణాల వద్ద ఆందోళన చేసిన ఘటనలు పునరావృతం అయ్యే పరిస్థితి ఉంది.
 
ఎరువులదీ అదే పరిస్థితి..
పంట తొలి సాగు సమయంలోనే రైతులకు ఎక్కువ ఎరువులు అవసరం. యూరియా, డీఏపీ, ఎంఓపీ, కాంపెక్ల్స్ ఎరువులు ఈసీజన్‌లో 2.46 లక్షల టన్నులు జిల్లాకు రావాలి. ఈ నెల, వచ్చేనెలలో పత్తి, ఇతర మెట్ట పంటలకు భారీగా ఎరువులు అసవరం. కానీ ఇప్పటి వరకు జిల్లాలో అన్ని రకాల ఎరువులు కలిపి 27,437 టన్నులు మాత్రమే నిల్వ ఉన్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెపుతున్నారు. ఈ నెల రెండో వారంలో రుతుపవనాల ఆగమనం ఉంటే వెంటనే పత్తి విత్తనాలు ముమ్మరంగా వేస్తారు. ఎరువులు కొద్ది మొత్తంలో ఉండడంతో రైతులకు సరిపడా అందే పరిస్థితి లేదు.
 
 దీంతో రైతులు ముందే ఎరువుల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకే సారి రెండు నెలలకు సరిపడా స్టాక్ ఉంటేనే వ్యవసాయ పనులు జోరందుకోనున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం సాగు విస్తీర్ణం పెంచాలన్న లక్ష్యం నెరవేరాలంటే అందుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలి. రైతుల నుంచి డిమాండ్ ఉన్న విత్తనాలు సరఫరా చేస్తేనే దిగుబడి వచ్చి వారికి కూడా ఆర్థిక చేయూత కలుగుతుంది. వ్యవసాయ శాఖ ముందస్తుగా మేల్కొంటేనే ప్రభుత్వ నిర్ణయానికి ఆశించిన ప్రయోజనం కలుగుతుందని రైతులు, రైతు సంఘాల నాయకులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement