ఎవుసం సాగేనా..?
రోనిలో రోకండ్లు పగిలిపోయేంత ఎండలు కొట్టేవి. ఆ తర్వాత మృగశిర కార్తెలో ఎవుసం పనులు మొదలు పెట్టేటోల్లం. సాగువాటు చేసి వానలు పడగానే దుక్కులు దున్నించి విత్తనాలు వేసేందుకు భూములను సిద్ధం చేసేటోల్లం. ఆరుద్రలో వానలు బాగాపడేవి. పూర్వకాలంలో పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేటోల్లం. ఇప్పుడు కార్తెలు కదిలిపోతున్నట్లుగానే కాలమూ పోయింది. వానలు లేవు, పనులు లేవు. వేసిన విత్తనాలు భూముల్లోనే ఉండిపోయాయి. మొలిచినవి ఎండిపోతున్నయ్. ఇదీ..తిరుమలగిరి మండలం గరకనేట్‌తండాకు చెందిన సపావట్ భోజ్యానాయక్ ఆవేదనే కాదు.. కాలాన్ని నమ్ముకుని వ్యవసాయం చేసే మెట్టప్రాంత రైతులదీ ఇదే పరిస్థితి.
⇒ ముఖం చాటేసిన వరుణుడు
⇒ ముగిసిన ఆరుద్ర కార్తె.. దాటిపోతున్న కాలం
⇒ వాడిపోతున్న పత్తి మొక్కలు ∙ఆందోళనలో రైతులు
త్రిపురారం/పెద్దవూర/తిరుమలగిరి : ద్రోణిరూపంలో జూన్ మొదటివారంలోనే తొలకరి పలకరించడంతో ఆనందంగా రైతన్నలు వ్యవసాయ పనులను ప్రారంభించారు. ముందే వస్తాయనుకున్న నైరుతి రుతుపవనాలు కదల్లేక కదులుతుండటంతో కర్షకుల్లో నిరాశ కనిపిస్తోంది. దుక్కులు దున్నిన రైతులు వర్షాలకోసం ఆకాశం వైపు చూడాల్సిన పరిస్థితులు జిల్లాలో నెలకొన్నాయి. ఆయకట్టులో నాగళ్ల సవ్వడి వినిపిస్తున్నా కరుణించని మేఘంతో ఖరీఫ్ సేద్యానికి విత్తనం వేయడం అనుమానంగానే కనపడుతోంది.
తొలకరితో మురిపించిన మేఘాలు తర్వాత ముఖం చాటేశాయి. జూన్‌లో కురవాల్సిన సాధారణ వర్షాలకు పుడమి నోచుకోలేదు.వానలు కురవకపోగా వేడి వడగాలులు వీయడంతో వేడెక్కిన పుడమితల్లితో ఉన్న కొద్దిపాటి పదును కాస్తా పోయి ఖరీఫ్ సాగు కదలకుండాపోయింది. నాగార్జునసాగర్ కెనాల్(ఆయకట్టు) ద్వారా ఉమ్మడి జిల్లాలో సుమారు 4 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. మరో 10వేల ఎకరాలు బోరు, బావుల ఆధారంగా పంటలను సాగుచేస్తున్నారు.12లక్షల ఎకరాలు నాన్‌ఆయకట్టు (వర్షాధారం) కింద కర్షకులు పత్తి, కందులు, పెసర్లు తదితర పంటలను సాగుచేస్తారు. జిల్లాలో ఇప్పటివరకు 45–50వేల ఎకరాల్లో పత్తి సాగుచేశారు.
అడుగంటిన సాగరం.. అందోళనలో రైతులు
వ్యవసాయానికి ప్రధాన సాగు నీటి వనరుగా ఉన్న సాగర్ రిజర్వాయర్‌లో నీటి మట్టం డెడ్‌స్టోరేజీలో ఉండటం, జూలై నెలవచ్చిన నీటి మట్టం పెరగకుండా ఉండటంతో పాటు కృష్ణాపరివాహక ప్రాంతంలో వర్షాలు పడకపోవడంతో ఎగువ నుంచి ఇన్‌ఫ్లో వచ్చే జాడ కనబడడం లేదు. దీంతో ఖరీఫ్ సేద్యంపై రైతన్నలు క్రమ క్రమంగా ఆశలు వదులుకొనే పరిస్థితులు ఆయకట్టులో కనిపిస్తున్నాయి. జూన్‌లో సాధారణ వర్షాలు కురవకపోవడం, జూలై వచ్చినా వరుణుడి జాడే లేకపోవడంతో ఖరీఫ్ సేద్యం చేసేందుకు రైతులు సాహసించే పరిస్థితి కనపడడం లేదు. ఖరీఫ్ మొదలైందంటే నెల ముందే ఒప్పందాలను చేసుకుని పనులను మొదలుపెట్టే కౌలు రైతులు ప్రస్తుత ఆయకట్టులో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో భూములను తీసుకునేందుకు ముందుకురావడం లేదు.
ఖరీఫ్‌పై ఎన్నో ఆశలు పెట్టుకొన్న రైతులు వేలాది రూపాయలు పెట్టి ఇప్పటికే విత్తనాలను, ఎరువులను కొనుగోలు చేశారు. దుక్కులు దున్ని నార్లు పోసేందుకు ఎదురుచూస్తున్న రైతులకు నెలదాటిన వరుణుడి మోహం చాటేయడంతో అన్నదాతల పరిస్థితి ఆందోళకరంగా మారింది. సహజంగా ప్రతి సంవత్సరం జూన్ మాసంలో వర్షాలు కురిస్తే విత్తనాలను వేసేవారు. రోహిణీ కార్తెలో విత్తనాలను విత్తడం వలన అధికలాభం వస్తుందని రైతుల నమ్మకం. కానీ మృగశిరకార్తె, రోహిణి, ఆరుద్ర కార్తెలు వెళ్లిపోయాయి. రుతుపవనాలు కనికరించి ఆలస్యంగా సేద్యం చేస్తే దిగుబడి తగ్గిపోయి,పంటలు రోగాలబారిన పడి న ష్టాలు తప్పవనే రైతులు భావిస్తున్నారు. సకాలం లో వర్షాలు పడకపోతే ఖరీఫ్‌లో ఇబ్బందులు పడక త ప్పదని ఆయకట్టు రైతులు దిగులు చెందుతున్నారు.
మొక్కలు వాడుబట్టినయ్..
జూన్ నెలలో పడిన మొదటి వర్షానికే ఎనిమిది ఎకరాలలో పత్తి విత్తనాలను వేశాను. ఎకరాకు మూడు బ్యాగుల చొప్పున మొత్తం 24 పత్తి విత్తనాల పాకెట్‌ల వేశా. ఒక్క ప్యాకెట్‌కు రూ.780 చొప్పున మొత్తం రూ.19 వేలు విత్తనాలకు, అరకలకు రూ.3వేలు, కూలీలకు రూ.3వేలు పెట్టి విత్తనాలు వేశాను. బాగానే మొలిచాయి. ఇరవై రోజులుగా వర్షాలు పడక పోవడంతో మొక్కలు వాడుబట్టాయి. ఎప్పుడు వర్షం వస్తుందా అని ఎదురుచూస్తున్నా. వర్షం లేకుంటే అప్పుల పాలే గతి.
– కర్నాటి లక్ష్మారెడ్డి, రైతు, పెద్దవూర
ఈ ఏడు కాలం కష్టమే....
ఈ ఏడాది కాలం అయ్యేది కష్టంగా ఉంది. నేను వ్యవసాయం చేసినప్పటి నుంచి మృగశిర, ఆరుద్రకార్తెలలో పంటలను సాగుచేసేవాళ్లం. ఆ కార్తెలో పంటలు బాగా పండేవి. గురువారంతో పునర్వసు కార్తె ప్రారంభమవుతుంది. ఆ కార్తెలో పంటలను సాగుచేసిన పెట్టుబడులు కూడా రావు.
– శాగం కోటిరెడ్డి రైతు, తిరుమలగిరి
మొలకలు రాలేదు
పది రోజుల క్రితం చిరుజల్లులు కురిస్తే నాకున్న నాలుగు ఎకరాల్లో పత్తిని విత్తాను అప్పటి నుంచి వర్షం లేకపోవడంతో ఇంతవరకు విత్తులు మొలకెత్తలేదు. ఇంకో మూడురోజుల దాక వర్షం కురువకపోతే విత్తనాలు మొలకెత్తవు. ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
–బద్దెల వెంకన్న, రైతు