వరుణ బీభత్సం
♦ జిల్లాలో కుండపోతగా వర్షం
♦ నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు
♦ జలమయమైన రోడ్లు
♦ పిడుగుపాటుకు ఇద్దరి మృతి
రాజమండ్రి : నైరుతి రుతుపవనాలు నిష్ర్కమిస్తున్న వేళ.. జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఉరుములు, పిడుగులతో పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం గంటపాటు ఏకధాటిగా వర్షం కురిసింది. తరువాత కూడా వర్షం పడుతూనే ఉంది. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. పిడుగుపాటుకు మండపేట పట్టణంలో అడపా సుబ్బన్న (65), ఇప్పనపాడుకు చెందిన బొబ్బర కాంతం (60) అనే వ్యవసాయ కూలీలు మృతి చెందారు. వర్షాలకు పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరాల్లో డ్రైన్లు పొంగి పొర్లడంతో మురుగు నీరు రోడ్లపై ప్రవహించింది. రాజమండ్రి రైల్వే స్టేషన్ రోడ్డుతోపాటు కాకినాడలో గొడారిగుంట, అమలాపురంలో ఈదరపల్లి వంతెన రోడ్డు నీట మునిగాయి.
మెట్ట రైతుకు మేలు
కాగా ఈ భారీ వర్షం జిల్లాలోని మెట్ట, ఏజెన్సీ రైతులకు పెద్ద ఊరటనిచ్చింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తరువాత ఈ స్థాయి వర్షం కురిసిన సందర్భాలు చాలా తక్కువ. వరి పంట ఎండిపోతున్న సమయంలో కురిసిన ఈ వర్షం మెట్టరైతులకు మేలు చేసింది. మెట్టలో వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయ పంటలకు, కోనసీమ, లంక గ్రామాల్లోని కొబ్బరి, కోకో, ఇతర వాణిజ్య పంటలకు, కూరగాయ పంటలకు ఈ వర్షం ఊపిరిపోశాయి.