వాన మెండుగా..చేలు నిండుగా..
♦ విస్తారంగా వర్షాలతో పెరుగుతున్న పంటల సాగు
♦ ఈసారి ఖరీఫ్‌లో మంచి దిగుబడులకు అవకాశం
♦ మొక్కజొన్న, కంది, పెసర సాగు మొదలు.. పత్తివైపు రైతుల చూపు
సాక్షి, హైదరాబాద్: సకాలంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడం, రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో సాగు ఊపందుకుంది. జూన్ ఒకటో తేదీ నుంచి ఇప్పటివరకు ఏకంగా 58 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వ్యవసాయ పంచాం గం ప్రకారం సరైన సమయంలో వర్షాలు కురవడం వల్ల ఈసారి ఖరీఫ్‌లో మంచి దిగు బడులు వస్తాయని రాష్ట్ర వ్యవసాయ శాస్త్రవే త్తలు చెబుతున్నారు. ఒక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 లక్షల ఎకరాల్లో పంటల సాగు జరిగింది. ఇప్పటికే రైతులు పత్తి, మొక్కజొన్న, కంది, పెసర తదితర పంటలు వేస్తున్నారు. అయితే మరో వారం పది రోజులు ఇలాగే భారీ వర్షాలు కురిస్తే మొలక దశలో ఉన్న ఆయా పంటలకు నష్టం వాటిల్లవచ్చని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొద్దిరోజులపాటు వర్షాలు తగ్గితే మొలక దశలోని పంటలకు ఎంతో ప్రయోజనకరమని వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ఎల్.జలపతిరావు తెలిపారు.
మధ్యకాలిక వరి రకాలే మేలు..
రాష్ట్రంలో మధ్యకాలిక వరి రకాలే మేలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. తెలంగాణ సోన, వరంగల్ సన్నాలు, బతుకమ్మ వంటి వరి రకాలు మధ్యకాలిక రకాలని.. వాటి వల్ల అధిక దిగుబడులు వస్తాయని చెబుతున్నారు. ఈ వరి రకాలకు సంబంధించి జూలై 15వ తేదీన నారు పోసి, ఆగస్టు 15 లోపు నాట్లు వేయాలని... దాంతో అధిక దిగబడులు వస్తాయని సూచిస్తున్నారు. వరికి ఇంకా సమయం ఉన్నందున రైతులు ఆయా భూముల్లో పెసర వేస్తే మంచి ఆదాయం కూడా లభిస్తుందని.. పెసర సాగు చేయనివారు తప్పనిసరిగా పచ్చిరొట్ట విత్తనాలు వేయాలని చెబుతున్నారు.
పత్తితో జాగ్రత్త : గతేడాది పత్తికి అధిక ధర పలికినందున ఈసారి రైతులు పెద్ద ఎత్తున ఆ పంట వైపు తరలి వెళుతున్నారని, అది సరికాదని జలపతిరావు పేర్కొన్నారు. ఈసారి దేశవ్యాప్తంగా పత్తి సాగు పెరిగి, ధరలు తగ్గిపోయే అవకాశముందని అంచనా వేశారు. కాబట్టి రైతులు పప్పుధాన్యాల సాగుపైనా దృష్టిసారించాలని సూచించారు. ఒకవేళ పత్తి వేస్తే అంతర పంటలు వేయాలని, దానివల్ల ప్రయోజనం ఉంటుందని తెలిపారు.
భాస్వరం ఎరువులు వద్దు
అధిక ఎరువుల వాడకం వల్ల తెలంగాణ భూముల్లో భాస్వరం పేరుకుపోయిందని... భాస్వరం అధికంగా ఉంటే జింక్ లోపం ఏర్పడి దిగుబడులు పడిపోతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల డీఏపీ వంటి ఎరువులను సగానికి సగం తగ్గించాలని సూచిస్తున్నారు. ఇక విత్తనాలు వేసే సమయంలోనే కాంప్లెక్స్ ఎరువులు వేయాలని జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన డైరెక్టర్ దండా రాజిరెడ్డి సూచించారు.