తొలకరి అడుగులు
- మూడు రోజులుగా 55 మిమీ వర్షపాతం నమోదు
- పొలంపనుల్లో నిమగ్నమయిన రైతులు
- వర్షాలు అనుకూలమేనన్న ఏరువాక కేంద్రం
అనకాపల్లి: నైరుతి రుతుపవనాలు రాకకోసం ఎదురుచూస్తున్న రైతులకు తొలకరి కాస్త ముందుగానే పలకరించింది. జిల్లాలో మూడురోజుల నుంచి కురుస్తున్న వర్షాలు రైతన్నలకు ఉపశమనం కలిగిస్తున్నాయి. ఈ ఏడాది మేలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఆ ప్రభావం జూన్‌లోను ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసిన రైతున్నకు మే చివరిలోనే ఊరట లభించింది. గత మూడురోజులుగా జిల్లాలోని దాదాపు అన్ని ప్రాంతాలలోను వర్షాలు కురిశాయి. వాతావరణంచల్లగా మారిం ది. ఆకాశం మబ్బులు పట్టి ఉండడంతో రైతుల పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.
వేసవి ఉష్ణోగ్రతలకు ఇప్పటికే సాగులో ఉన్న పంటలను ఆశించిన పురుగులు వర్షాలకు కొట్టుకుపోయాయి. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో పాటు పొలాల్లో కలిగిన చెమ్మదనం తెగుళ్లను సైతం తగ్గించేందుకు దోహదపడింది. మూడురోజులుగా వర్షపాతం సగటున సుమారు 55 మిల్లీమీటర్లు దాటింది. జూన్ సాధారణ వర్షపాతం 123 మిల్లీమీటర్లు కాగా, ఇప్పటికే సగం వరకు నమోదు కావడంతో జూన్ వ్యవసాయ రంగానికి అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గత ఏడాది జూన్‌లో ఆశించిన మేర వర్షాలు నమోదు కాకపోవడంతో ఖరీఫ్ ఆలస్యమైన సంగతి తెలిసిందే.
పొలంపనుల్లో రైతులు బిజీబిజీ...
వాతావరణంలో మార్పులు రావడంతో రైతులు పొలంబాట పట్టారు. విత్తనాల కోసం రైతులు వ్యవసాయ శాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతుండగా మేలో దున్నిన పొలాల్లో నాట్లు వేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. జీలుగ, పిల్లిపెసర, పచ్చిరొట్ట ఎరువులు వేసేందుకు రైతులు తమ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. వర్షాధార చెరుకుకు సైతం ఈ వర్షాలు దోహదపడనున్నాయి. ఖరీఫ్‌ను తొందరగా ప్రారంభించే వరి రైతులు వరినారును ఆశ్రయించేందుకు పొలాల్లో పనులు పూర్తి చేశారు. ఏరువాక కేంద్రానికి బాపట్ల నుంచి వరి వంగడాలు రాగా, వ్యవసాయ కార్యాలయానికి పచ్చిరొట్ట ఎరువులు చేరుకున్నాయి.
వర్షాలు అనుకూలం...డాక్టర్ మోసా, ఏరువాక కేంద్రం సమన్వయకర్త...
మూడురోజుల నుంచి నమోదవుతున్న వర్షాలు జిల్లా వ్యవసాయానికి అనుకూలం. రైతులు పచ్చిరొట్ట ఎరువులతో పాటు రాగి వేసుకోవచ్చు. వరినారు వేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాలి. ఏజెన్సీలో ఖరీఫ్ ముందుగా మొదలయ్యే అవకాశం ఉన్నందున నేరుగా విత్తే పద్ధతికి సంసిద్ధులు కావాలి.