తుపాను భయంతో శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్లపేట తీరంలో బోట్‌ను సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్న మత్స్యకారులు. (ఇన్‌సెట్‌లో) విశాఖ తీరంలో అలల ఉధృతి
సాక్షి, అమరావతి, సాక్షి, విశాఖపట్నం: వాయువేగంతో దూసుకొస్తున్న పెథాయ్ తుపాను కోస్తాంధ్ర జిల్లాలను వణికిస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుపాను గంటకు 17 కిలోమీటర్ల వేగంతో వడివడిగా ప్రయాణిస్తూ అలజడి రేపుతోంది. శనివారం మధ్యాహ్నం వరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగిన తీవ్రవాయుగుండం సాయంత్రానికి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించి తుపానుగా బలపడింది. శనివారం రాత్రి సమయానికి ఇది చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి దక్షిణ ఆగ్నేయంగా 770 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఫెథాయ్ తుపాను ఉత్తర వాయవ్యంగా పయనిస్తూ ఆదివారం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉంది. అనంతరం అదే దిశలో కదులుతూ సోమవారం సాయంత్రానికి వాయుగుండంగా బలహీనపడి మచిలీపట్నం – కాకినాడ మధ్య తీరాన్ని దాటవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి విడుదల చేసిన ప్రత్యేక బులెటిన్‌లో వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం...
తుపాన్ ప్రభావంతో ఆది, సోమవారాల్లో గంటకు 80 – 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఆదివారం కోస్తాంధ్రలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, సోమవారం కొన్నిచోట్ల భారీ వర్షాలు, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావచ్చు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. భారీ వర్షాలు, పెనుగాలుల ధాటికి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలవచ్చని, లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉందని ఐఎండీ హెచ్చరించింది. తుపాను తీవ్రతతో కెరటాలు 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడే అవకాశముందని తెలిపింది. తుపాను తీరం దాటే ప్రాంతంలో ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా చూడాలని ఆర్టీజీఎస్ సూచించింది.
గాలుల తీవ్రత ఎక్కువే...
తుపాను తీరం దాటే సమయంలో పెనుగాలుల తీవ్రత అధికంగా ఉండటంతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అక్టోబరు రెండోవారంలో శ్రీకాకుళం జిల్లాను వణికించిన తిత్లీ తుపాను తీరం దాటే సమయంలో వీచిన ప్రచండ గాలులకు ఉద్దానంలో జీడి, కొబ్బరి తోటలు నేలమట్టమయ్యాయి. పెట్రోలు బంకులు, రైస్‌మిల్లులు, గ్రానైట్ మిల్లులు, జీడిపిక్కల కర్మాగారాలు, నివాస గృహాల పైకప్పులు ఎగిరిపోయాయి. పెథాయ్ కూడా తీవ్ర తుపానుగా మారుతున్నందున జాగ్రత్తగా ఉండాలని పేర్కొంటున్నారు. తీరప్రాంతాల ప్రజలు 17వ తేదీన తుపాను తీరం దాటే సమయంలో సాధ్యమైనంత వరకూ బయటకు రాకుండా ఇళ్లలో ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
సీఎంకు గవర్నర్ నరసింహన్ ఫోన్
ఏపీకి పెథాయ్ తుపాన్ ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో గవర్నర్ నరసింహన్ సీఎం చంద్రబాబుకు ఫోన్‌చేసి ముందస్తు జాగ్రత్త చర్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని గవర్నర్ సూచించారు.
కోనసీమ తీర ప్రాంతంలో విద్యాసంస్థలకు సెలవు..
తుపాన్‌ను ఎదుర్కొనేందుకు చేపట్టిన చర్యలపై విపత్తు నిర్వహణ శాఖ డైరెక్టర్ ప్రసన్న వెంకటేశం, కార్యదర్శి వరప్రసాద్ ఆయా జిల్లాల కలెక్టర్లతో ఫోన్‌లో సమీక్షించారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాలకు రాష్ట్ర విపత్తు సహాయక దళాల (ఎస్‌డీఆర్‌ఎఫ్) తోపాటు జాతీయ విపత్తు సహాయ దళాలను (ఎన్‌డీఆర్‌ఎఫ్‌ను) పంపించారు. అగ్నిమాపక సిబ్బందిని కూడా సహాయక చర్యలకోసం సిద్ధం చేశారు. పెథాయ్ తీవ్ర తుపాను తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం ఓడలరేవు, మామిడికుదురు మండలం ఆదుర్రు మధ్య తీరం దాటే అవకాశముందని భావిస్తున్నారు. తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని, పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టరు కార్తికేయ మిశ్రా సూచించారు. మరోవైపు కోనసీమలో 27 చోట్ల పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోనసీమలోని ఎనిమిది తీర ప్రాంత మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యా సంస్థలకు సోమవారం, మంగళవారం అధికార యంత్రాంగం సెలవుగా ప్రకటించింది.
కృష్ణపట్నం పోర్టులో 3వ నంబర్ హెచ్చరిక జారీ...
తుపాన్ హెచ్చరికల నేపథ్యంలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవులో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. తుపాను తీవ్రతకు సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తమిళనాడుకు చెందిన మత్స్యకారులు చేపల వేటను నిలిపివేసి మరపడవల్లో కృష్ణపట్నం పోర్టుకు చేరుకున్నారు. మరోవైపు చీరాల వాడరేవు నుంచి గత మంగళవారం ఐదుబోట్లలో వేటకు వెళ్లిన 30 మంది మత్స్యకారులు సురక్షితంగా తిరిగి రావటంతో వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. విశాఖపట్నం జిల్లాలో తీరప్రాంత మండలాల్లో అధికారులను అప్రమత్తం చేశామని జాయింట్ కలెక్టర్ క్షితిజ తెలిపారు. తీర ప్రాంత గ్రామాల్లో అధికారులు తమ కేంద్రాలను వదిలి వెళ్లరాదని పశ్చిమగోదావరి జిల్లాలో ఉత్తర్వులు జారీ చేశారు. నరసాపురం, మొగల్తూరు, కాళ్ల, భీమవరం మండలాలపై తుపాన్ ప్రభావం అధికంగా ఉండే అవకాశం ఉన్నందున అక్కడ ప్రత్యేక అధికారులు, బృందాలను నియమించారు. గుంటూరు జిల్లాలో 2 లక్షల ఎకరాలకు పైగా వరి పంట కోతకు సిద్ధంగా ఉండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
బలపడే అవకాశం తక్కువే!
– ‘సాక్షి’తో ఐఎండీ డైరెక్టర్ జనరల్ కేజీ రమేష్
పెథాయ్’ తీవ్ర తుపానుగా బలపడటానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేవని, ఇది తుపాను దశ నుంచి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ‘పెథాయ్ శనివారం సాయంత్రం 5.30 గంటలకు తుపానుగా మారింది. ఇది తీవ్ర తుపానుగా మారడానికి ప్రస్తుతం సముద్రంలో వాతావరణం కొంత ప్రతికూలంగా ఉంది. ఆదివారం మధ్యాహ్నానికి తుపాన్ ఒంగోలు సమీపానికి చేరుకుంటుంది. చెన్నై, మచిలీపట్నం రాడార్ కేంద్రాల పరిధిలోకి వచ్చాక పెథాయ్ కదలికలు, స్థితిగతులను పరిశీలించాక అది తుపానుగానే మిగిలిపోతుందా? తీవ్ర తుపానుగా మారుతుందా? ఎక్కడ తీరం దాటుతుందనే అంశాలను అంచనా వేయవచ్చు’ అని న్యూఢిల్లీలోని భారత వాతావరణ విభాగం(ఐఎండీ ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ కేజీ రమేష్ ‘సాక్షి’కి తెలిపారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల ప్రకారం పెథాయ్ తీవ్ర వాయుగుండంగానే తీరం దాటేలా ఉందన్నారు. ‘ఇది సోమవారం మధ్యాహ్నానికిగానీ తీరం దాటదు. ఆదివారం మధ్యాహ్నం తర్వాత సమీక్షించాక ప్రభావం ఎలా ఉంటుందో కచ్చితంగా నిర్ధారణకు రావచ్చు..’ అని వివరించారు.
కంట్రోల్ రూంల నంబర్లు ఇవీ...
తుపాను, భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో సహాయక చర్యలు, సాయం పొందేందుకు పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.
మచిలీపట్నం కలెక్టరేట్ : 08672– 252170, 252171, 252172
గుడివాడ: 08674–243697
నూజివీడు : 08656–232717
విజయవాడ : 0866–2574454
పశ్చిమ గోదావరి కలెక్టర్ కార్యాలయం: 1800233 1077 (టోల్‌ఫ్రీ నెంబరు)
ప్రకాశం జిల్లా కంట్రోల్ రూం: 08592–281400, 1077 (టోల్ ఫ్రీ నంబర్)
శ్రీకాకుళం కంట్రోల్ రూం నంబర్ 08942–240557
Comments
Please login to add a commentAdd a comment