ఆగస్టు ఆశలు ఆవిరి..!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాలు దేశంలోకి అడుగుపెట్టి 2 నెలలు పూర్తవుతున్నా.. తగినన్ని వర్షాలు కురవకపోవడంతో ఏపీ, తెలంగాణల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. జూన్, జూలైల్లో 2 రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలు మాత్రమే పడటంతో ఈ ఏడాది వ్యవసాయం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. కనీసం ఆగస్టులో నైనా తగినంతగా వర్షాలు పడితే వేసిన పంటలను కాపాడుకోవచ్చని భావించిన రైతుల ఆశలపై వాతావరణ శాస్త్రవేత్తలు నీళ్లు చల్లుతున్నారు. రుతుపవనాల ప్రభావం ఈ నెల కూ డా సాధారణం కంటే తక్కువగానే ఉంటుందని అంటున్నారు.
మధ్య బంగాళాఖాతంలో బల మైన వాతావరణ వ్యవస్థలేవీ ఏర్పడకపోవడం దీనికి కారణమని ప్రైవేట్ వాతావరణ అంచనా ల సంస్థ స్కైమెట్ శాస్త్రవేత్త ‘సాక్షి’కి తెలిపారు. జూన్ చివరలో పసిఫిక్ మహా సముద్ర ప్రాంతంలో ఏర్పడ్డ భారీ తుపానులు హిందూ మహా సముద్ర ప్రాంతం నుంచి తేమను మోసుకెళ్లడంతో జూలైలో ఆశించిన స్థాయిలో వర్షాలు పడలేదని వివరించారు. వచ్చే రెండు మూడు రోజుల్లో ఉత్తర ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో కొద్దిపాటి వర్షాలు పడే అవకాశముందన్నారు. బంగాళాఖాతం ఉత్తర ప్రాంతం లో ఏర్పడుతున్న వాతావరణ వ్యవస్థలు పశ్చిమ దిక్కుగా ప్రయాణిస్తూ ఈ ప్రాంతాల్లో వర్షాలు కురిపిస్తున్నాయన్నారు.
అయితే ఈ నెల 13, 14 తేదీల్లో మధ్య బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడవచ్చని, వాటి ప్రభావంతో ఏపీ, తెలంగాణలలో వానలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఆగస్టు 15 నుంచి 20వ తేదీల మధ్య కొంత స్తబ్దత ఏర్పడినా ఆ తరువాత వానలు ఎక్కువగా పడే అవకాశముందని తెలిపారు.
లెక్కల్లో సాధారణం.. కొన్నిచోట్ల అధికం
ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావం దేశవ్యాప్తంగా ఒకే తీరుగా లేదు. లెక్కల ప్రకారం చూస్తే వర్షాలు సాధారణం కంటే కేవలం 3 శాతం మాత్రమే తక్కువగా కురిశాయి. కానీ గుజరాత్‌తో పాటు, రాజస్తాన్, ఒడిశా, మధ్యప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలతో వరదలు పోటెత్తాయి. రాయలసీమ, దక్షిణ తెలంగాణల్లో సగటు కంటే 10 నుంచి 20 శాతం తక్కువ వర్షాలు పడ్డాయి.
అంచనాలు సవరించిన స్కైమెట్: నైరుతి రుతుపవనాల ప్రభావం అంచనాలను స్కైమెట్ తాజాగా సవరించింది. సాధారణ వర్షాలు కురుస్తాయని మొదట్లో ప్రకటించిన ఈ సంస్థ తాజాగా దీర్ఘకాలిక సగటులో 98% వరకూ వానలు పడే అవకాశముందని శనివారం పేర్కొంది. జూన్, జూలైలలో దేశం మొత్తమ్మీద 452 మిల్లీమీటర్ల వర్షం నమోదు కావాల్సి ఉం డగా, 4% తక్కువగా నమోదైందని స్కైమెట్ సీఈవో జతిన్ సింగ్ తెలిపారు. జూన్‌లో సగటు కంటే 16% ఎక్కువగా, జూలైలో 15% తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు.