విశాఖ నగరాన్ని వణికిస్తున్న చలిపులి
విశాఖపట్నం: నగరంలో చలిపులి పంజా విసురుతోంది. విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో చలితీవత్ర రోజురోజుకీ పెరుగుతోంది. ఒక్కసారిగా గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి పడిపోవడంతో విశాఖ ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికీ విశాఖలో 20 నుంచి 23 వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దాంతో విశాఖ మన్యం ప్రాంతంలో చల్లగాలులు వీస్తున్నాయి. రాత్రివేళల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో తట్టుకోలేక ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశమున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడన ప్రభావంతో 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈశాన్య దిశగా ఈదురుగాలులు వీసే అవకాశమున్నట్టు అధికారులు తెలిపారు. ఫలితంగా దక్షిణాకోస్తాలో చాలా చోట్ల వర్షాలు, ఉత్తరకోస్తాలో ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశముంది. చేపల వేటకు వెళ్లే మత్య్సకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.