24 నాటికి వాయుగుండంగా మారే చాన్స్
రాష్ట్రానికి మూడు రోజులు వర్షసూచన
చాలాచోట్ల తగ్గిన ఉష్ణోగ్రతలు
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 22న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఇది తొలుత వాయవ్య దిశలో కదిలి ఈ నెల 24వ తేదీ నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని సూచించింది. కాగా సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
అత్యధికంగా రంగారెడ్డి జిల్లా పసుమాములలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్ సరిహద్దు జిల్లాల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ప్రస్తుతం రాష్ట్రానికి ఆగ్నేయ దిశ నుంచి బలమైన గాలులు వీస్తున్నాయి. సోమవారం చాలాచోట్ల సాధారణం కంటే 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గరిష్టంగా ఆదిలాబాద్‌లో 41.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment