నడి వేసవికి ముందే రాష్ట్రంలో మండుతున్న ఎండలు
30 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్‌కుపైగా ఉష్ణోగ్రతలు నమోదు
సగటున సాధారణం కంటే 2 నుంచి 4.3 డిగ్రీలు అధికం
నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీలుగా నమోదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ నెల తొలివా రం నుంచి క్రమంగా పెరగాల్సిన గరిష్ట ఉష్ణోగ్రతలు ఇప్పటికే అత్యధిక స్థాయిలో నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 డిగ్రీల నుంచి 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా రికార్డవుతున్నాయి. దీంతో ఇక నడి వేసవి పరిస్థితి ఎలా ఉంటుందోననే ఆందోళన అందరిలో కలుగుతోంది.
వాతావరణంలో నెలకొంటున్న మార్పు లతో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు. రానున్న మూడు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యవసర పరిస్థితిలో తప్ప మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
గతేడాది కంటే 2.5 డిగ్రీలు అధికంగా...
నల్లగొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది ఇదే రోజున 41 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. గురువారం రాష్ట్రంలోని 30 ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
గతేడాది ఈ ప్రాంతాల్లో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతతో పోలిస్తే ప్రస్తుతం సగటున 1 డిగ్రీల సెల్సీయస్ నుంచి 2.5 డిగ్రీల సెల్సీయస్ అధికంగా నమోదైంది. ఖమ్మంలో సాధారణం కంటే 4.3 డిగ్రీల సెల్సియస్ అధికంగా ఉష్ణోగ్రత నమోదవగా హైదరాబాద్‌లో 2.8 డిగ్రీల సెల్సియస్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో 2 డిగ్రీల సెల్సియస్ చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment