కాటన్ బ్యారేజ్ నుంచి విడుదలవుతున్న జలాలు
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం వల్ల నదీ పరివాహక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో నదులు వరద ప్రవాహంతో పరుగులు తీస్తున్నాయి. ఉప నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని ఎస్సారెస్పీ (శ్రీరాంసాగర్ ప్రాజెక్టు) నుంచి 3.50 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి నుంచి 6.71 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి ప్రాణహిత, ఇంద్రావతి వరద తోడవడంతో కాళేశ్వరంలో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నుంచి 9.60 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో పోలవరం ప్రాజెక్టు వద్దకు వచ్చే వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతోంది.
బుధవారం సాయంత్రం 6 గంటలకు పోలవరం వద్దకు 5.20 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4.82 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 4.80 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గురువారం ఉదయానికి ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు 9 నుంచి 10 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి.
శ్రీశైలంలోకి తగ్గిన వరద..
కృష్ణా బేసిన్‌లో వర్షపాత విరామం వల్ల కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గింది. శ్రీశైలంలోకి 89,391 క్యూసెక్కులు చేరుతుండగా.. ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ నిరంతరాయంగా విద్యుదుత్పత్తి చేస్తూ 30 వేల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తోంది. ప్రస్తుతం శ్రీశైలంలో 877.92 అడుగుల్లో 177.35 టీఎంసీల నీరుంది. సాగర్‌లోకి 12,200 క్యూసెక్కులు చేరుతుండగా విద్యుదుత్పత్తి ద్వారా 10,360 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.
ప్రస్తుతం సాగర్‌లో 587.6 అడుగుల్లో 305.86 టీఎంసీల నీరు ఉంది. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 23,480 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో వరదను స్పిల్ వే గేట్ల ద్వారా, విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి వస్తున్న జలాలకు కట్టలేరు, మున్నేరు, వైరా ప్రవాహం తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 1,16,771 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 9,821 క్యూసెక్కులు వదిలి, మిగిలిన 1,06,950 క్యూసెక్కులను బ్యారేజీ 60 గేట్లను రెండడుగులు, 10 గేట్లను మూడడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు.
వంశధార, నాగావళిలో పెరిగిన వరద
వంశధార, నాగావళి నదుల్లో వరద మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 12,132 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళి నుంచి నారాయణపురం ఆనకట్ట వద్దకు చేరుతున్న 7,400 క్యూసెక్కులను కడలిలోకి విడుదల చేస్తున్నారు. సోమశిలలోకి పెన్నా ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. సోమశిల రిజర్వాయర్‌లోకి 25,613 క్యూసెక్కులు చేరుతుండగా 10,486 క్యూసెక్కులను కండలేరుకు, దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 71.51 టీఎంసీల నీరుంది. మరో 6.5 టీఎంసీలు చేరితే సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తేస్తారు. కండలేరులోకి 8,600 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 54.10 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 14 టీఎంసీలు అవసరం.
Comments
Please login to add a commentAdd a comment