
ముందుగా అనుకున్నట్లుగానే రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: ముందుగా అనుకున్నట్లుగానే రుతుపవనాలు జూన్ మొదటి వారంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తాకనున్నాయి. జూన్ 5 లేదా 6వ తేదీ నాటికి రాయలసీమని నైరుతి తాకనుంది. ఆ సమయంలో ఉరుములతో కూడిన వర్షాలు విస్తరించి, దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు రానున్నాయి. ఆ తర్వాత గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలకు విస్తరిస్తాయి. అలాగే, జూన్ 11 లేదా 12 నాటికి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు విస్తరించనున్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. గత పదేళ్ల రికార్డులను బట్టి చూసినా కూడా ఇదే తరహాలో నైరుతి విస్తరణ జరుగుతూ వస్తోందని వారు వివరిస్తున్నారు. గత రెండేళ్లు మాదిరిగానే.. ఈసారీ రుతుపవనాల కాలంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని, పంటలకు అనుకూలంగా వర్షాలు కురిసి అన్నదాతలకు మేలు చేకూరుతుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఐఎండీ భిన్న ప్రకటనల్లో వాస్తవమెంత?
తొలుత మే 31న నైరుతి కేరళని తాకనున్నట్లు కొద్ది రోజుల క్రితం భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ప్రకటన చేసింది. ఆ తర్వాత ఆ ప్రకటనను మార్చి రుతుపవనాలు కాస్త ఆలస్యమవుతున్నాయని, జూన్ 3న కేరళని తాకనున్నాయని ఐఎండీ తాజాగా మరో ప్రకటన చేసింది. వాస్తవానికి మే 27 నాటికే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. అయితే అప్పటికే రుతుపవనాలు బలహీనంగా మారటంతో విస్తరణలో జాప్యం జరుగుతోందని, మరో రెండ్రోజుల్లో తిరిగి బలపడి విస్తరణలో వేగం పుంజుకుంటాయని స్పష్టం చేస్తున్నారు.
రెండు రోజులపాటు వర్షాలు
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): నాలుగు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా దడ పుట్టించిన ఎండల తీవ్రత సోమవారం తగ్గింది. అక్కడక్కడా కొన్నిచోట్ల మినహా మిగిలిన ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతలే నమోదయ్యాయి.మరోవైపు రానున్న రెండు రోజులు రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రాలు తెలిపాయి.
అల్పపీడనాలు లేకపోవడం వల్ల..
నైరుతి రుతుపవనాలు సకాలంలోనే రాష్ట్రంలోకి రానున్నాయి. రుతుపవనాలు వచ్చిన తర్వాత తొలకరి వర్షాలు మెల్లమెల్లగా అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఇప్పటికే కేరళని తాకిన రుతుపవనాలు బలహీనంగా ఉండటం వల్ల వర్షాలు కేరళకు మాత్రమే పరిమితమైపోయాయి. అయినా త్వరలోనే వేగం పుంచుకుంటాయి. జూన్ నెలలో తొలి రెండు వారాల వరకు బంగాళాఖాతంలో ఎలాంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశం లేనందున రుతుపవనాలు విస్తరించనున్నాయి.
– సాయి ప్రణీత్, వాతావరణ నిపుణుడు