వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల ఒంట్లో నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది.
హోమియో కౌన్సెలింగ్
మా నాన్నగారి వయసు 47 ఏళ్లు. ఆయన చాలాకాలంగా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ సమస్య తరచూ ఉత్పన్నమవుతోంది. దీనికి చికిత్స ఉందా? తెలియజేయగలరు. – ఎన్. శ్యామ్, నకిరేకల్
వేసవి కాలంలో ఎండ తీవ్రత వల్ల ఒంట్లో నీరు చెమట రూపంలో బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల రక్తంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీనికి తగినట్లుగా ఎక్కువ నీటిని తాగాలి. అలా తాగకపోవడం, కూల్‌డ్రింక్స్ తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య వేసవిలో తీవ్రమయ్యే అవకాశం ఉంటుంది. హోమియో చికిత్సలో కిడ్నీలో రాళ్ల సమస్యను పూర్తిగా తగ్గించవచ్చు. మళ్లీ తిరగబెట్టకుండా నయం చేయవచ్చు.
మూత్రపిండాలు రక్తాన్ని వడపోసి వ్యర్థాలను, అదనపు నీటిని మూత్రం ద్వారా బయటకు పంపించి శరీరంలోని లవణాల సమతౌల్యతను కాపాడతాయి. మూత్రంలో అదనంగా ఉండే లవణాలు స్ఫటికరూపంలోకి మారతాయి, వాటిని రాళ్లు అంటాం. అవి మూత్ర విసర్జక వ్యవస్థలోని ఏ భాగంలోనైనా (మూత్రపిండాలు, మూత్రనాళాలు, మూత్రకోశం) ఏర్పడే అవకాశం ఉంది.
లక్షణాలు : విపరీతమైన నడుమునొప్పి, కడుపునొప్పి, వాంతులు, మూత్రంలో మంట ప్రధానమైనవి. కొందరిలో ఏదో ఒకవైపు నడుమునొప్పి, జ్వరం రావచ్చు. ఇంకొందరిలో నడుము, ఉదరం మధ్య భాగాలలో నొప్పి వచ్చి పొత్తికడుపు, గజ్జలు, కాళ్లలోకి పాకుతుంది. కండరాలు బిగువుగా మారడం, కడుపు ఉబ్బరం ఉంటుంది. కొన్నిసార్లు ఎలాంటి లక్షణాలు, నొప్పి లేకుండానే కిడ్నీలో రాళ్లు ఉండవచ్చు.
నివారణ / జాగ్రత్తలు : రోజుకు 2 – 3 లీటర్ల నీళ్లు తాగాలి. ఉప్పు మితంగా తీసుకోవాలి. విటమిన్ సి, క్యాల్షియమ్ సప్లిమెంట్ల వంటి మాత్రలను కేవలం వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి. శీతల పానియాలను మానేయాలి.
చికిత్స : రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని జెనెటిక్ కాన్‌స్టిట్యూషన్ చికిత్స ద్వారా కిడ్నీ స్టోన్స్ కండిషన్‌కు చికిత్స చేయవచ్చు. కిడ్నీలోని లవణాల సమతౌల్యతను కాపాడి, వాటి పనితీరును మెరుగుపరచడం ద్వారా కిడ్నీలలో మళ్లీ మళ్లీ రాళ్లు రాకుండా చేయవచ్చు.
డాక్టర్ శ్రీకాంత్ మోర్లావర్
సీఎండ్‌డి హోమియోకేర్ ఇంటర్నేషనల్
హైదరాబాద్