కానరాని కనికరం
► వడదెబ్బ మృతులకు పరిహారానికి ఎన్నో నిబంధనాలు
► ఉష్ణోగ్రత 52 డిగ్రీలు దాటితేనే చెల్లించే ప్రతిపాదనలు
► పేద కుటుంబాలకు తీవ్ర అన్యాయం
నర్సీపట్నం: ఈ ఏడాది ఎండలు ప్రజలను ఠారెత్తిస్తున్నాయి. ఏటేటా భూతాపం పెరిగి ఎండలు మండిపోతున్నాయి. వడగాడ్పులకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే కేంద్రం వడగాడ్పులను ప్రకృతి విపత్తుగా పరిగణించలేమని చెబుతోంది. ఇలా వారికి రావాల్సిన పరిహారం ఇవ్వటం లేదు. స్థానిక విపత్తుగా లెక్కించి సహాయక చర్యలు, పరిహారం అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు చేస్తోంది. పనులు చేసే రైతులు, కార్మికులే ఎక్కువగా ఈ వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో మృతులకు పరిహారం అందక అనేక కుటుంబాలు వీధిన పడుతున్నాయి.
పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
భానుడి ప్రతాపానికి మార్చి నుంచే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి. అడవులు అంతరించిపోవడంతో వేడి, వడగాడ్పులు అధికంగా ఉంటున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు కారణంగా వృద్ధులు, పనులు చేసుకునే వారు పిట్టల్లా రాలిపోతున్నారు. బీడుబారిన పొలాలు, నీటి చుక్క కన్పించని దయనీయ పరిస్థితితో పొలం పనులకు వెళ్లిన రైతులు, కూలీలు, ఇతర పనులు చేసే వారు పదుల సంఖ్యలో వడగాడ్పులతో ప్రాణాలు కోల్పోతున్నారు.
నిబంధనతో దాటవేత
43 డిగ్రీల ఉష్ణోగ్రతకే వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం పది గంటలు దాటితే చాలా మంది ఇళ్లకే పరిమితమవుతున్నారు. అటువంటిది కేంద్రం 52 డిగ్రీల ఉష్ణోగ్రత దాటితేనే విపత్తుగా పరిగణిస్తామని ప్రకటించటం వల్ల వడగాడ్పులకు మరణించే వారి కుటుంబాల వారికి పరిహారం విషయంలో అన్యాయం జరుగుతుంది. అదే కేంద్రం విపత్తుగా గుర్తిస్తే బాధిత కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం అందుతుంది. కొత్తగా వచ్చిన నిబంధనలు ప్రకారం 52 డిగ్రీలు దాటితేనే విపత్తుగా లెక్కిస్తామని చెబుతోంది. దీంతో సాధారణ ఉష్ణోగ్రత నమోదైన సమయంలో మృతి చెందిన వారికి లక్ష రూపాయలు పరిహారం కాకుండా ఆపద్బంధు పథకం కింద కేవలం రూ.50 వేల మాత్రమే అందజేయనున్నారు. ఈ నిబంధన వల్ల మృతుల కుటుంబాలకు పెద్దగా ఆర్థిక ఆసరా అందే అవకాశాలు లేవు.
కమిటీ నిర్ధారణతో పరిహారం
వడదెబ్బతో మృతిచెందారని నిర్ధారించేందుకు ప్రభుత్వం తహసీల్దార్, వైద్యుడు, ఎస్‌ఐతో కమిటీ ఏర్పాటు చేసింది. వీరు పూర్తిస్థాయి విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిస్తే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మృతులకు లక్ష రూపాయలు పరిహారం అందజేస్తుంది. దీంతో ఏటా పదుల సంఖ్యలో మృతి చెందుతున్నా నిబంధనల కారణంగా అరకొరగా పరిహారం అందుతుంది.
కమిటీకి సమాచారం అందజేయాలి
వడదెబ్బతో ఎవరైనా మృతి చెందితే కమిటీకి త్వరగా సమాచారం అందజేయాలి. వెంటనే కమిటీ సభ్యులు సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు నమోదు చేస్తారు. పోస్టుమార్టం నిర్వహించి నివేదిక అందజేస్తారు. - వి.వి.రమణ, తహసీల్దార్