![High sunny intensity In Jogulamba Gadwal District - Sakshi](/styles/webp/s3/article_images/2018/04/22/nh.jpg.webp?itok=gTo2Tmn4)
ఎండ తీవ్రతతో రద్దీయే లేని ఎర్రవల్లి చౌరస్తాలోని జాతీయ రహదారి
సాక్షి, గద్వాల: సూర్య భగవానుడు ఉగ్రరూపం దాల్చడంతో జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. శనివారం ఉష్ణోగ్రత 43.4డిగ్రీల సెల్సియస్‌కు చేరడంతో మధ్యాహ్నం 12గంటలకే రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. ఈ నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే వచ్చే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుని జనం ఆందోళన చెందుతున్నారు. పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 5డిగ్రీ సెల్సియస్ వరకు ఎక్కువ నమోదవుతోంది. దీంతో ఎండవేడికి బయటి రావాలంటే ప్రజలు జంకుతున్నారు. అధిక ఉష్ణోగ్రతకు తోడు వేడిగాలులూ వీస్తుండటంతో జనంఇబ్బందులకు గురవుతున్నారు.
ఉపశమనం కోసం శీతల పానీయాలను తాగుతున్నారు. ఎండలను నుంచి తట్టుకునేందుకుగాను గొడుగులు, తువ్వాలు కప్పుకొని బయటకు వస్తున్నారు. ఎండదెబ్బకు దుకాణ సముదాయాలు సైతం కొనుగోలుదారులు లేక వెలవెలబోతున్నాయి. వ్యాపార సముదాయాలకు సాయంత్రం వేళ మాత్రమే ప్రజలు వస్తున్నారు. కొన్నిరోజుల క్రితం పగలు ఎండకొట్టినా రాత్రివేళ వాతావరణం చల్లగానే ఉండేది. ప్రస్తుతం రాత్రివేళా ఉక్కబోత భరించలేనంతగా ఉంటోంది. కూలర్లు పెట్టినా ఉపశమనం దక్కట్లేదంటే పరిస్థితి ఏమిటో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. పెరిగిన ఉష్ణోగ్రతలతో వాహనదారులు సైతం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు.
జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యం
గత వేసవి కాలంలో నడిగడ్డలో 44 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పుడే 42డిగ్రీల సెల్సియస్ దాటడం ఆందోళన కలిగిస్తోంది. వేసవితాపం నుంచి విముక్తి పొందేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సూచించారు. ఈసారి రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు భానుడి భగభగలు, మరోవైపు ముఖాన్ని మాడ్చేలా వడగాలులు.. ఇలా జిల్లా ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 15రోజుల క్రితం 37డిగ్రీల సెల్సియస్‌లోపు ఉష్ణోగత్ర నమోదైన సమయంలో లేని వడగాలులు ప్రస్తుతం 40డిగ్రీలు దాటిన క్రమంలో వేడిగాలులు ఉత్పన్నమవుతున్నాయి.
మామూలు ఎండల కంటే వడగాలులు ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తీవ్రమైన ఎండలో తిరిగే వారికి ప్రధానంగా వడదెబ్బ తగలడం, బాగా నీరసించి పోవడం, కండరాలు పట్టుకుపోతాయంటున్నారు. దీనివల్ల తరచూ వాంతులు, విరేచనాలు, హైఫీవర్, చర్మం పొడిబారడం, డీ–హైడ్రేషన్, బీపీ పెరగడం, కిడ్నీ, గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. మధ్యాహ్నం వేళ బయటికి రాకుండా ఉండటం, ఒకవేళ వెళ్లినా తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే ఆరోగ్యంగా ఉంటారని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నీళ్లు, కొబ్బరిబొండాలు ఎక్కువగా తాగాలని వారు సూచిస్తున్నారు.
![1](https://www.sakshi.com/gallery_images/2018/04/22/empty-road.jpg)
మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా మారిన జిల్లా కేంద్రంలోని రాజీవ్‌మార్గ్ రోడ్డు
Comments
Please login to add a commentAdd a comment