దక్షిణ, నైరుతి దిశల నుంచి వీస్తున్న బలమైన గాలులు
పొడి వాతావరణంతో పెరిగిన వడగాల్పుల తీవ్రత
13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న వారం రోజులపాటు వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలకుతోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాడ్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది.
ముఖ్యంగా 13 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది.
ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రవ్యాప్తంగా బుధ, గురువారాల్లో వడగాడ్పుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. అయితే ఈ నెల 6 వరకు తీవ్ర వడగాడ్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడా తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
రామగుండం.. అగ్నిగుండం..
మంగళవారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే రామగుండంలో 44.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
అలాగే ఖమ్మంలో సాధారణం కంటే 3.6 డిగ్రీలు, భద్రాచలం, మహబూబ్‌నగర్, హైదరాబాద్‌లలో 3 డిగ్రీల చొప్పున అధికంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక రాష్ట్ర ప్రణాళిక శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని చాలాచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదయ్యాయి.
జగిత్యాల జిల్లా జైనలో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా నల్లగొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2, జగిత్యాల జిల్లా అల్లీపూర్‌లో 46.1, కొల్వాయ్ 46 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ సీజన్‌లోకెల్లా ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment