
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సాధారణంకంటే 2 నుంచి 5 డిగ్రీలకు పైగా క్షీణించాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేసవి ఛాయలు కనిపించలేదు. ఈ పరిస్థితి మరో రెండ్రోజులు కొనసాగవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు. నిన్నటి దాకా 43 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు మంగళవారం నాటికి 38 డిగ్రీలకంటే తక్కువకు పడిపోయాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం(రెంటచింతల)లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 3.3 డిగ్రీలు తక్కువ. అనంతపురంలో 34 డిగ్రీలు (5.3 డిగ్రీలు తక్కువ) రికార్డయింది.
మిగతా ప్రాంతాల్లో 33, 36 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గత నెలరోజుల్లో ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు, దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది.
అదే సమయంలో అక్కడక్కడ పిడుగులకు ఆస్కారముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో నర్సీపట్నంలో 6, అచ్చంపేట 5, రాచెర్ల 4, పాడేరు, తనకల్, ఆత్మకూరులలో 3, పొదిలి, పులివెందులల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.