Visakhapatnam Weather Center
-
బంగాళాఖాతంలో అల్పపీడనం!
సాక్షి, అమరావతి/మహారాణిపేట (విశాఖ దక్షిణ): తూర్పు మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావం వల్ల రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. 24 గంటల్లో ఇది పశ్చిమ–వాయవ్య దిశగా ప్రయాణించి దక్షిణ ఒడిశా, ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీరాలను చేరుకునే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. మరోవైపు నైరుతి రుతుపవనాల తిరోగమనం కొనసాగుతోందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. -
రేపు అల్పపీడనం.. భారీ వర్షసూచన
సాక్షి, విశాఖపట్నం: తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 4.5 కి.మీ. ఎత్తు వరకూ విస్తరించింది. దీని ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రెండు రోజులపాటు విస్తారంగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, గుంటూరు జిల్లాల్లోను.. సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గడచిన 24 గంటల్లో రాజమండ్రిలో 7.2 సెం.మీ., అంబాజీపేటలో 7, ఎల్.ఎన్. పేటలో 6.7, తణుకులో 6.3, మచిలీపట్నంలో 6.1, మండపేటలో 5.9, అనపర్తి, పెడనలో 5.9, మచిలీపట్నంలో 5.6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఒకవైపు ఎండ.. మరోవైపు వాన
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలు పడుతుండగా మరికొన్ని జిల్లాల్లో ఎండలు తీవ్రంగా ఉంటున్నాయి. మంగళవారం దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల వర్షాలు కురవగా, ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. విశాఖ జిల్లా అనకాపల్లిలో 38.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదుకావడంతో మంగళవారం దక్షిణ భారతదేశంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన జిల్లాగా విశాఖ రికార్డుకెక్కింది. మిగిలిన ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు... ఈ నెల 13న ఆంధ్రప్రదేశ్ తీరంలో అల్పపీడనం ఏర్పడి కాకినాడ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ అల్పపీడనం దిశను మార్చుకుని ఒడిశా వైపు పయనించే సూచనలు కూడా కనిపిస్తున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్పపీడనం ఏర్పడిన తర్వాత నుంచి కోస్తా, రాయలసీమల్లో వర్షాలు జోరందుకొంటాయని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు కిర్లంపూడిలో 75.25 మి.మీ, రావులపాలెంలో 72.25 మి.మీ, అయినవిల్లిలో 64.5, ఐ.పోలవరంలో 62.25, రాజమండ్రిలో 55.5, దగదర్తిలో 44.5, ఒంగోలులో 42.5 మి.మీల వర్షపాతం నమోదైంది. -
జోరుగా వర్షాలు
నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఒకటి రెండు జిల్లాలు మినహాయించి విస్తారంగా వర్షాలు కురిశాయి. మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వానలు పడటంతో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి జనజీవనం స్తంభించింది. కొన్ని చోట్ల రహదారులపైకి నీరు చేరడంతో ఆయా ప్రాంతాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పంట పొలాల్లోకి నీరు చేరింది. గుంటూరు జిల్లాలోని ఎత్తిపోతల జలపాతం జలకళను సంతరించుకుంది. సాక్షి నెట్వర్క్: నైరుతి రుతుపవనాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కొన్నిచోట్ల రహదారులపైకి నీరు చేరి రాకపోకలు స్తంభించాయి. పలు జిల్లాల్లో వాగులు పొంగుతున్నాయి. పొలాలు నీట మునిగాయి. ► కృష్ణా జిల్లా లింగగూడెం వద్ద గండి వాగు పొంగటంతో పెనుగంచిప్రోలు–విజయవాడ మధ్య.. మరోవైపు ముండ్లపాడు మీదుగా నందిగామ, విజయవాడకు రాకపోకలు స్తంభించాయి. జి.కొండూరు మండలంలో పులివాగుపై కల్వర్టు కొట్టుకుపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ► తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో వరి చేలు ముంపు బారినపడ్డాయి. విశాఖ, నెల్లూరు, అనంతపురం, వైఎస్సార్, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. మరో మూడు రోజులు వర్షాలు ► వచ్చే మూడు రోజులు కోస్తా, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. ► ఈ నెల 18న కోస్తాంధ్ర, 19న ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయి. -
మరో రెండ్రోజులు విస్తారంగా వర్షాలు
మహారాణిపేట (విశాఖ దక్షిణ)/సాక్షి నెట్వర్క్: దక్షిణ భారత ద్వీపకల్ప ప్రాంతంపై ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం చురుగ్గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌పై గాలి విలోమ ప్రభావం తక్కువ స్థాయిలో ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ దృష్ట్యా రానున్న 48 గంటల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. మంగళ, బుధవారాల్లో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలతోపాటు రాయలసీమ ప్రాంతాల్లో కొన్నిచోట్ల విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు. గడచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. గుంటూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పుగోదావరి జిల్లాల్లోని పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. -
బలపడనున్న అల్పపీడనం.. భారీ వర్ష సూచన
సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల రానున్నా ఒకటి, రెండు రోజుల్లో కోస్తాలోని కొన్ని ప్రాంతల్లో వర్షాలు పడే అవకాశముందని విశాఖ వాతావరణ హెచ్చరికల కేంద్రం తెలిపింది. వాయువ్య బంగాళాఖాతానికి ఆనుకుని పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని తెలిపింది. రాష్ట్రంలో రేపు ఎల్లుండి మరీంత బలపడనున్న అల్పపీడనం. కోస్తా ప్రాంతల్లో ఈ రోజు నుంచే భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని తెలిపింది. విశాఖతీరం వెంబడి గంటకు 45 నుంచి, 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదుగాలులు బలంగా విచే అవకాశం ఉందని దీంతో మత్స్యకారులు ఎవరు చేపల వేటకు వెళ్లకూడదని విశాఖ వాతావరణ కేంద్ర తూఫాను హెచ్చరికలు జారీ చేసింది. -
రాష్ట్రంలో తగ్గిన సెగలు
సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి. సాధారణంకంటే 2 నుంచి 5 డిగ్రీలకు పైగా క్షీణించాయి. ఫలితంగా కోస్తాంధ్ర, రాయలసీమల్లో వేసవి ఛాయలు కనిపించలేదు. ఈ పరిస్థితి మరో రెండ్రోజులు కొనసాగవచ్చని వాతావరణ అధికారులు చెబుతున్నారు. నిన్నటి దాకా 43 డిగ్రీల వరకు నమోదైన ఉష్ణోగ్రతలు మంగళవారం నాటికి 38 డిగ్రీలకంటే తక్కువకు పడిపోయాయి. రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా జంగమహేశ్వరపురం(రెంటచింతల)లో 38.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకంటే 3.3 డిగ్రీలు తక్కువ. అనంతపురంలో 34 డిగ్రీలు (5.3 డిగ్రీలు తక్కువ) రికార్డయింది. మిగతా ప్రాంతాల్లో 33, 36 డిగ్రీల మధ్య నమోదయ్యాయి. గత నెలరోజుల్లో ఇంత తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే ప్రథమం. ప్రస్తుతం దక్షిణ తమిళనాడు నుంచి కొమరిన్ ప్రాంతం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు తూర్పు, దక్షిణ గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారులు ‘సాక్షి’కి చెప్పారు. మరోవైపు బుధ, గురువారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో అకాల వర్షాలు పడతాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి నివేదికలో తెలిపింది. అదే సమయంలో అక్కడక్కడ పిడుగులకు ఆస్కారముందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గడచిన 24 గంటల్లో నర్సీపట్నంలో 6, అచ్చంపేట 5, రాచెర్ల 4, పాడేరు, తనకల్, ఆత్మకూరులలో 3, పొదిలి, పులివెందులల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. -
ఉపరితల ఆవర్తనం... పలుచోట్ల వర్షాలు
విశాఖ: కర్ణాటక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు విశాఖ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ ఆవర్తనం ఏర్పడ్డ ప్రాంతం నుంచి లక్షద్వీప్ వరకు ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగనున్నట్టు తెలిపింది. ఆవర్తన ప్రభావంతో ఆదివారం, సోమవారం రాయలసీమ, కోస్తా, తెలంగాణలో ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ ఒడగళ్లు పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు స్వల్పంగా ఉష్ణోగ్రతలు తగ్గనున్నట్టు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. -
వాయుగుండం ఏర్పడే అవకాశంలేదు
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరానికి ఆనుకుని వాయవ్య దిశగా అల్పపీడనం పయనించినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం లేదు. ఛత్తీస్‌గఢ్ దగ్గర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం దగ్గర ఉపరితల ఆవర్తనం 7కి.మీ ఎత్తువరకు ఆవరించింది. కోస్తా ఆంధ్రలో రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కోస్తాంధ్రలో ఇప్పటి వరకు మెంటాడలో 10 సెం.మీ, కొండపల్లిలో 8సెం.మీ, పాడేరులో 8సెం.మీ, గజపతినగరంలో 7సెం.మీ, మరకముడిదాం, ఎస్ కోట, బలిజపేటలలో 6సెం.మీ, పార్వతీపురం, వేపాడ, పలాస, తెర్లాం, నెల్లిమర్లలలో 5సెం.మీ వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉండగా, విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూనేరు సమీపంలో నాగావళి నదిలో పడవ బోల్తాపడింది. గిరిజనులు సురక్షితంగా బయటపడ్డారు.