
విశాఖలోని తుఫాను హెచ్చరిక కేంద్రం
విశాఖపట్నం: ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిషా తీరానికి ఆనుకుని వాయవ్య దిశగా అల్పపీడనం పయనించినట్లు విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం అల్పపీడనం వాయుగుండగా మారే అవకాశం లేదు. ఛత్తీస్‌గఢ్ దగ్గర అల్పపీడనం కేంద్రీకృతమై ఉంది. అల్పపీడనం దగ్గర ఉపరితల ఆవర్తనం 7కి.మీ ఎత్తువరకు ఆవరించింది.
కోస్తా ఆంధ్రలో రాగల 24 గంటల్లో కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రెండు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. కోస్తాంధ్రలో ఇప్పటి వరకు మెంటాడలో 10 సెం.మీ, కొండపల్లిలో 8సెం.మీ, పాడేరులో 8సెం.మీ, గజపతినగరంలో 7సెం.మీ, మరకముడిదాం, ఎస్ కోట, బలిజపేటలలో 6సెం.మీ, పార్వతీపురం, వేపాడ, పలాస, తెర్లాం, నెల్లిమర్లలలో 5సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఇదిలా ఉండగా, విజయనగరం జిల్లా కొమరాడ మండలం పూనేరు సమీపంలో నాగావళి నదిలో పడవ బోల్తాపడింది. గిరిజనులు సురక్షితంగా బయటపడ్డారు.