
ఆలస్యంగా నైరుతి రుతుపవనాలు!
* వెల్లడించిన భారత వాతావరణ విభాగం
* జూన్ 5న కేరళలో ప్రవేశించే అవకాశం
ఈ ఏడాది తొలకరి జల్లులు నాలుగు రోజులు ఆలస్యంగా దేశాన్ని పలకరించనున్నాయి. జూన్ ఐదున నైరుతి పవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం గురువారం తెలిపింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి.
న్యూఢిల్లీ: ఈ ఏడాది తొలకరి జల్లులు నాలుగు రోజులు ఆలస్యంగా దేశాన్ని పలకరించనున్నాయి. జూన్ ఐదున నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని భారత వాతావరణ విభాగం గురువారం తెలిపింది. సాధారణంగా జూన్ 1న నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. ఇది నాలుగు రోజులు అటూ ఇటూ అవుతుంటుంది. గతేడాది రుతుపవనాలు జూన్ 3న ప్రవేశిస్తాయని వాతావరణ విభాగం అంచనా వేయగా.. జూన్ 1 కల్లా కేరళలో వర్షాలు ప్రారంభమైయ్యాయి. అంతక్రితం ఎడాది జూన్ 5న రుతుపవనాలు దేశ ప్రధాన భూభాగాన్ని తాకాయి. అయితే ఈ ఏడాది పసిఫిక్ మహాసముద్రంలోని ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది.
దీంతో ఖరీఫ్ పంటలకు కీలకమైన నైరుతి రుతుపవనాలు నిరాశపరిస్తే వరి, పత్తి, సోయా, మొక్కజొన్న లాంటి పంటల దిగుబడులు తగ్గే ప్రమాదం పొంచి ఉంటుందని ఆ విభాగం భావిస్తోంది. భూమధ్య రేఖ వద్ద గాలుల ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో అండమాన్ దక్షిణ తీరానికి రుతుపవనాలు చేరే అవకాశం ఉందని వాతావరణ విభాగం తన ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజులుగా అక్కడ వర్షాల్లో క్రమేపీ పెరుగుదల కనిపిస్తోందనిపేర్కొంది. అవి బలపడి జూన్ 5న కేరళకు చేరతాయని చెప్పింది. అయితే పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతంలో వానలు తక్కువగా పడతాయని సౌత్ ఆసియా పసిఫిక్ అవుట్‌లుక్ ఫోరమ్ తెలిపింది. తూర్పు ప్రాంతంలోని తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతదేశంలో సాధారణ వర్షాలు పడతాయని చెప్పింది.
‘స్కైమెట్’ ఏమిచెబుతోందంటే..
సాక్షి, హైదరాబాద్: సాధారణం కంటే రెండు రోజులు ముందుగా మే 28న నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయని దేశంలోనే తొలి ప్రైవేట్ వాతావరణ అంచనాల సంస్థ స్కైమెట్ అంచనా వేస్తోంది. అయితే ఆ తరువాత మాత్రం కొంచెం భిన్నంగా వాటి విస్తరణ ఉంటుందని ఆ సంస్థ శాస్త్రవేత్త ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. మే నెల 28న కేరళ తీరాన్ని తాకిన తరువాత మేఘాలు పశ్చిమ తీరం వెంబడి ఎగబాకి జూన్ 7-8 తేదీలకల్లా ముంబైని తాకుతాయని, ఈ క్రమంలో తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, రాయలసీమల్లోనూ వర్షాలు పడే అవకాశముందని చెప్పారు.
జూన్ 16కు ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని ఆవరిస్తాయని ఆయన తెలిపారు. జూన్ 18 తర్వాత దేశం మొత్తం విస్తరించేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడతాయని ఆయన వివరించారు. ప్రస్తుత అంచనాల ప్రకారం నైరుతి రుతుపవనాలు జూన్ 24 నాటికి ఢిల్లీకి చేరతాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో కేరళ, దక్షిణ కర్ణాటక ప్రాంతాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇదంతా రుతుపవనాల ప్రభావమని చెప్పలేమని స్కైమెట్ శాస్త్రవేత్త తెలిపారు. కొన్ని నిర్దిష్ట ప్రాంతాల్లో మూడు రోజులపాటు వరుసగా వానలు కురిసినప్పుడు మాత్రమే నైరుతి రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ సంస్థ ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.